నాగార్జునసాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత..
పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో అప్రమత్తమైన అధికారులు..;
కృష్ణా నది క్యాచ్ మెంట్ ఏరియా ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకుంది. దీంతో నాగార్జునసాగర్‌కు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఇదే నెలలో నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో నాలుగు గేట్లు వదిలిన సంగతి తెలిసిందే. తాజాగా వరదతాకిడి పెరగడంతో అక్కడి నుంచి లక్ష క్యూసెక్కులు దిగువకు వదిలారు. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి వేశారు. 77 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టమైన 590 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లోకి 65,827 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఔట్‌ఫ్లో ప్రాజెక్టు నుంచి దిగువకు 60,644 క్యూసెక్కుల నీటిని వదిలారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులకు వరద తాకిడి పెరిగింది. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ముంపుకు గురయ్యాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్ జలాశయం ప్రమాద అంచుకు చేరుకుంది . ఈ రాత్రికి వరద తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో అధికారులు జలాశయం రెండు గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు.