నీటి సంక్షోభంలో బెంగళూర్, ప్రైవేట్ బోర్లు స్వాధీనం చేసుకుంటామన్న ‘డీకే’

మార్చి మొదలయిందో లేదో అప్పడే ఎండలు మండిపోతున్నాయి. మరో వైపు తాగునీటి సంక్షోభం కూడా ముంచుకురాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2024-03-07 11:49 GMT

కర్నాటకలో ఎల్ నినో కారణంగా ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవలేదు. బెంగళూర్ నగరానికి నీటిని అందించే కృష్ణరాజ సాగర్ డ్యామ్ లో వేసవి కారణంగా నీటి నిల్వ పూర్తిగా అడుగంటిపోయింది. కావేరి నదీలో ఈసారి ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోవడంతో బెంగళూర్ సిటీకి నీటి సరఫరా చేయలేకపోతున్నామని బెంగళూర్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు(BWSSB) అధికారి ఒకరు వాపోయారు. బెంగళూర్ లోని కుమార కృపా రోడ్డులో సీఎం నివాస కార్యాలయాల్లో కూడా నీటి ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఇంటిలోని బోర్ కూడా తొలిసారిగా ఎండిపోయింది. ఆయన ఇల్లు సాకీ చెరువు దగ్గరగా ఉంటుంది. అయినప్పటీకీ బోరు ఎండిపోవడం నీటి పరిస్థితికి అద్దంపడుతోంది.

ధరలు పెంచేశారు
నీటి ఎద్దడితో అల్లాడుతున్న ప్రజలను అవసరాలను కొంతమంది ట్యాంకర్ యజమానులు అమాంతం ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో ఒక ట్యాంకర్ ధర రూ. 700 -800 వచ్చేది. డిమాండ్ ఉన్న రోజుల్లో రూ. 1500-1800 వరకూ వసూలు చేస్తున్నారు. నగరంలోని రోడ్లపై తరచూ వాటర్ ట్యాంకర్లు కనిపించడం సర్వ సాధారణమైంది. అపార్ట్ మెంట్లలో పరిస్థితి ఘోరంగా ఉందని తెలుస్తోంది.
" మా ఇంట్లో ఆరుగురం ఉంటాం. ట్యాంకర్ నీళ్లను ఎంత పొదుపుగా వాడుకున్నా.. ఒక ట్యాంకర్ కనీసం ఐదు రోజులు మాత్రమే వస్తుంది. అంటే నెలకు ఆరు ట్యాంకర్లు కావాలి. ఇలా నీళ్ల కోసమే నెలకు రూ. 9 వేలు అదనంగా ఖర్చు పెట్టాలి. కానీ ఇలా ఎంతకాలం.." అని ఉత్తర హళ్లి నివాసి శరత్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది
బెంగళూర్ లో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న దృష్ట్యా ప్రైవేట్ బోర్లు, ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. అవసరమైతే ప్రజలకు పాల ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. నీటి రేట్లను ఇష్టారీతిన పెంచకుండా ఉండడానికి రేట్లను సైతం ప్రకటించింది.
5 కిలోమీటర్ల పరిధిలోని ట్యాంకర్లకు ధరలు
6000 లీటర్లు నీటి ట్యాంకర్ రూ. 600
8000 లీటర్లు నీటి ట్యాంకర్ రూ. 700
12000 లీటర్లు నీటి ట్యాంకర్ రూ. 1000
5 కిలోమీటర్లు దాటితే ట్యాంకర్లకు ధరలు
6000 లీటర్లు నీటి ట్యాంకర్ రూ. 750
8000 లీటర్లు నీటి ట్యాంకర్ రూ. 850
12000 లీటర్లు నీటి ట్యాంకర్ రూ.1200
ఐటీ సంస్థలు ఎలా మేనేజ్ చేస్తున్నాయి
భారత ఐటీ రాజధానిగా పేరుపడ్డ బెంగళూర్ లో అనేక ఎంఎన్సీలు ఉన్నాయి. ఇవి కూడా రాబోయే సంక్షోభాన్ని తట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఇదే విషయం పై వైట్ ఫీల్డ్ ఏరియా కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ మాల్యా మాట్లాడుతూ.. " టెక్ హాబ్ లో 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 20 లీటర్ల నీరు కావాల్సి వస్తే.. అది లక్ష లీటర్ల, అంటే రోజుకు 10-12 ట్యాంకర్లు అవసరం అవుతాయి. అయితే దీనిని మేము పరిష్కరించుకుంటాం. ప్రతిసారీ అనేక అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్" అని ఆయన చెప్పారు.
కొన్ని కోచింగ్ సెంటర్లు నీటి ఎద్ధడి కారణంగా వారం పాటు ఆన్ లైన్ తరగతులకు రావాలని విద్యార్థులను కోరింది. అలాగే బన్నెరఘటలోని ఒక స్కూల్ మూసివేసి విద్యార్థులను వర్చువల్ గా తరగతులకు హాజరుకావాలని ఆదేశించింది.
136 తాలుకాలు తీవ్ర కరువు పీడీత ప్రాంతాలు..
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం మొత్తం 136 తాలూకాలు కరువును ఎదుర్కొంటున్నాయి. వాటిలో 109 తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. నీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ లు, హెల్ఫ్ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశువులకు సరైన మేత, నీటి వసతి కోసం ఎమ్మెల్యేల నేతృత్వంలో తాలూకా స్థాయి టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు.
దీనిపై ఐఎండీ శాస్త్రవేత్త ప్రసాద్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి ఎల్ నినో ప్రభావం ఉంది. అయితే ఈ సంవత్సరం కాస్త తగ్గింది. ఫిబ్రవరిలోనే వేసవి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. నిజానికి మార్చి తరువాత ఇలా ఉండాలి.. కానీ ఎల్ నినో ప్రభావం తో పరిస్థితి ఇలా ఉందని అభిప్రాయపడ్డారు.
రాజకీయ మలుపు తిరిగిన నీటి సంక్షోభం

ప్రస్తుత నీటి ఎద్దడిపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాయి. సమస్యను సత్వరమే పరిష్కరించకుంటే రోడ్లమీదకి వచ్చ ఆందోళన చేస్తామని బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ఎక్స్ లో ట్వీట్ చేశారు. బెంగళూర్ ప్రజలను ఆదుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ఆరోపించారు. తాను బీడబ్ల్యూఎస్ఎస్ బీ చైర్మన్ ను కలిసి యుద్ద ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలను వివరించాని వివరించారు.


Tags:    

Similar News