కన్నడ పాఠ్య పుస్తకాల్లో మళ్లీ పూలే, పెరియార్ ప్రత్యక్షం
గత బీజేపీ సర్కార్ కన్నడ విద్యా వ్యవస్థలో తొలగించిన పలు పాఠ్యాంశాలను ప్రస్తుత సిద్ధ రామయ్య సర్కార్ తిరిగి చేర్చడానికి నడుం బిగించింది.
By : The Federal
Update: 2024-03-06 10:22 GMT
కర్ణాటకలో విద్యా వ్యవస్థలోకి మళ్లీ అభ్యుదయ రచయితలు రాసిన కొన్ని ముఖ్యంశాలు రానున్నాయి. వీటితో పాటు ప్రస్తుత తరానికి రాజ్యంగ అవశ్యకత, హక్కులు, లింగ సమానత్వం, సున్నితత్వం, బాలల హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, శాస్త్రీయ దృక్ఫథానికి విలువనిస్తూ ప్రస్తుత పాఠ్య పుస్తకాలు సవరించినట్లు ప్రొఫెసర్ మంజునాథ ఆధ్వర్యంలోని రివ్యూ కమిటీ తెలిపింది.
వచ్చే విద్యాసంవత్సరం అంటే 2024-25 సంవత్సరంలో తిరిగి వీటిని విద్యార్థులు చదవాల్సి ఉంటుందని కర్నాటక ప్రభుత్వం పేర్కొంది. వీరిలో ఇంతకుముందు ప్రభుత్వం తొలగించిన గిరిష్ కర్నాడ్, పీ లంకేష్, దేవన్యూర్ మహదేవ, ముద్నాకుడు చిన్నస్వామి, నగేష్ హెగ్దే వంటి కన్నడ రచయితల పాఠ్యాంశ లతో పాటు పెరియార్, సావిత్రి బాయి పూలే వంటి వారు రాసిన అంశాలను విద్యా సంవత్సరంలో తరగతుల వారీగా ప్రస్తుత పాఠాలకు చేర్చనున్నారు.
పాఠ్య పుస్తకాలపై సిద్దరామయ్య సర్కార్ నియమించిన ప్రొఫెసర్ మంజునాథ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక లో పలు అంశాలను సిఫార్సు చేసింది. ఇందులో పెరియార్, సావిత్రి బాయి పూలే వంటి వారితో పాటు అభ్యుదయ రచయితల పాఠ్యాంశాలను తిరిగి ప్రవేశపెట్టాలని సూచించింది. వీటిలో కొన్ని అంశాలను పదవ తరగతి చరిత్ర లో సామాజిక, మత సంస్కరణల ఉద్యమాల పేరిట ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. అయితే కన్నడ నాట తీవ్ర వివాదం గా ఉన్న టిప్పు సుల్తాన్, హైదర్ అలీకి సంబంధించిన అంశాలను మాత్రం పుస్తకాల్లో తిరిగి చేర్చమని రివ్యూ కమిటీ సిఫార్సు చేయలేదు.
కొన్ని అంశాలకు ఉదాహారణగా తీసుకుంటే.. ఆరవ తరగతిలోని సాంఘిక శాస్త్రంలో ఉన్న ‘ పౌరుడు- ప్రవర్తన’ అనే పాఠం లింగ సమానత్వం ఆధారంగా ఇంతకుముందు రూపొందించబడింది. దీనిని ఈ కాలానికి అనుగుణంగా సవరించాలన్నారు. అలాగే పదో తరగతిలో సాంఘిక శాస్త్రంలో మైనారిటీల సంక్షేమం పై పాఠం జోడించనున్నారు.
అలాగే ఎనిమిదవ తరగతిలో ఉన్న ‘ఇండస్- సరస్వతి నాగరికత’ అనే పాఠ్యాంశం తాజాగా ‘ పురాతన భారతీయ నాగరికత: ఇండస్- సరస్వతి నాగరికత, వేదకాలం’ గా మార్చారు. తొమ్మిదో తరగతిలో ఉన్న భక్తి ఉద్యమం సమాచారం అదనంగా చేర్చారు. ఇందులో కనకదాస, పురంధర దాస, షిశునాల షరీఫ్ పాఠాలు వచ్చాయి. ఏడో తరగతి చరిత్ర పుస్తకాల్లో సాంఘిక సంస్కర్తగా బసవేశ్వరుడిని పేర్కొన్నారు.
ఇంకా ఏమేం మార్చరంటే..
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఉన్న అనేక అంశాలను తక్షణమే మార్చాలని ఆదేశించింది. వాటిలో 18 ప్రధాన మార్పులు కాగా, 15 పాఠ్యాంశాలను తొలగించాలని ఆదేశించింది. తరువాత వీటిపై ఒక కమిటీని నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాఠ్యాంశాల మార్పును ప్రస్తావించింది. బీజేపీ తొలగించిన అనేక అంశాలను తిరిగి పుస్తకాల్లో చేరుస్తామని హమీ ఇచ్చింది.
అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ కేబీ హెడ్గేవార్ చరిత్రకు సంబంధించిన ‘ నిజవడ ఆదర్శ పురుష యరగబేకు’ పాఠాన్ని కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. అలాగే నెహ్రూ, ఇందిర గాంధీకి రాసిన లేఖల అనువాదాన్ని సైతం పాఠ్యాంశాలలో చేర్చారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలను ప్రభుత్వం మార్చింది.