పోటీ చేసిన ప్రతీసారి గెలవడం గంటా నైజం
ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత గంటా. ప్రతీసారి నియోజక వర్గం మార్చడమూ అక్కడ నుంచి గెలుపు గంట మోగించడం ఆయన నైజం.
Byline : The Federal
Update: 2024-04-30 05:29 GMT
ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకులు అతి కొద్ది మందే ఉంటారు. పొలిటిక్ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఒక్క సారి కూడా ఓడి పోని వారు అరుదు. అందులో పార్టీలు మారినా గెలుపు జెండాను ఎగుర వేసిన వారు చాలా తక్కువుగా ఉంటారు. వారిలో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఓటమి ఎరుగని నాయకుడిగా గంటా రికార్టు సృష్టించారు. అటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఓటమి చెంద కుండా తన రికార్డును కాపాడుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు పోటీ చేయగా ఐదు సార్లు గెలిచి తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు.
తెలుగుదేశంతో మొదలైన రాజకీయ ప్రయాణం
గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఎంట్రీ ఇచ్చిన తొలి సారే ఆయన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గుడివాడ గురునాథరావును, అన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన భీశెట్టి అప్పల త్రినాథరావును గంటా శ్రీనివాసరావు ఓడించారు. దాదాపు 58వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. తొలి ఎన్నికల్లోనే గెలుపు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇక అక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించారు. అనకాపల్లి నుంచి చోడవరానికి మకాం మార్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గంటా శ్రీనివాసరావు మరో సారి విజయం సాధించారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బాలిరెడ్డి సత్యారావుపై 9వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో గంటా గెలుపొందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అకనాపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే ఈ సారి పార్టీ మారారు. తెలుగుదేశం పార్టీ నుంచి మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో అదే పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులుగా సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి కొణతల రామకృష్ణ, టీడీపీ నుంచి దాడి వీరభద్రరావులు పోటీకి దిగారు. గంటా వీరిద్దరినీ ఓడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దాదాపు 10వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గంటా గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో గంటా చోటు దక్కించుకున్నారు.
2014లో తిరిగి టీడీపీలోకి
రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో పార్టీ మారారు. తిరిగి పాత గూటికి చేరారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన కర్రి సీతారామును గంటా సునాయసంగానే ఓడించారు. దాదాపు 37వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గంటా గెలుపొందారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా గంటా విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తరం నుంచి బరిలోకి దిగి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కేకే రాజుపై 1,944 ఓట్లతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఎదుర్కొంటున్నారు.
ప్లేసులు మార్చడం గంటా నైజం
గంటా శ్రీనివాసరావులో ఒక ప్రత్యేకత ఉంది. ఒకే చోట నుంచి కాకుండా ఒక్కోసారి ఒక్కో స్థానం నుంచి పోటీ చేయడం.. అక్కడ నుంచి గెలవడం ఆయన నైజం. ఇప్పటి వరకు అలానే జరుగుతూ వచ్చింది. ఈ సారి కూడా ప్లేసు మార్చారు. అయితే గతంలో ఒక సారి పోటీ చేసి గెలిచిన నియోజక వర్గమే కావడం గమనార్హం. తొలిసారి అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంటా అక్కడ నుంచి గెలిచారు. తర్వాత అసెంబ్లీపై దృష్టి పెట్టారు. చోడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి మకాం మార్చారు. 2004లో అక్కడ నుంచి గెలుపొందారు. తర్వాత అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గానికి మారారు. 2009లో అక్కడ నుంచి గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. తర్వాత మళ్లీ ప్లేస్ మార్చారు. ఈ సారి భీమిలి అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. 2014లో అక్కడ నుంచి మళ్లీ గెలిచారు. తర్వాత ఆ నియోజక వర్గాన్ని మార్చారు. విశాఖపట్నం ఉత్తరం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు. 2019లో అక్కడ నుంచి కూడా గెలుపొందారు. తాజాగా కూడా ఆయన ప్లేస్ మార్చారు. 2024 ఎన్నికల్లో భీమిలి నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మరి ఈ సారి కూడా గెలిచి గెలుపు గంటా మోగిస్తారో లేదా తొలి సారి పరాజయాన్ని చవి చూస్తారనేది వేచి చూడాలి.