కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు కోర్టు సమన్లు..
ఆంక్షలను ధిక్కరిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డికె శివకుమార్ సహా కాంగ్రెస్ నేతలు ఈడీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆగస్టు 29న తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డికె శివకుమార్‌కు బెంగళూరు కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది.
రెండేళ్ల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ పదేపదే ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ రాహుల్ గాంధీని అనవసరంగా వేధిస్తోందంటూ జూన్ 2022లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ నిరసన చేపట్టింది. ఆంక్షల ఉత్తర్వులను ధిక్కరిస్తూ సిద్ధరామయ్య, శివకుమార్‌తో సహా కాంగ్రెస్ నేతలు నిరసన ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. దాంతో అప్పట్లో విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిరసన ప్రజా శాంతికి విఘాతం కలిగించిందని, అధికారుల నుంచి అనుమతి లేకుండా ప్రదర్శన చేపట్టారని పోలీసులు కేసు కట్టారు.