సుప్రీం తీర్పును రద్దు చేయించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది: స్టాలిన్
బీజేపీయేతర రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని పిలుపు;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-18 12:29 GMT
రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డుగా కేంద్రం వాడుకుంటున్నగవర్నర్లపై సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తరువాత దానిని రద్దు చేయించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను సుప్రీంకోర్టు అప్పట్లో సమర్థించిందని గుర్తుచేశారు.
సమాఖ్యవాదాన్ని కాపాడటానికి, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని కాపాడటానికి ఈ కీలకమైన న్యాయపోరాటంలో ఐక్యంగా ఉండాలని బీజేయేతర రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలను కోరారు. రాష్ట్ర అసెంబ్లీ లు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి చర్య తీసుకోవడానికి కాలపరిమితిని నిర్ణయించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 8 తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల 14 కీలకమైన ప్రశ్నలు వేసిన తరువాత స్టాలిన్ ఈ ప్రకటన చేశారు.
తమిళనాడు తీర్పును ప్రశ్నించాలనే లక్ష్యం..
‘‘కేంద్ర ప్రభుత్వం సలహ మేరకు భారత రాష్ట్రపతి మే 13, 2025న రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం గౌరవనీయులైన సుప్రీంకోర్టు సలహా అధికార పరిధిని ఉపయోగించుకున్నారు. కోర్టు ముందు 14 ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సూచన ప్రత్యేకంగా ఏ రాష్ట్రం లేదా తీర్పును సూచించనప్పటికీ తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం, రాజ్యాంగ వివరణపై కనుగొన్న విషయాలను ప్రశ్నించడమే దీని లక్ష్యం’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చెడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు మొండిగా వ్యవహరించే గవర్నర్లను ఎదుర్కొన్నప్పుడూ దీనిని ఒక ఉదాహారణగా పరిగణించవచ్చుని చెప్పారు.
సమన్వయ చట్టపరమైన వ్యూహం..
‘‘ఈ కీలక సమయంలో బీజేపీని వ్యతిరేకించే, మన సమాఖ్య నిర్మాణం రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల నాయకులను రాబోయే న్యాయపోరాటంలో ఐక్యంగా పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
‘‘సుప్రీంకోర్టు ముందు రాష్ట్రపతి కోరిన ఈ సూచనను వ్యతిరేకించమని మిమ్మల్ని వ్యక్తిగతంగా అభ్యర్థించడానికి ఇప్పుడు మీకు నేను లేఖ రాస్తున్నాను’’ అని ఆయన తన పోస్ట్ లో అన్ని బీజేపీయేత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో సమర్థించినట్లుగా రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని పరిరక్షించడానికి, రక్షించడానికి వారు కోర్టు ముందు సమన్వయంతో కూడిన చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించాలని, ఐక్యంగా బలం ప్రదర్శించాలని ఆయన నొక్కి చెప్పారు.
నిధుల కోసం సుప్రీంకోర్టును చేరతాను..
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తన రాజకీయాల కోసం రాష్ట్రానికి విద్యా నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. తన ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల కు పైగా నిధుల విడుదల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు.
చెన్నైలో జరిగిన ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తమిళనాడు త్రిభాషా విధానానికి అంగీకరించినందున కేంద్ర రూ. 2,152 కోట్లను విడుదల చేయలేదని ఆరోపించారు.
కేంద్రం విద్యా నిధులను విడుదల చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని ఆయన అన్నారు. గవర్నర్ కేసులో రాష్ట్రం సాధించిన విజయం గవర్నర్/ రాష్ట్రపతి బిల్లులపై గడువులు నిర్ణయించినట్లే విద్యా నిధులకు సంబంధించిన విషయంలో కూడా తమిళనాడు గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలో విద్యను తీసుకురావడానికి పోరాటం కొనసాగుతుందని విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చకపోతే అది హద్దులు దాటుతుందని స్టాలిన్ అన్నారు. ఈ అంశంపై డీఎంకే వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు.