అక్రమ వలసదారుల కథలు వింటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి: స్టాలిన్
మహాకుంభ మేళా లో జరిగిన తొక్కిసలాటపై బీజేపీ పై విమర్శలు;
By : The Federal
Update: 2025-02-09 11:21 GMT
కుంభమేళా లో జరిగిన తొక్కిసలాట, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ట్రంప్ ప్రభుత్వం సంకెళ్లు వేసి పంపడం పై తమిళనాడు సీఎం స్పందించారు. ఆయన బీజేపీని, దాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కుంభమేళాలో తగినంత ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. చెన్నై సమీపంలోని అవడిలో శనివారం జరిగిన బహిరంగ సభలో స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు.
రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా కేంద్రం వాటా నిధులను విడుదల చేయలేదని, సాయం చేయడంలో కూడా వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. కేంద్రం తనను సరిదిద్దుకోవాలి లేదా ప్రజలచేత సరిదిద్దబడుతుందని అని స్టాలిన్ హెచ్చరించారు.
కుంభమేళాలో..
మహా కుంభమేళాలలో తొక్కిసలాట జరిగి దాదాపు 48 మంది మరణించారని, కానీ ఉత్తరప్రదేశ్ లోని యోగీ సర్కార్ మాత్రం కేవలం 30 మంది మాత్రమే మరణించారని చెబుతోందని ఆరోపించారు. ‘‘ కుంభమేళాలలో మరణించిన వారి సంఖ్య 48 అని మీడియా చెబుతోంది.
ఆ రాష్ట్ర నాయకులు ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు. ఎర్త్ మూవర్లను ఉపయోగించి మృత దేహాలను తొలగించారని సమాజ్ వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ఈ విషయంలో పార్లమెంట్ లో చర్చకు అనుమతించలేదు. భక్తులను అయితే కుంభమేళాకు ఆహ్వనించారు. వారికి సరైన భద్రత కల్పించడం బీజేపీ ప్రభుత్వ విధి కాదా?’’ అని ప్రశ్నించారు.
అక్రమ వలసదారులకు...
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. అక్కడి నుంచి పంపించి వేస్తున్న వారికి సంకెళ్లు వేస్తున్నారు. ఇది క్రూరమైన చర్య. వారి కష్టాలు తనకు కన్నీళ్లు తెప్పించాయని అన్నారు.
ఈ అంశం పై అమెరికాతో చర్చలు జరపాల్సిన విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ అమెరికా వాదనను సమర్థిస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘ భారతీయులను రక్షించడానికి ఇదేనా ప్రమాణం?’’ అని ఆయన ప్రశ్నించారు.
ప్రపంచ పర్యటన ద్వారా దేశ గౌరవాన్ని పెంచానని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని, కానీ 104 మంది అక్రమ వలసదారులైన వారికి సంకెళ్లు వేసి తీసుకురావడం మోదీకి అవమానంగా భావించలేదా’’ అని ఆశ్చర్యపోయారు.
అమెరికా అధ్యక్షుడు మీ స్నేహితుడు కాదా?. ప్రధాని మోదీ ఈ విషయంపై ట్రంప్ తో మాట్లాడాల్సిందన్నారు. దేశంలో అధికారాన్ని నిలుపుకోవడానికే రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీ స్పష్టమైన లక్ష్యం ఇదే అని విమర్శించారు.