ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన ‘దళపతి’ విజయ్
వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తున్న టీవీకే;
By : The Federal
Update: 2025-02-11 09:50 GMT
తమిళనాడు లో రాజకీయ అరంగ్రేటం చేసిన సినీ నటుడు, ‘దళపతి’ విజయ్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల్లో పోటీ పడటానికి విజయ్ ‘తమిళ వెట్రి కజగం(టీవీకే)’ ని స్థాపించిన సంగతి తెలిసిందే.
2023 లోన పార్టీ ప్రకటించిన విజయ్.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పాల్గొనబోవట్లేదని, తన లక్ష్యం కేవలం తమిళనాడు అసెంబ్లీ మాత్రమే అని ప్రకటించారు.
చెన్నైలోని విజయ్ నివాస్ లో శనివారం ప్రశాంత్ కిషోర్ తో సమావేశం జరిగింది. ఈ సమావేశం టీవీకే సీనియర్ నాయకులతో దాదాపు రెండు గంటలపాటు సాగిందని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.
తమిళనాడులో ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే లకు రాజకీయ ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకునే విధంగా విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2021 ఎన్నికలకు ముందు కిషోర్, డీఎంకే తో కలిసి పనిచేశారు. అయితే ఎన్నికల తరువాత తాను ఎన్నికల వ్యూహకర్త పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
విజయ్ కి సలహాదారు
దళపతి విజయ్ కు, కిషోర్ 2026 ఎన్నికలకు ప్రత్యేక సలహదారుగా ఉండే అవకాశం ఉందని సమావేశానికి హాజరైన పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి చెప్పారు. అతను మా రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో సహాయం చేస్తాడని ఆ వ్యక్తి చెప్పారు.
అయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే సొంతంగా ‘జన్ సురాజ్’ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం విజయ్ తో జరిగిన సమావేశానికి డీఎంకే తో గతంలో పొత్తు పెట్టుకున్న వీసీకే పార్టీ నాయకుడు అధవ్ అర్జున సహకరించినట్లు తెలిసింది.
రాజకీయ వ్యూహ సంస్థను నడుపుతున్న అర్జున, ఇప్పుడు ఎన్నికల ప్రచార నిర్వహణ బాధ్యత కలిగిన టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
రాజకీయ ప్రత్యామ్నాయం..
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల కోసం కొన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. తరువాత ఆయన అనేక రాజకీయ పార్టీలకు సలహదారుడిగా పనిచేశారు.