ఐ ప్యాక్ టీమ్ సిఎం జగన్ పార్టీని ఓడిస్తుందా? గెలిపిస్తుందా?

ఐ ప్యాక్ పై సీఎం జగన్ కు ఎందుకు అంత నమ్మకం. ప్రశాంత్ కిశోర్ చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని ఎందుకు అన్నారు.

Update: 2024-05-16 08:35 GMT

రాష్ట్ర వ్యాప్తంగా ఐ ప్యాక్ టీమ్ పై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం విజయవాడలోని ఐ ప్యాక్ టీమ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన టీము సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. 22 ఎంపి సీట్లు గెలువబోతున్నాం. 2019 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తాయి. ప్రజలకు ఈ ఐదేళ్లు గొప్ప పాలన అందించబోతున్నాం. ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెల కట్టలేనివి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అంటూ మాట్లాడిన మాటలు ఆసక్తిగా మారాయి.

ఐ ప్యాక్ ను నమ్ముకున్న జగన్

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ వారిని నమ్మలేదు. అధికార యంత్రాంగాన్ని నమ్మలేదు. కేవలం ఒక ఏజెన్సీని నమ్ముకున్నారు. పైగా ఆ ఏజెన్సీ కూడా గతంలో ప్రశాంత్ కిశోర్ స్థాపించింది. దానిని వేరే వారికి వదిలేసి ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం రాజకీయ పరిణామాలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారిని టీములో పెట్టుకుని కొందరు పనిచేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు సీఎం అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. చివరకు సాక్షి టీమును కూడా జగన్ నమ్మలేదు. సాక్షి టీములో చాలా మంది నమ్మకం లేని వారు ఉన్నారని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎపి సాక్షి టీముతో కాకుండా తెలంగాణ సాక్షి టీముతో ఎన్నికలకు ముందు మూడు సార్లు సర్వేలు చేయించారు. గెలుపు ఓటములపై ఈ సర్వేలు జరిగాయి. ఎపిలో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందుతుందని రిపోర్టులు వచ్చాయి. అయినా ఐ ప్యాక్ వారి సూచనలు, సలహాల మేరకే టిక్కెట్లు ఇచ్చి భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పడం వెనుక రహస్యం ఏమిటనే దానిపై చర్చ సాగుతోంది.

అధికార యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు

జగన్ కు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై పెద్దగా నమ్మకం లేదని తేలిపోయింది. ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా వారిని పెద్దగా వినియోగించలేదు. అసలు ప్రభుత్వ శాఖలే నిర్వీర్య మయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులకు పెద్దగా పని లేదు. అయినా వారిని పట్టించుకోకుండా ఐ ప్యాక్ టీం సేవలు వెలకట్టలేనివని మాట్లాడటం పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే ఈ టీమ్ కు కోట్ల రూపాయలు జీతాల రూపంలో ఇచ్చారు. అదనంగా ఆర్థికంగా సీఎం వారిని ఆదుకున్నారు. అయినా వెల కట్టలేని సేవలు అనడంపైనా చర్చ సాగుతూనే ఉంది. అధికారులపై కాకుండా ఒక ప్రైవేట్ సంస్థపై ముఖ్యమంత్రి ఆధారపడటంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు అనే వారు ప్రభుత్వానికి సంబంధించిన వారు కాదనే భావన సీఎం గజన్ లో వుందని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఐ ప్యాక్ టీమ్ సభ్యులందరి పేర్లు అడిగి తెలుసుకున్నారు. వారితో పిచ్చాపాటీగా మాట్లాడారు. పెరిగిన ఓట్లు తమను గెలిపిస్తాయనే ధీమాలో తెలుగుదేశం పార్టీ ఉంది. దేశమంతా ఆశ్చర్యపోయే రిజల్ట్ వస్తాయని సీఎం జగన్ అనటంలో ఆంతర్యం ఏమిటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

Tags:    

Similar News