టీడీపీ బరిలోకి దిగితే వైసీపీ కొంప కొల్లేరేనా!
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించలేదు. వీరిని తమవైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ.
తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి ఏపీలో మూడు స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో చేరే అవకాశమున్నా.. టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒకచోట ఎన్నికల అనివార్యమవుతుంది. ఇక తెలంగాణలో సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒక రాజ్యసభ స్థానం దక్కనుంది.
వచ్చే ఏప్రిల్‌తో రాజ్యసభలో 56 స్థానాలు ఖాళీ కానున్నాయి. 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎన్నికకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల కోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి.. 16న పరిశీలన చేస్తారు. ఇక 20వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు విధించారు. ఫిబ్రవరి 27న మొత్తం 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి.. అదేరోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.
ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందో...
ఎన్నికలు జరగనున్న మొత్తం 56 స్థానాల్లో 10 అత్యధిక సీట్లతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక బీహార్, మహారాష్ట్రలో 6 చొప్పున, వెస్ట్ వెంగాల్, మధ్యప్రదేశ్‌లో 5 చొప్పున, గుజరాత్, కర్ణాటకలో 4 చొప్పున, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 3 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తారు.
ఆంధప్రదేశ్‌లో టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపకపోతే.. మూడు రాజ్యసభ స్థానాలు మళ్లీ అధికార వైసీపీకి ఖాతాలోనే చేరనున్నాయి. ఏపీలో ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో మూడు స్థానాలూ ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందే అవకాశముంది. అయితే, సంఖ్యాబలం లేకపోయినా... మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ కూడా అభ్యర్థిలో బరిలో నిలిపే ఆలోచన చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించకుండా.. అక్కడ కొత్త ఇన్‌చార్జీలను నియమించింది. ఈ క్రమంలోనే అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ. తమకున్న 23 మంది ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ అసంతృప్తుల్లోని 21 మంది మద్దతు పలికితే ఒక రాజ్యసభ స్థానం దక్కించుకోవాలన్న వ్యూహ రచన చేస్తోంది టీడీపీ. దీంతో అప్రమత్తమైన అధికార పార్టీ.. రాజీనామాలు ఆమోదించడం, అనర్హత వేటు అస్త్రాలను ప్రయోగించి టీడీపీ బలాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా విప్ జారీ చేసే యోచనలో ఉంది.
తెలంగాణలో బరాబర్..
ఇక తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సంఖ్యాబలాన్ని బట్టి మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. రాష్ట్రంలో ఒక రాజ్యసభ అభ్యర్థి గెలుపొందాలంటే 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే.. కాంగ్రెస్‌కు మిత్రపక్షంతో కలిపి 65 మంది సభ్యులుండగా.. బీఆర్‌ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక బీజేపీకి 8 మంది, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ స్థానాలకు అవసరమైన 60 మంది ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో రెండు పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.