గత పదేళ్లల్లో రాజధాని లేకపోడంపై మేథావులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని బ్రహ్మ పదార్థంగా మారి పోయిందని రిటైర్డ్ ఫ్రొఫెసర్ కేఎస్ చలం అభిప్రాయపడ్డారు. అమరావతి అంటే దేవతలు ఉండేది. దేవతలు ఉండే ప్రాంతం మనుషులకు కనిపించదు కదా. ఉందో లేదో కూడా తెలియదు. రాష్ట్ర ప్రజలదీ అదే పరిస్థితి అన్నారు.
చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ రాజధాని పేరుతో ఇప్పటికీ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు హైదరాబాద్‌లో ఉండి పరిపాలించేందుకు అవకాశమున్నా దాన్ని చేజార్చుకొని ఏపీకి చంద్రబాబు వచ్చారు. నాగార్జున యూనివర్శిటీని రాజధాని భవనాలుగా ఉపయోగించుకోవాలని చెప్పాం. గుంటూరులో ఖాళీగా ఉన్న కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోకి తాత్కాలికంగా యూనివర్శిటీని మార్చాలని సూచించాం. మా సూచనలను పక్కన పెట్టారు. తుళ్లూరు ప్రాంతంలో 33వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ప్రభుత్వ భూములు మరో 20వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. మొత్తం 54వేల ఎకరాలు రాజధాని ప్రాంతానికని చంద్రబాబు కూడగట్టారు. ప్రస్తుతం నిర్మించిన రాజధాని భవనాలకు తాత్కాలికమని పేరు పెట్టారు. సచివాలయాన్ని ఐకానిక్ టెక్నాలజీతో 44 అంతస్తుల భవనం నిర్మించాలని నిర్ణయించారు. పై అంతస్తులో హెలికాప్టర్ దిగేలా డిజైన్ చేయించారు. సింగపూర్ వాళ్లను కలుపుకొని 1,691 ఎకారల్లో భూలోక స్వర్గాన్ని నిర్మించాలని ఇందుకు రూ. 6వేల కోట్లు ఖర్చు అవుతుందని రూ. 330 కోట్లు సింగపూర్ వాళ్లు ఇస్తారని, మిగిలింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. స్విజ్ చాలెంజ్ పేరుతో ఈ ప్రాజెక్టును సింగపూర్ వారికి అప్పగించేందుకు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. విశాఖలో వైఎస్‌ఆర్ హయాంలోనే భూములు కొనుగోలు చేశారు. వీటికి విలువ పెంచడం కోసం ప్రజలను మోసం చేసి 3 రాజధానుల నాటకమాడుతున్నారు. ఇవాల్టికీ ఆ మోసం జగన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీలో రాజధాని లేక పోవడానికి ఇద్దరూ ప్రధాన కారకులేనని వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పారు.
చంద్రబాబు పాలనలో..
10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా లేకుండా పోయింది.
ఉన్నట్టుండి 2016 జూన్‌లో విజయవాడకు వచ్చిన చంద్రబాబు ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు.
ఓటుకు నోటు కేసే దీనికి ప్రధాన కారణం. ఎమ్మెల్సీ ఓటు కొనుగోలు చేస్తూ స్ట్రింగ్ ఆపరేషన్‌లో వీడియోలు, ఆడియోలకు అడ్డంగా బుక్ అయ్యారు.
కేసు నమోదు చేసి చంద్రబాబుతో పాటు నేటి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేశారు.
అరెస్టు కావడం తప్పదని భావించిన చంద్రబాబు ఉన్న పళంగా విజయవాడ వచ్చి పడ్డారు.
అక్కడ నుంచి ఏపికి రాజధాని కష్టాలు మొదలయ్యాయి.
రాజధాని తొలుత నూజివీడన్నారు. తర్వాత దొనకొండన్నారు. అటుఇటు తిప్పి సరిపుచ్చారు.
తర్వాత రాజధాని కోసం శ్రీకృష్ణ కమిటీ వేశారు. దొనకొండ–అద్దంకి ప్రాంతం రాజధానికి అనువుగా ఉంటుందని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
ఈ రిపోర్టును చంద్రబాబు తుంగలో తొక్కారు. మంత్రులతో కొత్త కమిటీని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు సూచనల మేరకు తుళ్లూరు ప్రాంతం అనువుగా ఉంటుందని మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చింది.
తుళ్లూరు ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ఖరారు చేశారు.
దీనికి ఒక పేరు పెట్టాలని మేధోమధనం జరిగింది. చివరికి అమరవాతి అని పేరును ఖరారు చేశారు.
రాజధానికి భూమి కోసం భూ సేకరణకు పోకుండా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చారు. రైతులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడంతో పాటు కమర్శియల్ ఏరియాలో కొన్ని ప్లాట్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది.
కేంద్రానికి విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ వివిధ అంశాలతో పాటు రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టును పంపింది.
రాజధాని నిర్మాణానికి వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది.
ఆంధ్రప్రదశ్‌లో రాజధాని నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చంద్రబాబు సింగపూర్ నిపుణులను పిలిపించి గ్రాఫిక్స్ తయారు చేయించారు.
ఈ గ్రాఫిక్స్ దేశ విదేశాల్లో చూపిస్తూ మూడేళ్ల కాలం గడిపారు.
అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రధాని మోదీని ఆహ్వానించి శంకుస్థాపన ఆర్భాటంగా చేశారు.
ప్రధాని ఢిల్లీ నుంచి వస్తూ పిడికెడు మట్టి, చెంబెడు నీళ్లు తెచ్చి ఇదే మీకు మహా భాగ్యమన్నారు.
ఫౌండేషన్ మొదలైంది. ఆ తర్వాత ఎన్నికల వాతావారణం వేడెక్కింది.
రాజధాని నిర్మాణం పేరుతో మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు భవన సముదాయాల నిర్మాణాలను మొదలు పెట్టారు. అమరావతి ప్రాంతం నుంచి విజయవాడ,గుంటూరు నగరాలను కలుపుతూ రహదారుల నిర్మాణాలు మొదలు పెట్టారు.
దేశ విదేశాల నుంచి అమరాతి హైటెక్ నిర్మాణాలను చూసేందుకు ఎంతో మంది నిత్యం వచ్చి పోతున్నారు.
ఈ నిర్మాణాల నిమిత్తం వేల కోట్ల విలువైన మెటీరియల్ తెప్పించారు.
అప్పటికే తాత్కాలిక నిర్మాణాల పేరుతో తాత్కాలిక సచివాలయం ఐదు బ్లాకులతోను, అసెంబ్లీ, శాసన మండలి భవన సముదాయాన్ని నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు భవన నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఇది కూడా తాత్కాలిక భవనమేనని చంద్రబాబు నాడు ప్రకటించారు.
పరిపాలనకు సంబంధించి నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమేనని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోగా బాబు ఐదేళ్ల పాలన ముగిసింది.
అమరావతి విధ్వసమే ధ్యేయంగా..
2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి జగన్ మోహన్‌రెడ్డి తన విశ్వరూపాన్ని చూపడం మొదలు పెట్టారు. రాజధాని విషయంలో ఆయన వైఖరి ఎలా ఉందంటే..
చంద్రబాబు క్యాంపు కార్యాలయం పక్కన నిర్మించిన ప్రజావేదినకు కూలగొట్టి మెటీరియల్‌ను అక్కడే వదిలేశారు.
చంద్రబాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ప్రతి సారి చూస్తూ బాధపడాలనేది జగన్ మనసులోని భావన.
అమరావతి నిర్మాణాలపై దృష్టి సారించారు. పది రోజులు గడిచాక రాజధాని ప్రాంతంలో జగరుతున్న అన్ని నిర్మాణ పనులను ఒక్క ఆర్డర్‌తో ఆపేశారు.
అప్పటికే నిర్మాణాల కోసం తరలించిన వేల కోట్ల విలువైన ఇనుము, కంకర, సిమెంట్, పైపులు వంటి మెటీరియల్‌ను ఎక్కడిక్కడే వదిలేశారు.
