‘సీఎం కుర్చీ కోసం ‘మ్యూజికల్ చైర్’ నడుస్తోంది?’

మేం ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ప్రజాస్వామ్యబద్దంగా నడిపి జన హృదయాలను గెలుచుకోనివ్వండి.’’ - అశోక.

Update: 2024-08-24 11:10 GMT

కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కర్ణాటకలో ‘మ్యూజికల్ చైర్’ ఆట నడుస్తోందన్నారు. సీఎం కుర్చీ కోసం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు సీనియర్లంతా పోటీపడుతున్నారని పేర్కొన్నారు.

సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి..

ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ప్రదీప్ కుమార్ ఎస్పీ, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే వ్యక్తులు అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17A, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023లోని సెక్షన్ 218 ప్రకారం సీఎంను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో భవిష్యత్ పరిణామాలపై పార్గీ నేతలు తర్జన బర్జన పడుతున్నారు. నాయకత్వ మార్పుపై కూడా నేతల్లో చర్చ జరుగుతోందంటున్నారు బీజేపీ నేత అశోక. ఇదే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కూడా అయిన సిద్ధరామయ్య, శివకుమార్, పలువురు సీనియర్ మంత్రులు శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమై చర్చలు జరిపారు.

మేం అలా ఎప్పుడూ చెప్పలేదు..

‘‘మేం ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. మేం ఎవరినీ సంప్రదించలేదు. ఎమ్మెల్యేలను కలవలేదు. వారి సొంత పార్టీ (కాంగ్రెస్‌)లో జరుగుతున్న పరిణామాలు నేను రోజూ వార్తాపత్రికలు, టెలివిజన్ మీడియాలో చూస్తున్నా. అక్కడ మ్యూజికల్ చైర్ జరుగుతోంది" అని అశోక ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ‘డీకే శివకుమార్, జీ పరమేశ్వర, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే గెరార్గే (అందరు మంత్రులు) సీఎం రేసులో ఉన్నారు. సిద్ధరామయ్య స్థానంలో ఎవరు వస్తారన్నదే

ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో హాట్ టాపిక్. ఎవరు సీఎం అయినా మాకు ఒరిగేదేంలేదు. మేం ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్దంగా నడపి జనాల హృదయాలను గెలుచుకోనివ్వండి.’’ అన్నారు అశోక.

బీజేపీ ఒత్తిడికి తలొగ్గి గవర్నర్ 15 బిల్లులను వెనక్కి పంపారని డిప్యూటీ సీఎం శివకుమార్ శుక్రవారం ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా గవర్నర్‌ నడుచుకుంటున్నారని విమర్శించారు.

‘గవర్నర్‌పై ఆరోపణలు సరికాదు’

‘‘బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి గవర్నర్‌ హెచ్‌ఆర్‌ భరద్వాజ్‌ ఎన్నో బిల్లులను వెనక్కి పంపారు. దానికి మేం కాంగ్రెస్‌ను నిందించామా? వెళ్లి ఆ బిల్లును ఎందుకు వెనక్కి పంపారో అడగండి. ప్రతి బిల్లుకు సంబంధించి ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు స్పష్టత ఇవ్వాలి. అది ప్రభుత్వ బాధ్యత. గవర్నర్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు.’’ అని కౌంటర్ ఇచ్చారు అశోక.

గవర్నర్ గురించి మంత్రులు అమర్యాదగా మాట్లాడడాన్ని అశోక తప్పుబట్టారు.

‘‘ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌కు అనుమతించిన గవర్నర్‌ను కించపరిచేలా మాట్లాడారు. గవర్నర్‌ దళితుడన్న సంగతి కూడా పట్టించుకోకుండా.. మంత్రుల ఆయన ఫొటోలను తగులబెట్టారు. కేబినెట్‌లో కూడా ముఖ్యమంత్రి ఆయన గురించి అమర్యాదగా మాట్లాడారు.’’ 

Tags:    

Similar News