కులగణనను పక్కన పెట్టిన కన్నడ సర్కార్
గతకొంతకాలంగా కులగణన మంత్రం జపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మూడు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఈ అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఉత్తరాదిన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమితో కన్నడలో కులగణనను పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట. ఇప్పటికే కులగణన నివేదికను తయారు చేసిన కూడా ఉత్తరాదిన తగిలిన ఎదురుదెబ్బతో లోక్ సభ ఎన్నికల వరకూ ఈనివేదికను పక్కన పెట్టాలని కన్నడ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కులగణన ముఖ్యభూమిక పోషిస్తుందని, తమ గెలుపుకు దారి తీస్తుందని కాంగ్రెస్ వ్యూహకర్తలు మొదట భావించారు. అయితే మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కులంకార్డు పరిమితులను గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు, దీనిని పక్కన పెట్టారని తెలుస్తోంది.
కన్నడ లో ఆధిపత్య వర్గాలుగా పేరున్న లింగయత్- ఒక్కలిగలు సైతం కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. వీరిని కాదని ముందుకు వెళ్లినట్లయితే వచ్చే లోక్ సభ ఎన్నికలలో మరోసారి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కులగణన ద్వారా లోక్ సభ సీట్లు తగ్గే అవకాశం ఉంటుందని అందుకే ఈ అంశాన్ని ఇప్పట్లో ముట్టుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసే ఏప్రిల్- మే వరకూ కులగణన ఎత్తబోమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్యని, సునీల్ కనుగోలు నేతృత్వంలోని కాంగ్రెస్ వ్యూహకర్తల బృందం ఒప్పించింది.
బిహర్ లో నీతిష్ సర్కార్ కులగణను చేపట్టిన తరువాత కర్నాటకలో కూడా ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ఇంతకుముందే సిద్దరామయ్య సర్కార్ (2015-18) హెచ్ కాంతరాజ్ నేతృత్వంలోని ఓనివేదికను తయారు చేసింది. అయితే దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
అయితే ప్రస్తుతం అసలు ఈ నివేదిక కనిపించట్లేదు అని తెలుస్తోంది. కేవలం స్కాన్ చేసిన కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదు. ( ఈ విషయాన్ని మొదట ఫెడరల్ బయటపెట్టింది) అయితే ఈ నివేదిక న్యాయసమీక్ష ముందు నిలబడదనే చర్చ సైతం నడుస్తోంది.
ప్రస్తుతం కమిషన్ కు కొత్త చైర్మన్ కే జయప్రకాష్ హెగ్దే పాత డేటాను బయటకు తీసేందుకు ‘బెల్’సాయం కోరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా నివేదికను తిరిగి తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల అనంతరం
సిద్దరామయ్య క్యాబినెట్ లోని ఓబీసీ మంత్రి ఫెడరల్ తో మాట్లాడారు(పేరు చెప్పడానికి నిరాకరించారు) "లోక్ సభ ఎన్నికల అనంతరం కులగణన పై ముందుకే వెళ్తాం" అని చెప్పారు. కులగణనలో మరో ఆందోళన కలిగించే అంశం కూడా ఉంది.
లింగాయత్ లో దాదాపు 60 శాతంగా ఉన్న పంచమసాలీలలకు వెనకబడిన తరగతుల కేటగిరీ 2 కింద రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుందో చూడాలి.
అయితే కులగణనపై మాత్రం సీఎం సిద్దరామయ్య నమ్మకంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీలతో లోక్ సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించగలమనే నమ్మకంతో ఉన్నారు. అయితే దీనిని కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోవట్లేదు.