వచ్చే క్యాబినెట్ సమావేశంలో కుల గణనపై చర్చిస్తాం: కర్ణాటక హోం మంత్రి

కుల గణనగా పిలిచే సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

Update: 2024-10-22 12:35 GMT

కుల గణనగా పిలిచే సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఉల్లంఘించాల్సి వస్తుందని, అవసరమైతే ఇతర రాష్ట్రాలు చేసినట్లుగా తమ ప్రభుత్వం కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దాదాపు రూ.160 కోట్లతో సర్వేకు ఖర్చు చేశామని, ఇంత ఖర్చు పెట్టిన నివేదికను ప్రజల ముందుంచకుంటే వృథా అవుతుందని, కనీసం అందులో ఏముందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

అశాస్త్రీయం అంటూ  రీసర్వేకు డిమాండ్..

కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ అప్పటి చైర్మన్ కె జయప్రకాష్ హెగ్డే ఆధ్వర్యంలో కొన్ని సామాజిక వర్గాల అభ్యంతరాల నివేదికన ఫిబ్రవరి 29న సీఎంకు సమర్పించారు. ఈ నివేదికపై అధికార కాంగ్రెస్‌లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటకలోని రెండు ఆధిపత్య వర్గాలయిన వొక్కలిగాలు, లింగాయత్‌లు సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సర్వే "అశాస్త్రీయం" అని పేర్కొంటూ తాజాగా రీసర్వే చేయించాలని డిమాండ్ చేశాయి. ఇలా డిమాండ్ చేసిన వారిలో వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు మరికొంత మంత్రులు ఉన్నారు.

వీరశైవ-లింగాయత్‌ల అత్యున్నత సంస్థ అఖిల భారత వీరశైవ మహాసభ సర్వేపై అసమ్మతిని వెల్లగక్కి తాజాగా సర్వే చేయించాలని కోరింది. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప నేతృత్వంలో పలువురు లింగాయత్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

వీరశైవ లింగాయత్, వొక్కలిగ సంఘాలు కుల గణనపై అభ్యంతరం వ్యక్తం చేయడం, అమలు చేయకూడదన్న డిమాండ్‌పై హోంమంత్రి స్పందిస్తూ.. నివేదిక అమలు చేయడం వేరే విషయం.. నివేదికలో ఏముందో తెలియాలి. నిర్ణయాలు తర్వాత. జనం నివేదికపై ఆందోళన చెందాల్సిన పనిలేదు." అని పేర్కొన్నారు.

అందుకే భయపడుతున్నారు..

కొంతమంది రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. కర్ణాటకలోని వివిధ కులాలు ప్రత్యేకించి లింగాయత్‌లు, వొక్కలిగాల సంఖ్యా బలానికి సంబంధించి సర్వే ఫలితాలు "సాంప్రదాయ అవగాహన"కు విరుద్ధంగా ఉన్నందునే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఆ నివేదికను బయటపెట్టడానికి వెనుకంజ వేస్తున్నాయని అంటున్నారు.

కుల గణన, ఎస్సీలలో ఉప కులాల వర్గీకరణ, రిజర్వేషన్లు, పంచమసాలి లింగాయత్‌ సామాజికవర్గం రిజర్వేషన్ల పెంపు డిమాండ్లలపై పరమేశ్వర మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్య ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు చెబుతుంది. కాని కొన్ని రాష్ట్రాల్లో 60 శాతానికి, తమిళనాడులో 69 శాతానికి పెరిగిన విషయాన్ని పరమేశ్వర గుర్తు చేశారు.

"రిజర్వేషన్‌కు సంబంధించి వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. వాటిని పరిష్కరించాలంటే మనం కూడా 50 శాతం దాటాల్సి వస్తుంది. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అవసరమైతే 50 శాతం దాటడంపై నిర్ణయం తీసుకుంటాము.’’ అని అన్నారు.  

Tags:    

Similar News