Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరి బలం ఎంత ?
పోటీలోకి ఇండియా(INDIA) కూటమి తరపున ఎవరో ఒకరిని దింపాలని అనుకున్నపుడే విజయావకాశాలు అందరికీ తెలిసిందే;
ఉపరాష్ట్రపతిగా ఇండియా తరపున జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి పోటీ ఖాయమైపోయింది. ఎన్డీయే(NDA) అభ్యర్ధిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radha Krishnan) పోటీ చేస్తున్నారు. సీపీ బుధవారం నామినేషన్ కూడా దాఖలుచేశారు. లాంఛనం కాబట్టి సీపీ నామినేషన్ దాఖలుచేశారు కాని విజయం దాదాపు ఖాయమైపోయినట్లే. సుదర్శన్ రెడ్డి(Justice B Sudharsan Reddy)కి ఓట్లు వేసి గెలిపించాలని (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీలకు విజ్ఞప్తిచేశారు. అభ్యర్ధిని సూచించింది రేవంత్ కాబట్టి జస్టిస్ గెలుపుకు కృషిచేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిపైనే ఉంది. అభ్యర్ధిని ప్రతిపాదించేటపుడే ఇంకా గట్టిగా చెప్పాలంటే పోటీలోకి ఇండియా(INDIA) కూటమి తరపున ఎవరో ఒకరిని దింపాలని అనుకున్నపుడే విజయావకాశాలు అందరికీ తెలిసిందే.
ఇపుడు విషయం ఏమిటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేవలం ఎంపీలు మాత్రమే ఓటింగులో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలో లాగ ఎంఎల్ఏలకు ఓటింగ్ హక్కు ఉండదు. ఎంపీలు అంటే లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే. తాజా లెక్కల ప్రకారం లోక్ సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది ఎంపీలున్నారు. ఓటింగులో పాల్గొనబోయే ఎంపీల సంఖ్య మొత్తం 788. వీరిలో ఎన్డీయే కూటమికి లోక్ సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 130 మంది ఎంపీలున్నారు. అంటే సీపీ రాధాకృష్ణన్ కు మద్దతుగా 423మంది ఎంపీలున్నారని చెప్పవచ్చు. ఇక ఇండియా కూటమి బలం లోక్ సభలో 235 మంది ఎంపీలు, రాజ్యసభలో 78 మంది ఎంపీలున్నారు. ఉభయసభల్లో కలిపి ఇండియా కూటమి రూపంలో సుదర్శన్ రెడ్డి బలం 313గా చెప్పచ్చు.
ఎంపీల రూపంలో మొత్తం ఓట్లు 788 కాబట్టి గెలుపుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 394 ఓట్లు. ఈ లాజిక్ ప్రకారమైతే ఎన్డీయేకి మ్యాజిక్ ఫిగర్ 394 ఓట్లకు మించి అంటే 423 ఓట్లున్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం ఖాయం. ఈవిషయం అన్నీపార్టీలకు బాగాతెలుసు. అయితే ప్రజాస్వామ్యంలో పోటీచేయటం అన్నది కీలకమైన ఘట్టం కాబట్టి, గెలుపోటములతో సంబంధంలేకుండా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శనరెడ్డిని రంగంలోకి దింపింది.
లాజిక్ పనిచేస్తుందా ?
సుదర్శనరెడ్డికి ఓట్లువేసి గెలిపించమని రేవంత్ అప్పీల్ చేశారు. ఇండియా, ఎన్డీయే కూటములతో సంబంధంలేకుండా తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఉన్నాయి. మిగిలిన పార్టీల లైన్ స్పష్టంగానే ఉన్నాయి. ఈ రెండుపార్టీలకు కలిపి 14 మంది ఎంపీలున్నారు. ఇందులో కూడా వైసీపీకి 7 మంది రాజ్యసభ ఎంపీలుండగా లోక్ సభలో 3గురు ఎంపీలున్నారు. అలాగే బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు ఎంపీలున్నారు. లోక్ సభలో పార్టీబలం సున్నా. తాజా రాజకీయ పరిణామాల్లో పైన చెప్పిన 14 మంది ఎంపీలు ఎవరికి ఓట్లేస్తారన్నది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా రెండు కూటముల్లో లేని పార్టీలు మరికొన్ని కూడా ఉండచ్చు. అయితే ఏ కోణంలో చూసినా ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయమే. కూటముల బలాబలాలు, పార్టీల ఎంపీల లెక్కలు చూసిన తర్వాత రేవంత్ లాజిక్ పనిచేయదని అర్ధమవుతోంది.
ఎన్టీయార్ ను స్పూర్తిగా తీసుకోవాలని రేవంత్ చెబుతున్నది కూడా వర్కవుట్ కాదు. పీవీ నరసింహారావును ఏకగ్రీవంగా గెలిపించేందుకు అప్పట్లో ఎన్టీయార్ టీడీపీ నుండి పోటీకి అభ్యర్ధిని పెట్టకుండా సహకరించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. రేవంత్ చెప్పిందాంట్లో కొంతవరకే నిజముంది. పీవీ పోటీచేసింది అభ్యర్ధిగా కాదు ప్రధానమంత్రిగా. ముందు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పీవీ నరసింహారావు తర్వాత లోక్ సభకు ప్రాతినిధ్యం వహించటంలో భాగంగా నంద్యాల పార్లమెంటు నుండి పోటీచేశారు. అప్పట్లో టీడీపీ పోటీలో ఉన్నా పీవీ గెలుపు నల్లేరుమీద నడకలాగే ఉండేది అనటంలో సందేహంలేదు. ఏదేమైనా ఎన్టీయార్ నిర్ణయం హర్షనీయమే.
అయితే అప్పటి పీవీ పోటీకి ఇప్పటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీకి చాలా తేడా ఉంది. అప్పట్లో గెలుపు ఖాయమైన తర్వాత పీవీ పోటీచేస్తే ఇపుడు గెలుపు కనుచూపుదూరంలో లేదని తెలిసీ సుదర్శనరెడ్డి పోటీలోకి దిగారు. ఈ నేపధ్యంలో ఏ కోణంలో చూసినా రేవంత్ లాజిక్ వర్కవుట్ కాదని అర్ధమైపోతోంది.