కర్ణాటకలో ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ సర్వే గడువు పొడిగింపు

‘‘మే 26 నుంచి 28వ తేదీ వరకు ఏర్పాటుచేసిన శిబిరాల్లో, మే 19 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు’’ - రిటైర్డ్ జడ్జి జస్టిస్ నాగమోహన్ దాస్.;

Update: 2025-05-17 08:13 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)లో ఎస్సీ అంతర్గత రిజర్వేషన్ సర్వే(Internal reservation survey) గడువును పొడిగించారు. మే 25 వరకు పొడిగించినట్లు సర్వే కమిషన్‌కు నాయకత్వం వహిస్తున్న కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి హెచ్‌ఎన్ నాగమోహన్ దాస్ పేర్కొన్నారు. సర్వేలో భాగంగా మూడు దశల డేటా సేకరణ ప్రక్రియ మే 5న ప్రారంభమైంది. ఇంటింటి సర్వే మే 17న ముగియాల్సి ఉండగా మే 25 వరకు పొడిగించారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు మే 26 నుంచి 28 వరకు ఏర్పాటుచేసిన శిబిరాల్లో వివరాలు నమోదు చేయించవచ్చని, మే 19 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లోనూ వివరాలు పొందుపరచవచ్చని దాస్ తెలిపారు.

‘ఇప్పటివరకూ 25 లక్షలకు పైగా..’

‘‘సర్వే సజావుగా కొనసాగుతోంది. ఇప్పటికే 72 శాతం పురోగతి సాధించాం. పొడిగించిన గడువులోగా 100 శాతం సర్వే పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కర్ణాటకలో 25.72 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి,’’ అని నాగమోహన్ దాస్ (Nagmohan Das) పేర్కొన్నారు.

‘బయటకు చెప్పేందుకు ఇష్టపడడం లేదు’

సర్వే సమయంలో ఎదురైన సవాళ్లపై అడిగిన ప్రశ్నకు జస్టిస్ దాస్ సమాధానమిస్తూ.. కొన్ని ఎస్సీ కుటుంబాలు తమ కుల వివరాలను వెల్లడించడానికి ముందుకు రావడానికి ఇష్టపడకపోవడమే ప్రధాన అడ్డంకి అని పేర్కొన్నారు.

"ఆది కర్ణాటక, ఆది ద్రవిడగా సర్టిఫికెట్లు పొందిన కొంతమందికి వారి అసలు కులం తెలియదు. మరికొంతమందికి వారి అసలు కులం తెలుసు. కానీ ఆ కులాలు జాబితాలో లేవు. జాబితాలో తమ ఉప కులం ఉన్నా.. బయటకు చెప్పడానికి ఇష్టపడడం లేదు" అని చెప్పారు.

సర్వే కోసం తాము అనుసరించిన ఎలక్ట్రానిక్ ఆన్‌లైన్ పద్ధతి గురించి కేంద్రం అడిగిందని, ఆ వివరాలను వారితో పంచుకున్నామని కూడా దాస్ చెప్పారు.

గత ఏడాది అంతర్గత రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో రిజర్వేషన్ల అమలుకు అంగీకరించిన కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం.. గత నవంబర్‌లో ఈ ప్రక్రియ చేపట్టే కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి నాయకత్వం వహించేందుకు నాగమోహన్ దాస్‌ను సిద్ధరామయ్య ప్రభుత్వం నియమించింది. 

Tags:    

Similar News