వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, డీకే శివకుమార్ కు బీజేపీ మద్దతు

పార్టీ పరిస్థితులపై రాహుల్ గాంధీకి నివేదిక ఇచ్చిన ఖర్గే

Update: 2025-11-27 06:38 GMT
కే పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

కర్ణాటక రాజకీయాలలో సీఎం మార్పు హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా సీఎంగా డీకే శివకుమార్ కు తాము మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు బీజేపీ సంకేతాలు ఇవ్వడంతో రాష్ట్రంలో కలకలం రేగింది.

డీకే శివకుమార్ సీఎంగా కావడానికి తాము బయటి నుంచి మద్దతు ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ బుధవారం అన్నారు. తుమకూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఏదైన నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని అన్నారు. మరోవైపు కర్ణాటకలో అధికారంలో ఉన్న అసమ్మతిని చల్లార్చేలా కాంగ్రెస్ నాయకత్వం కూడా పావులు కదుపుతోంది. పార్టీ వ్యవహారాలపై తనకు నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ ఏఐసీసీని ఆదేశించారు.

నివేదిక ఇచ్చిన ఖర్గే..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ కు నివేదిక సమర్పించాడు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనుచరులు ఢిల్లీలో మకాం వేయడం, ఎవరికి వారు బలమైన లాబీయింగ్ చేయడం వల్ల రాష్ట్రంలో పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే, సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ లు పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీకి సమగ్ర నివేదిక ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర కాంగ్రెస్ లో రోజువారీ పరిణామాలు, అధికార బదిలీ, మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ, ముఖ్యమంత్రిని మార్చడం వల్ల కలిగే పరిణామాలు, కుల ఆధారిత లెక్కల గురించి కూడా ఆయనకు పూర్తి సమాచారం అందించారు.
శివకుమార్ సంతకాల సేకరణపై..
నాయకత్వమార్పులో తనకు కచ్చితంగా సీఎం అవకాశం కల్పించాలని కోరుతూ డీకే శివకుమార్ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం పై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మంగళవారం రాత్రి ఓ ప్రయివేట్ కార్యక్రమంలో శివకుమార్, సతీష్ జార్కిహోళికి నేరుగా ఈ ప్రతిపాదనలు చేశారని పార్టీకి సమాచారం ఉందని తెలిపాయి. ‘‘సిద్ధరామయ్య ఇప్పటికే రెండున్నరేల్లు అధికారంలో ఉన్నారు. పార్టీ ఆయనకు అన్ని ఇచ్చింది. ఇఫ్పుడు స్వచ్చందంగా రాజీనామా చేయాలని ఆయనను ఒప్పించాలి’’ అని శివకుమార్ కోరినట్లు తెలుస్తోంది.
అధికార బదిలీ..
2023 లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు.
అయితే ఇద్దరి మధ్య చెరి రెండున్నర సంవత్సరాలు అధికార బదిలీ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 20తో పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచాయి.
దీనితో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని ఊహగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పార్టీలోని రెండు వర్గాలు ఢిల్లీ వేదికగా తమ బలప్రదర్శనకు దిగాయి. పరిస్థితి దిగజారుతున్నట్లు గమనించిన పార్టీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది.
పార్టీ పరిస్థితులను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. రెండు వర్గాలు కూడా ఈ నిర్ణయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని చెబుతున్నాయి.
Tags:    

Similar News