వయనాడ్‌లో ప్రధాని ఏరియల్ సర్వే

ప్రధాని మోదీ శనివారం కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. కొండచరియలు విరిగిపడడంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Update: 2024-08-10 09:37 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. కొండచరియలు విరిగిపడడంతో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు మోదీ కన్నూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా భారత వైమానిక దళ హెలికాప్టర్‌లో వయనాడ్‌కు బయల్దేరారు. కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి సురేశ్‌ గోపి కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం కాల్‌పేటలోని ఎస్‌కేఎంజే హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చూరల్‌మలకు బయలుదేరారు. అక్కడ తాత్కాలికంగా నిర్మించిన బెయిలీ వంతెన వద్ద సహాయక బృందాల అధికారులతో మాట్లాడారు.

విపత్తు బాధిత ప్రాంతంలో పునరావాసం, సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని రూ.2వేల కోట్లు సాయం కోరిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

మోదీకి ధన్యవాదాలు తెలిపిన రాహుల్..

మోదీ వయనాడ్ పర్యటన నేపథ్యంలో వాయనాడ్ మాజీ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వాయనాడ్ దుర్ఘటనను "జాతీయ విపత్తు"గా ప్రకటిస్తారని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జులై 29, 30 తేదీల్లో చోటుచేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో సుమారు 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య 300లకు పైనే ఉంటుందని అధికారుల అంచనా. చాలా మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Tags:    

Similar News