వయనాడ్ బాధితుల పట్ల కేంద్రం తీరుపై కేరళ సీఎం విమర్శలు

‘‘కేరళ హైకోర్టు నుంచి ఆదేశాలు, శాసనసభ నుంచి అభ్యర్థనలు పంపినా వయనాడ్‌లో పునరావాస పనుల కోసం కేంద్రం రూ.1,202 కోట్ల సాయం అందించలేదు’’ - కేరళ సీఎం పినరయి విజయన్

Update: 2024-11-01 08:59 GMT

కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. వయనాడ్‌కు ఆర్థిక సాయం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర 68వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌లో కొండచెరియలు విరిగిపడి సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు.

దుర్ఘటన జరిగి 90 రోజులు గడిచినా. పునరావాస పనుల కోసం .కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా మంజూరు చేయకపోవడం క్రూరత్వమేనని విజయన్ ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన ఇతర రాష్ట్రాల విషయంలో వాళ్లు అడగకముందే కేంద్రం సాయం చేసిందని, తాము సాయం కోరినా చేయకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం, పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగునున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కూడా కేంద్రం వైఖరిని ప్రశ్నించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని సీఎం విమర్శించారు.

కేరళ హైకోర్టు నుంచి ఆదేశాలు, శాసనసభ నుంచి అభ్యర్థనలు పంపినా పునరావాస పనుల కోసం తాము కోరిన రూ.1,202 కోట్ల సాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా లేదన్నారు. ఈ విషయంలోనూ ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిందిపోయి వారికి మద్దతిస్తున్నాయని ఆరోపించారు. 

Tags:    

Similar News