కొడుకా, జర భద్రం.. కవిత కంట కన్నీరు..

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఆమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కావొచ్చు, చట్టసభల్లో ప్రతినిధి కావొచ్చు గాక ఆమె కూడా తల్లే...

Update: 2024-03-15 15:26 GMT
kavita with her son ( A special Arrangement)

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఆమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కావొచ్చు, చట్టసభల్లో ప్రతినిధి కావొచ్చు గాక ఆమె కూడా తల్లే. ఓ బిడ్డకు మాతృమూర్తే. అయితే చట్టానికి ఇవేవీ పట్టవు.. భావోద్వేగాలతో చట్టానికి సంబంధం ఉండదు కదా.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి దగ్గర చోటుచేసుకున్న హృదయ విదారక దృశ్యాలే ఇందుకు రుజువులు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను తన ఇంటి నుంచి ఢిల్లీకి తరలించేందుకు అరెస్ట్ అధికారులు వారెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆమె మరో మాట్లాడకుండా కారెక్కి కూర్చున్నారు. అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పిన ఆమె తన కొడుకును దగ్గరకు పిలిపించుకున్నారు. కార్లో ముందు సీట్లో కూర్చున్న ఆమె వద్దకు వచ్చిన ఆమె కుమారుడు తల్లిని ముద్దు పెట్టుకున్నారు. తల్లి కూడా పుత్రవాత్సల్యంతో తల నిమిరి ముద్దాడింది. కొడుక్కి జాగ్రత్తలు చెప్పింది. చేతిలో చేయి వేసిన కొడుకు తల్లి నుంచి దూరం అవుతున్నప్పుడు కవిత మనసు విలవిల్లాడిందేమో తీవ్ర భావోద్వేగానికి గురైనట్టు కనిపించింది. కెమెరాలు క్లిక్ మనకుండా చేయి ఊపిన ఆమె పక్కకు తిరిగి కళ్లు తుడుచుకున్న వీడియోలు అక్కడున్న వారందర్నీ చలింపజేసింది. కన్నీళ్ళతో కారెక్కిన కవితను ఈరాత్రికి ఢిల్లీలోని తీహార్ జైలుకి తీసుకువెళతారని ప్రచారం జరుగుతోంది. రాత్రి 8.45 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను ఢిల్లీకి విస్తారా విమానంలో తీసుకువెళ్లారు. కేసీఆర్ గారాలపట్టి కవితను పోలీసులు తీసుకువెళుతున్నప్పుడు అల్లంత దూరంలో నిలబడి చూస్తున్న అన్న కేటీఆర్, భావ హరీశ్ రావు చేతులూపుతూ వీడ్కోలు పలకడం మినహా మౌనప్రేక్షకులుగా మిగిలారు. ఆమె కుమారుడు కన్నీళ్లతో చేతులూపుతూ జాగ్రత్తమా.. అంటూ పరుగున ఇంట్లోకి వెళ్లి రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకుని బావురుమన్నప్పుడు ఓదార్చడం ఎవరి తరం కాకపోయిందని ప్రత్యక్ష సాక్షుల కథనం.

Tags:    

Similar News