నిర్మాణ పనుల కోసం కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన యంత్రాలు రెండు రోజుల్లో పూర్తిగా వెనక్కెళ్లి పోయాయి. కూలీలు నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు శిథిలమయ్యాయి.
అక్కడ నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానం సైతం కొంత కాలం నిర్మాణ పనులు ఆగిపోయాయి. టీటీడీ వారు మొదట కేటాయించిన బడ్జెట్‌లో సగానికి కోత వేసి, ఒరిజినల్ ప్లాన్‌ను కుదించి పనులు కానించారు.
ఇక్కడ నుంచి జగన్ రాజాధాని డ్రామాకు తెర లేపారు.
మూడు రాజధానుల బిల్లు తెరపైకి తెచ్చారు.
విశాఖను పరిపాలన రాజధాని, అమరావతిని శాసన రాజధాని, కర్నూలును న్యాయరాజధాని అంటూ మూడు ముక్కల గేమ్‌కు పురుడు పోశారు.
ఈ నేపథ్యంలో అమరావతే రాజధానిగా ఉండాలని పోరాటం ప్రారంభమైంది.
భూములిచ్చిన రైతులు రోడ్లెక్కారు.
తెలుగుదేశం పార్టీ నుంచి, భూములిచ్చిన రైతుల నుంచి హైకోర్టులో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పిటీషన్‌లు దాఖలయ్యాయి.
విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు రాజధానుల బిల్లు చెల్లదని, ఇది విభజన చట్టానికి వ్యతిరేకమని, అమరావతే రాజధానిగా కొనసాగాలని తీర్పు నిచ్చింది.
ఈ తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ లోగా టెక్నికల్ కారణాలు ఉన్నాయంటూ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు.
అయినా మధ్య మధ్యలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ వచ్చే నెలలో విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని చెబుతూ వచ్చారు.
పార్లమెంట్‌లో పలు మార్లు పలువురు ఎంపీలు ఏపీకి రాజధాని ఎక్కడంటూ వేసిన ప్రశ్నలకు అమరావతే రాజధాని అని ప్రకటించడం విశేషం.
అలా ఐదేళ్లు గడిచాయి. తీరా 2024 ఎన్నికలు కూడా వచ్చాయి. ఇప్పుడు మాత్రం ప్రచారంలో మూడు రాజధానుల మాట ఎత్తడం లేదు.
అమరాతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలా వద్దా అనే అంశంపై సుప్రీం కోర్టు నేటికీ తీర్పును వెలువరించ లేదు.
ఇపుడు చెప్పండి.. రాజధాని విధ్వంసకులు ఎవరు? వీరిద్దరు కాదా..? ఒకరు గ్రాఫిక్స్‌తో సరిపెడితే మరొకరు చంద్రబాబుపై ఉన్న కక్షతో అమరావతి అనే ప్రాంతాన్ని నామ రూపాల్లేకుండా చేసి ఆ ప్రాంతంలో ఏమీ లేదనిపించారు. చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ఉమ్మడి రాజధానిని వదిలేసి చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చారు. జగన్ చంద్రబాబుపై ద్వేషాన్ని నింపుకొని ముందుకు సాగారు. వీరిద్దరూ వారి స్వార్థం కోసం ఆంధ్ర ప్రజలను బలి పశువులను చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉచితాల పేరుతో రాష్ట్రం దివాలా తీయగా, తాను అధికారంలోకి వస్తే మరిన్ని ఉచితాలిస్తానంటూ చంద్రబాబు జగన్‌ను మించి హామీలు ఇస్తున్నారు. రాజధాని ఇప్పటి వరకు లేకుండా పోయిందని ప్రజలు అనుకుంటున్నారు. భవిష్యత్‌లో ఆంధ్ర రాష్ట్రం అప్పులిచ్చిన వారి గుప్పెట్లోకి పోవడం ఖాయమని మేథావులు అభిప్రాయపడుతున్నారు.రాజధాని లేని రాష్ట్రం ఎందుకైంది?