జ్ఞానశేఖరన్‌కు డీఎంకే నేతలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలి..
‘డీఎంకే కార్యకర్త కొట్టూరు షణ్ముగంకు జ్ఞానశేఖరన్ ఫోన్ చేశాడు. డీఎంకే ముఖ్యనేతలతో నిందితుడు కలిసి దిగిన ఫొటోలున్నాయి.’- అన్నామలై;
చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో జరిగిన లైంగిక దాడి ఘటనలో జ్ఞానశేఖరన్ దోషిగా తేలడంతో చెన్నై మహిళా కోర్టు అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష, రూ.90 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని కొట్టూరుపురానికి చెందిన బిర్యానీ విక్రేత జ్ఞానశేఖరన్.. గతేడాది డిసెంబర్ 23న ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించి బయటకు చెబితే వీడియో బయటపెడతానని బాధితురాలిని బెదిరించారు. ఘటనను అడ్డుకునేందుకు యత్నించిన ఆమె స్నేహితుడిని కూడా జ్ఞానశేఖరన్ కొట్టి గాయపర్చాడు.
‘కాల్ డేటాపై దర్యాప్తు చేయాలి..’
నిందితుడి కాల్ డేటాపై లోతుగా దర్యాప్తు చేయాలని తమిళనాడు బీజేపీ (BJP) నాయకుడు అన్నామలై డిమాండ్ చేస్తు్న్నారు. జ్ఞానశేఖరన్‌కు DMK రాజకీయ ప్రముఖులతో దగ్గర సంబంధాలున్నాయని ఆయన ఆరోపిస్తు్న్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రోజు (డిసెంబర్ 24) రాత్రి 8.55 గంటలకు అతను స్థానిక కొట్టూర్పురం స్టేషన్‌లోని ఒక సీనియర్ పోలీసు అధికారికి ఫోన్ చేశాడని, ఆరు నిమిషాల తర్వాత రాత్రి 9.01 గంటలకు అదే అధికారి తిరిగి జ్ఞానశేఖరన్‌కు తిరిగి ఫోన్ చేయడంపై కూడా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు ఆ పోలీసు అధికారిని విచారించారా? అని ప్రశ్నించారు.
అధికార డీఎంకే(DMK)తో సంబంధాలు ఉన్నాయా?
నిందితుడు జ్ఞానశేఖరన్‌ను పోలీసులు 24వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. అంతకు కొన్ని నిముషాల ముందు నిందితుడు స్థానిక డీఎంకే కార్యకర్త కొట్టూరు షణ్ముగంతో ఆరుసార్లు మాట్లాడారని అన్నామలై ఆరోపిస్తున్నారు. అదే రోజు విడుదలైన జ్ఞానశేఖరన్ తిరిగి రాత్రి 8.34 గంటల ప్రాంతంలో షణ్ముగంకు ఫోన్ చేశాడని, ఆ తర్వాత షణ్ముగం తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌కు ఫోన్ చేశాడని ఆరోపించారు. అదే రోజు షణ్ముగం ఒక సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడారని, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ జ్ఞానశేఖరన్ కేసుకు సంబంధించినది కావచ్చునని అన్నామలై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 23, 26 తేదీల మధ్య జ్ఞానశేఖరన్, షణ్ముగం, అన్నా విశ్వవిద్యాలయ భద్రతా అధికారి నటరాజన్‌ను 13 సార్లు సంప్రదించినట్లు తెలుస్తోందని, ఆయన ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జ్ఞానశేఖరన్‌ను అరెస్టు చేసిన తర్వాత యూనివర్సిటీలోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెప్పడం వెనక అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక పోలీసులు బాధితురాలు ఫిర్యాదు చేయకుండా నిరుత్సాహపరిచిన బాధితురాలి తరపు న్యాయవాది చెప్పడాన్ని కూడా అన్నామలై గుర్తుచేశారు.
దొంగతనం, దోపిడీ, లైంగిక దాడి ఘటనలకు సంబంధింది 20 పైగా క్రిమినల్ కేసులున్న రౌడీ షీటర్ జ్ఞానశేఖరన్‌కు డీఎంకే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రి సుబ్రమణియన్ సహా పార్టీ ఇతర నాయకులతో సంబంధాలు ఉన్నట్లుగా ఫోటోల ద్వారా తెలుస్తుందని అన్నామలై అన్నారు.
అయితే జ్ఞానశేఖరన్‌కు డీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. కాగా ఎఐఎడిఎంకె (AIADMK) చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామితో సహా ప్రతిపక్ష నాయకులు డీఎంకే సీనియర్ వ్యక్తులతో జ్ఞానశేఖరన్‌కు ఉన్న సంబంధాలపై ఎందుకు దర్యాప్తు చేయలేదని కూడా ప్రశ్నించారు. కేసు దర్యాప్తు క్రమంలో SIT డిప్యూటీ ఎస్పీ రాఘవేంద్ర రవి రాజీనామా చేయడం గురించి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆయన రాజీనామా చేసి ఉండవచ్చన్న ఊహాగాలున్నాయి.