బిక్కుబిక్కుమంటున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల రాజకీయ జీవితం డైలమాలో పడింది. ఎవరి సీటు మారినా, ఎవరికి సీటు రాకుండా పోయినా అంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లీల.;

Update: 2024-01-07 14:22 GMT
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాళ్లకు దండం పెరుడుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం

’నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారీటీలు’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతి సభలోనూ చెబుతుంటారు. అట్లాంటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు ఆ ఎస్టీలు, ఆ ఎస్సీలు ఎందుకు భయపడాల్సి వస్తోంది. వాళ్లందరూ ఎమ్మెల్యేలే.. ఒకసారి గెలిచిన వారే. అందరూ ఎస్సీలు, ఎస్టీలు.. అయినా సరే వాళ్లు సీఎం జగన్‌ను కలిసేందుకు అవకాశం దొరకడం లేదు.. ఎందుకిలా? అసలు ఏం జరుగుతోంది? ’నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీల’ సీట్లే ఎందుకు మారుతున్నాయి. ఇంటికెళ్లి బ్రతిమిలాడదామంటే రానివ్వడం లేదు. కాళ్లు పట్టుకుందామన్నా అవకాశం లేదు. దూరంగా ఉంచి మీకు టిక్కెట్‌ లేదని చెబుతున్నారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇదేమిటి? ఇలా ఎందుకు జరుగుతుతోంది? రాజరిక పోకడలతో పాలన సాగుతున్నదా? అందుకే వెనుకబడిన వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారేమో. అక్కడక్కడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రోశం చూపించడం లేదు. ఎందుకని.. దీనిపై సమగ్ర కథనం.


Delete Edit


ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 30 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా కొండపి మినహా మిగలిన 29 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గత ఎన్నికల్లో విజయం సాధించారు. అంటే ఎస్సీ, ఎస్టీల్లో ఎంత బలం వైఎస్సార్‌సీపీకి ఉందో అర్థమవుతుంది. ఇంత బలం ఉన్న ఈ వర్గాల్లో ఎమ్మెల్యేలను ఎందుకు ముఖ్యమంత్రి జగన్‌ మార్చాలనుకున్నారు. ఇప్పటి వరకు మార్చిన ఎమ్మెల్యేల్లో 12 మంది ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఇంకా 13 నియోజకవర్గాలకు చెందిన వారిని మార్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మార్చేందుకు సిద్ధంగా ఉన్న నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల రాజకీయ జీవితం డైలమాలో పడింది. ఇప్పటికే నియోజకవర్గాలు చేంజ్‌ అయిన వారు, అసలు టిక్కెట్లు రాని వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏమిటో అర్థం కాకుండా ఉంది. అరకు వ్యాలీ పార్లమెంట్‌ సభ్యురాలుగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి మార్చారు. దీనిని అక్కడి కొందరు గిరిజనులు వ్యతిరేకించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆ వర్గాల నుంచి కానీ, ఇతరుల నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. కేవలం ఎమ్మెల్యేల్లో మాత్రమే తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో అందరూ విద్యాధికులే..
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో ఉన్న 29 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ ఉన్నత చదువులు చదువుకున్న వారే. అన్నీ ఆలోచించగలిగిన వారు. ప్రజలకు చేరువ కావడంలో వీరిని మించిన వారు లేరనే వాదన కూడా ఉంది. ఎంత కిందికి ఉండాలో అంత కిందకు దిగి ప్రజల వద్దకు వెళుతున్నారు. స్థానికంగా ఉండే అగ్రవర్ణం వారితోనూ సఖ్యతగా ఉంటున్నారు. అయినా ఎందుకు వీరు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారనే వాదన కూడా ఉంది.
వీరిలో వారసత్వపు రాజకీయాలు చాలా తక్కువ
ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు కానిస్టెన్సీల్లో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థుల వారసులు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఒకరికి ఒకసారి సీటు దక్కితే మరోసారి సీటు దక్కడం లేదు. అంతటితోనే వారి రాజకీయ జీవితానికి ఎండ్‌ కార్డు పడుతుంది. అలా కాకుండా ఎక్కడైనా వాసరత్వంగా ఎస్సీ, ఎస్టీల నుంచి రాజకీయాల్లో ఉన్నారంటే వారు అక్కడి అగ్రవర్ణాల వారి దగ్గర నమ్మినబంటు అయి ఉండాలి. లేకుంటే తలదించుకుని బతికేవారైనా అయి ఉండాలనే వాదన చాలా మంది దళిత మేధావుల్లో ఉంది. పైగా వీరిలో ఆత్మాభిమానం కూడా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. సీటు దక్కకుంటే వదిలేసి వెళుతున్నారు తప్ప తమ వర్గాలను రెచ్చగొట్టి రంగంలోకి దిగటం లేదు. నాకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఇలా ఉంచుకుంటే చాలనే భావన కూడా వీరిలో ఎక్కువగా ఉందని స్పష్టమవుతున్నది.
ఎక్కువ మంది ఆర్థిక అండదండలు లేనివారే..
ఎస్సీ, ఎస్టీల నుంచి ఎన్నికల బరిలోకి వస్తున్న వారు ఎక్కువ మంది ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారు మాత్రమేనని చెప్పొచ్చు. వారిలో ఎవరో కొందరు మాత్రమే ఆర్థికంగా ఉన్న వారు ఉంటున్నారు. వారు కూడా రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు అయితే తప్ప సాధారణ ఉద్యోగులు, వ్యవసాయం చేసే వారు ఆర్థికంగా తీవ్ర లోటును ఎదుర్కొంటున్నవారే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఎవరిపైనో ఒకరిపైన ఆధారపడాల్సిందే. ప్రజల్లో వీరికి మంచి పేరు ఉన్నా ఆర్థికంగా లేనివారు అయితే ఒక్కోసారి టిక్కెట్‌ కూడా దక్కించుకోలేకపోతున్నారు. ప్రధానమైన నేతలను అంటిపెట్టుకుని ఉంటున్న వారు మాత్రం రాజకీయాల్లో రాణిస్తున్నారని చెప్పొచ్చు. బాగా డబ్బులు పెట్టగలిగిన వారికి సీటు దక్కుతుంది. అది కూడా వారు కోరుకున్న చోట రాదు. పాలకులు ఎక్కడ ఇస్తారో అక్కడ పోటీ చేయాల్సి ఉంటుంది. గెలిపించే బాధ్యత మేము చూసుకుంటాం. డబ్బు పెట్టడం నీవంతని కూడా అభ్యర్థుల ఎంపిక జరగుతుందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు
ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పార్టీ పెట్టి నడిపిస్తున్న వారు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో వారు చెప్పినట్లు తలూపాల్సిందే తప్ప తమకు నచ్చిన మంచి పని కూడా చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంత్రులుగా, మాజీ మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దశలో లేరు. గతంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత కానీ, ఇప్పుడు పనిచేస్తున్న తానేటి వనిత కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు ఒక్కటి కూడా లేవు. పైగా ఎక్కడైనా ఏదైన అరాచకం జరిగినా అధినేతకు చెప్పకుండా వెళ్లేందుకు వీలు లేదు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో కొందరు కూలీలు పనులకు వెళున్న ట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో జరిగింది. అక్కడికి వెళతానన్న హోం మంత్రి సుచరితను అవసరం లేదని చెప్పి వెళ్లకుండా చేశారు. అయితే పాలకులు ఎప్పుడూ ఇటువంటి అంశాలపై తాము తప్పు చేశామని అంగీకరించరు. తానేమీ చేయలేకపోతున్నానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సైతం తన సన్నిహితుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడప్పుడూ తన ఆవేదన వెళ్లగక్కుతూనే ఉన్నారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కారు
సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆదిమూలం ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు మొక్కారు. తనకు సీటు దక్కేలా చూడాలని వేడుకున్నాడు. సత్యవేడు నుంచి నన్ను మారుస్తున్నారని తెలిసింది. నాకు నియోజవర్గంలో మంచి పేరు ఉంది. నేను తప్పకుండా గెలుస్తానని ఆయన పెద్దిరెడ్డి వద్ద వాపోయారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం బాబు అనేక సార్లు తన ఆవేదన వెల్లగక్కారు. పెత్తందార్ల వద్ద బానిసలుగా పనిచేస్తే మాకు తిక్కెట్లు తక్కుతాయి, లేకుంటే టిక్కెట్లు ఇవ్వరా అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
చేతకాని వర్గ రాజకీయాలు
ఎస్సీ, ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజవర్గాల్లో వర్గ రాజకీయాలు లేవంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ నియోజకవర్గాల్లో కూడా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల వారే వర్గ రాజకీయాలు నడుపుతుంటారు. ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోట సామాజిక వ్యత్యాసాలు పాటించకుండా ఎమ్మెల్యేతో సానుకూలంగా ఉంటున్నా స్థానికంగా ఉన్న అగ్రవర్ణ నాయకులు ఎమ్మెల్యే వద్దకు కొందరిని వెళ్లకుండా నిరోధిస్తుంటారు. ఇంకా విచిత్రమేమిటంటే ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి వారే పెత్తనం చెలాయించేలా పాలకులు చేస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఎమ్మెల్యేలకు ఒక్క ప్రోగ్రామైనా ఉందా?
2019 ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు చేసేందుకు ఒక్క కార్యక్రమమైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలే కాదు ఓసీలకు కూడా మినహాయింపు లేదు. ముఖ్యమంత్రి నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కుతారు. సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో పడతాయి. ఇది తప్ప వేరే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా అంటే ఒక్కటీ లేదని చెప్పాలి. ఈ దశలో ఏ ఎమ్మెల్యే అయినా ఏమి చేయలడు, పైగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు సహకరించే వారు కూడా తక్కువ మందే ఉంటారు.
వీరికి సీట్లు దక్కలేదు
వైఎస్సార్‌సీపీ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో అరకు వ్యాలీ ఎస్టీ ఎమ్మెల్యే చెట్టి పల్గుణ, ఎస్సీల నుంచి పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల కారాడ ఎలీజాలు ఉన్నారు.
వీరికి నియోకవర్గాలు మార్చారు
కాగా ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించిన వారిలో సీట్లు మారిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు గొడ్డేటి మాధవి, కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి, కంభాల జోగులు, మేకతోటి సుచరిత, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌లు ఉన్నారు.
డైలమాలో ఈ ఎమ్మెల్యేల సీట్లు
పార్వతీపురం అలజంగి జోగారావు, పాయకరావుపేట గొల్లబాబూరావు, అమలాపురం పినిపె విశ్వరూప్, గోపాలపురం తలారి వెంకట్రావు, తిరువూరు కె రక్షణనిధి, నందిగామ డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు, గూడూరు రాపాక వరప్రసాదరావు, సూళ్లూరు పేట కిలివేటి సంజీవయ్య, బద్వేలు డాక్టర్‌ సుధ, కొండూరు కోమట్ల శ్రీనివాసులు, నందికొటుకూరు తొగురు ఆర్థర్, సింగనమల జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎం తిప్పేస్వామి, సత్యవేడు కె ఆదిమూలం, గంగాధర నెల్లూరు కె నారాయణస్వామి, పూతలపట్టు ఎం బాబుల పరిస్థితి డైలమాలో ఉంది. వీరిలో తప్పకుండా కొందరిని తప్పిస్తారని, మరికొందరికి నియోజకవర్గ మార్పులు ఉంటాయని విశ్వసనీయ సమాచారం.
కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాముల పుష్పా శ్రీవాణి, కోవూరు ఎమ్మెల్యే, హోం మంత్రి తానేటి వనిత, గోపాలపురం తలారి వెంకట్రావుల గురించి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఊహాగానాలు రాలేదు. అయితే వీరి మార్పు ఉంటుందో, ఉండదో వేచి చూడాల్సిందే. ఇంకా చాలా మంది సిట్టింగ్‌లను మార్చే క్రమంలో ఏమైనా జరగొచ్చు. ఎవరిసీటైనా గల్లంతు కావొచ్చు. లేదా నియోజకవర్గాలు మారిపోవచ్చు.
సర్వేల పేరుతో తిరస్కారం
తిరస్కరించేందుకు ఒక మంచి ఆయుధం సర్వే. మీ గురించి సర్వేలో నెగటివ్‌ రిపోర్టులు వచ్చాయి. అందువల్ల సీటు ఇవ్వడం లేదు. తర్వాత చూద్దాం. పార్టీలో నీకు మంచి స్థానం ఉంటుందని చెప్పి సీటు తిరస్కరిస్తున్నారు. కొందరికి ఈ నియోజకవర్గంలో సీటు ఇవ్వడం లేదు. పలానా నియోజకవర్గంలో ఇస్తున్నాం. అక్కడి నుంచి పోటీ చేయి. మిగిలిన విషయాలు మేము చూసుకుంటామని నేతలు చెబుతున్నారు. ముక్కు, మొఖం తెలియని నిజయోజకవర్గంలో నేనెలా పోటీ చేయాలనే ఆలోచనతో కొందరు ఎమ్మెల్యేలు వెనుకడుగు వేస్తున్నారు.
Tags:    

Similar News