కన్నడ నటుడు దర్శన్ అరెస్టుతో నిర్మాతల్లో ఆందోళన..

కన్నడ నటుడు దర్శన్ అరెస్టుతో సినీ నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే తమ సినిమాల్లో నటించేందుకు కొంతమంది నిర్మాతలు దర్శన్‌కు అడ్వాన్సులు ఇవ్వడమే అందుకు కారణం.

Update: 2024-07-12 10:08 GMT

తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన ఆరోపణలపై 'స్టార్' నటుడు తూగుదీప దర్శన్ అరెస్టయి నేటికి నెల రోజులు కావస్తోంది. ఆయన అరెస్టుతో నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ప్రకారం.. దర్శన్ దాదాపు 14 చిత్రాల్లో నటించాల్సి ఉంది. వీటిల్లో కొందరి నిర్మాతల నుంచి రూ. 30 కోట్ల వరకు దర్శన్ అడ్వాన్ తీసుకున్నట్లు సమాచారం.

మధ్యలోనే నిలిచిపోయిన సినిమాలు..

నిర్మాత మిలనా ప్రకాష్ 'డెవిల్' పేరుతో సినిమా తీస్తున్నారు. ఈ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని ప్రారంభం కావాల్సి ఉంది.

దర్శన్ అరెస్టుకు ముందు ఖరారు చేసిన ప్రాజెక్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెల్లి. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభమై డిసెంబర్ 2024 నాటికి ముగించాలని చిత్ర నిర్మాత అనుకున్నారు. ఈ చిత్రం అధిక భాగాన్ని లండన్‌లో చిత్రీకరించాల్సి ఉంది. నిర్మాణ ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినా, షెడ్యూల్ వాయిదా పడింది.

కర్ణాటకకు చెందిన ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సూరప్పబాబుతో కూడా ఒక సినిమా తీసేందుకు దర్శన్ ఓకే చేశారట. అయితే తన బ్యాంకాక్ పర్యటన తర్వాత కథ గురించి వివరంగా మాట్లాడదామని తనకు హామీ ఇచ్చాడని సూరప్ప బాబు విలేఖరులతో అన్నారు.

డైలమాలో నిర్మాతలు...

తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించే శైలజా నాగ్, బి సురేష్ ప్రాజెక్టుకు కూడా దర్శన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శైలజా నాగ్ మాట్లాడుతూ.. “దర్శన్ నటిస్తోన్న‘డి59’ చిత్రాన్ని ప్రకటించాం. ఇందులో సింధూర లక్ష్మణ పాత్రలో దర్శన్ నటిస్తున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటే స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో దర్శన్ కనిపిస్తాడని చెప్పారు.

తన ప్రాజెక్ట్‌లో నటిస్తున్న దర్శన్ కోసం కొంత డబ్బు ఖర్చు చేశానని మరో నిర్మాత చెబుతున్నారు. మరో చిత్రనిర్మాత ఎండి శ్రీధర్.. దర్శన్‌ కోసం రెండు కథలు సిద్ధం చేశామని చెప్పారు. 'డెవిల్' పూర్తయిన తర్వాత వాటి గురించి వివరంగా మాట్లాడతామని దర్శన్ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం దర్శన్‌కు అడ్వాన్స్ కూడా చెల్లించానని చెప్పారు.

రాఘవేంద్ర హెగ్డే కూడా దర్శన్‌తో ఒక పౌరాణిక చిత్రానికి ప్లాన్ చేసారు. అందుకు దర్శన్ కూడా అంగీకరించాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో దర్శన్ నటించబోయే మరో ప్రాజెక్ట్ గురించి జోగి ప్రేమ్ తెలిపారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రఘునాథ్ సోగి, మోహన్ నటరాజన్ దర్శన్‌తో తమ ప్రాజెక్ట్‌లను ప్రకటించారు.

దర్శన్ అరెస్ట్ నిర్మాతలకు పెద్ద దెబ్బ అని సినీ నిర్మాత ఒకరు తెలిపారు. “కానీ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ దర్శన్ కోణంలో చూడటం వల్ల పరిశ్రమకు ఒక మచ్చ’’అని పేరు చెప్పకూడదని ఒక నిర్మాత ఫిర్యాదు చేశాడు.

“శ్రీ జైమాత కంబైన్స్‌, వైష్ణో స్టూడియోస్‌పై జయమ్మ నిర్మించిన 'డెవిల్' చిత్రంపై ఇప్పటికే సుమారు రూ .20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది రూ. 50 కోట్ల ప్రాజెక్టుగా కనిపిస్తుంది. దర్శన్‌ను నమ్ముకున్న నిర్మాతలు ఇప్పడు ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొవాల్సి వసుంది.”అని పేరు చెప్పడానికి ఇష్టపడని నిర్మాత చెప్పారు.

మళ్లీ తెరపైకి దర్శన్ 'శాస్త్రి'..

దర్శన్ 2005లో నటించిన చిత్రం 'శాస్త్రి'.. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శన్ అరెస్టుతో ఇప్పుడు ఈ చిత్రాన్ని రీ రీలిజ్ చేయడానికి ఎలాంటి సంబంధం లేదని పంపిణీదారు విఎం శంకర్ స్పష్టం చేశారు.

‘‘కొన్ని నెలల క్రితమే ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలని అనుకున్నాం. థియేటర్‌లో సినిమాల కొరతను దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిటర్ల అభ్యర్థనల మేరకు 'శాస్త్రి' సినిమాను విడుదల చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

పిఎన్ సత్య దర్శకత్వంతో అనాజి నాగరాజ్ నిర్మించిన 'శాస్త్రి' 19 సంవత్సరాల క్రితం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఒక మెడికల్ స్టూడెంట్ తన జీవితంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల అండర్ వరల్డ్ డాన్ కావడం ఈ సినిమా కథ.

ఇదిలా ఉంటే.. కొంతమంది నిర్మాతలు దర్శన్‌కు చాలా దగ్గరగా ఉండే పేర్లు ముందుగా రిజిస్టర్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు. 'డి-గ్యాంగ్' (దర్శన్ ముద్దుపేరును సూచిస్తుంది), 'పట్టణగెరె షెడ్' (రేణుకాస్వామిని తీసుకెళ్లి చంపారు) మరియు 'ఖైదీ నంబర్ 6106' (పరప్పన అగ్రహార జైలులో దర్శన్ ఖైదీ నంబర్' వటి టైటిల్‌లను రిజిస్టర్ చేయడానికి చిత్ర నిర్మాతలు హడావిడి చేస్తున్నారు. అయితే ఇలాంటి పేర్లను తిరస్కరించారని KFCC వర్గాల సమాచారం. 

Tags:    

Similar News