కర్షక వీరునికి కర్మవీరచక్ర అవార్డు

ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుకు అంతర్జాతీయ గుర్తింపు

Byline :  The Federal
Update: 2023-11-29 18:49 GMT
ఉత్తమ ప్రకృతి సాగు రైతు అవార్డును ఢిల్లీలో అందుకున్న సందర్భంగా దిగిన ఫొటో

కర్షక వీరునికి కర్మవీరచక్ర అవార్డు

ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుకు అంతర్జాతీయ గుర్తింపు
(జిపి వెంకటేశ్వర్లు)
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ రైతు నిరూపించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల పంటలు సాగు చేస్తూ నిత్యం డబ్బులు సంపాదిస్తున్నాడు. వారానికోరోజు మార్కెట్లో పండించిన పంటలు అమ్ముతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన రైతు ఎం నారాయణప్పకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
ఎనీటైం మనీ విధానంతో ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. ప్రకృతి వ్యవసాయం అనంతపురం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ లక్ష్మనాయక్‌ సూచనలు, సలహాల మేరకు ప్రకృతి వ్యవసాయాన్ని నారాయణప్ప ప్రారంభించాడు.
తండ్రి సంపాదించిన 3.7 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో మామిడి పంట వేశాడు. ఒక 30 సెంట్ల భూమిని ప్రత్యేకించి కూరగాయలు, ఇతర పంటలు వేసేందుకు ఎంపిక చేసుకున్నాడు. రూ. 5వేల పెట్టుబడితో 20 రకాల పంటలు పండిస్తూ ఏడాదికి రూ. 2లక్షల వరకు సంపాదిస్తున్నాడు.
గోరు చిక్కుడు, క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి, అలసంద, మొక్కజొన్న, మెంతాకు, కొత్తిమీర, గోంగూర వంటి ఆకు కూరలు కూడా పండిస్తున్నాడు. జీవామృతం, ఘన జీవామృతం ద్వారా పంటలు పండిస్తున్నాడు. ఆయనకు ఉన్న రెండు ఆవుల ద్వారా సేంద్రీయ ఎరువు తయారు చేసి పంటలకు వేస్తున్నాడు. రసాయన ఎరువులు వాడకుండా ఉండటం వల్ల భూమి సారవంతంగా మారింది. దీంతో కూరగాయలు మంచి రుచిగా ఉండటంతో చుట్టుపక్కల వారు ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఇంటి వద్ద, మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ వేలకు వేలు సంపాదిస్తున్నాడు.
ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు గోరు చుక్కుడు ద్వారా రూ. 30వేలు, ముల్లంగి ద్వారా రూ. 50వేలు, కొత్తిమీరలో రూ. 20వేలు, మెంతికూర, గోంగూర ద్వారా రూ. 20వేలు ఆదాయం వచ్చిందని రైతు నారాయణప్ప తెలిపారు.
గత ఏడాది మామిడి 8 టన్నుల దిగుబడి వచ్చి రూ. 2లక్షల ఆదాయం వచ్చింది. సేంద్రీయ ఎరువుల ద్వారా పండించిన పంటలు కావడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటున్నట్లు తెలిపారు.
జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి సహకారంతో రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి తోటను పరిశీలించారని, వారి రెకమెండేషన్‌ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మొదట వ్యవసాయం కలిసి రాక భవన నిర్మాణ కూలీ పనికి వెళ్లానని, ఆ తరువాత తిరిగి ప్రకృతి వ్యవసాయం చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. ప్రస్తుతం మల్లాపురం గ్రామంలో 25 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పాడు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 3,500 మంది రైతులు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయంలో ఎనీటైం మనీ సంపాదిస్తున్నారన్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచినట్లు గుర్తించిన ఐక్యరాజ్య సమితీ ఇంటర్నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీవోస్‌ (ఐకాంగో) ఆర్‌ఈఎక్స్, కర్మవీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ భాగస్వామ్యంతో కర్మవీర చక్ర పురస్కారం అందించింది. ఢిల్లీలో 2023 నవంబరు 27న ఈ పురస్కారాన్ని రైతు నారాయణప్ప అందుకున్నారు. గతంలో ఎంఎస్‌ స్వామినాథన్, క్రీడా రంగం నుంచి రాహుల్‌ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళా రంగం నుంచి కాజోల్‌ వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు.
అరుదైన అవకాశం
పురస్కారం అందుకున్న సందర్భంగా నారాయణప్ప ఫెడరల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ నేను చేసిన శ్రమకు ఫలితం లభించిందన్నారు. ఇది అరుదైన పురస్కారమని చెప్పారు. జిల్లా ప్రకృతి వ్యవయం ప్రాజెక్టు మేనేజర్‌ సహకారంతో నేను ఈ పురస్కారాన్ని అందుకున్నానన్నారు. ఎంతో మంది గొప్ప వారికి వచ్చిన ఈ అవకాశం నాకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.


Tags:    

Similar News