కేరళలో ‘‘శబరిమల’’ చుట్టూ రాజకీయాలు..
అయ్యప్ప గ్లోబల్ సమ్మిట్‌పై బీజేపీ, కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు
కేరళ(Kerala)లోని ట్రావెన్‌కోర్ దేవస్థానం (Travancore) బోర్డు సెప్టెంబర్ 20వ తేదీన అయ్యప్ప సంగమం(అయ్యప్ప గ్లోబల్ సమ్మిట్)నిర్వహించింది. బోర్డు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా పంబా నది ఒడ్డున ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మిట్ ప్రస్తుతం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువైంది.
కేరళలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో అయ్యప్ప క్షేత్రం శబరిమల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి.
‘శబరిమల సంరక్షణ సంగమం’
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ నిర్వహిస్తుండగానే. మరోవైపు బీజేపీ, హిందూ సంఘాలు శబరిమల(Sabarimala) సంరక్షణ సంగమం పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘అసలు మతం లేని ప్రభుత్వానికి గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహించే నైతిక హక్కు ఎక్కడిది? అని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇటు మైనార్టీల విశ్వాసాన్ని, హిందువుల భావాలను నొప్పించకుండా ఆచితూచి మాట్లాడుతోంది కాంగ్రెస్(Congress). ప్రభుత్వం, సంఘ్ పరివార్ రెండూ అయ్యప్ప గ్లోబల్ కాంక్లేవ్‌ను రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్. "ముఖ్యమంత్రి పినరయి విజయన్ నకిలీ భక్తుడు. ఆయనకు ఎప్పుడూ భక్తిభావం లేదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హిందువుల ఓట్లను రాబట్టుకోడానికి చేస్తున్న రాజకీయ వ్యూహం. ఆయన తన పదవీకాలంలో సంప్రదాయాలను ఉల్లంఘించారు. శబరిమల దురాగతాలను దాచిపెడుతున్నారు" అని ఆరోపించారు.
సమ్మిట్‌పై ఏవరేమన్నారు?
అయ్యప్ప పేరు మీద సమావేశం ఏర్పాటు చేసే నైతిక అధికారం నాస్తికులకు లేదని ఇద్దరు నాయకుల వాదన. "ఆయన (సీఎం పినరయి విజయన్) దేవుడిని లేదా సనాతన ధర్మాన్ని నమ్మని వ్యక్తి. కానీ అకస్మాత్తుగా ఆయన భగవద్గీతను ఉటంకించడం శ్లోకాల గురించి మాట్లాడడం.. నాటకం తప్ప మరొకటి కాదు" అని తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై విమర్శించారు. మూడు దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులను (పినరయి విజయన్, సిద్ధరామయ్య, ఎంకే స్టాలిన్) "హిందూ వ్యతిరేక త్రిమూర్తులు"గా అభివర్ణించారు కర్ణాటక బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య.
‘అవి విరామ సమయంలో తీసినవి..’
కార్యక్రమానికి చాలా తక్కువ మంది వచ్చారని ప్రతిపక్ష బీజేపీ ప్రచారం చేసింది. ఖాళీ సీట్ల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేసింది. కాషాయ పార్టీ నేతల విమర్శలను మంత్రి వి.ఎన్. వాసవన్ కౌంటర్ ఇచ్చారు. అవన్నీ సమావేశం విరామ సమయంలో తీసిన ఫొటోలను కొట్టిపారేశారు. అవి AI జనరేటెడ్ ఫొటోలను సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ (AI) పేర్కొన్నారు.
మొత్తం మీద కేరళలో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాజకీయం రంజుగా సాగుతోంది.