మద్యం అమ్మకాలతో రూ. 48 వేల కోట్ల ఆదాయం ఆర్జించిన తమిళనాడు
గణాంకాలు విడుదల చేసిన ‘టాస్మాక్’, గత నెలలో వెయి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించిన ఈడీ;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-22 12:50 GMT
తమిళనాడు ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ‘తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్’(టాస్మాక్) నుంచి ఏకంగా రూ. 48,344 కోట్ల ఆదాయం పొందింది. గత సంవత్సరంలో టాస్మాక్ నుంచి రూ. 45, 855 కోట్లు రాగా, ఇప్పుడు అదనంగా మరో 2, 488 కోట్లు రాబడి వచ్చింది. ఈ ఆదాయానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ఓ నోట్ జారీచేసింది.
ఎక్సైజ్ ఆదాయం పెద్దమొత్తంలో పెరిగినట్లు కనిపిస్తోంది. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడిలో వెయ్యి కోట్ల కుంభకోణం వివరాలు లభించాయని ఆ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాస్మాక్ ఆదాయం వివరాలను బయటకు వెల్లడించింది.
మరో వైపు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి టాస్మాక్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఎక్సైజ్ శాఖలో ప్రతిరోజు రూ. 15 కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఈడీ ఆరోపణలపై నేరుగా ఇప్పటి దాకా స్పందించలేదు. అయినప్పటికీ, ఎక్సైజ్ మంత్రి వి. సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ.. పరోక్షంగా టాస్మాక్ ఎండ్ టూ ఎండ్ లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు.
స్థిరమైన ఆదాయ వృద్ది
టాస్మాక్ నుంచి పన్ను ఆదాయం స్థిరంగా పెరుగుతోంది. తమిళనాడు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆర్థిక శక్తిని ఇక్కడే నుంచే అందుతోంది. 2021-22 లో రూ. 36,050 కోట్లు, 2022-23 లో రూ. 44,121 కోట్లు, 2023-24 లో 45, 855 కోట్లు, 2024-25 లో రూ. 48,344 కోట్ల ఆదాయం టాస్మాక్ ద్వారా వచ్చినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ఎక్సైజ్ శాఖ నుంచి నేరుగా ప్రభుత్వానికి రూ. 11,020 కోట్లు రాగా, వ్యాట్ నుంచి రూ. 37,323 కోట్లు జమఅయ్యాయి.
ఇంత ఆదాయం వస్తున్నప్పటికీ మార్చి 6న టాస్మాక్ ప్రధాన కార్యాలయం, డిపోలు, ఎస్ఎన్జే, కాల్స్ వంటి డిస్టిలరీలపై ఈడీ దాడులు చేసి,కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈడీ అధికారులు తమకు వెయికోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు లభించాయని ప్రకటించారు.
2017 -2023 వరకూ 46 డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఎఫ్ఐఆర్ ఆధారంగా, తారుమారు చేసిన టెండర్లు, అధిక ధరల సీసాలు, కిక్ బ్యాక్ లతో కూడిన కుంభకోణం ఆధారాలు లభించాయని తెలిపింది.
ఈపీఎస్ దూకుడు..
టాస్మాక్ అక్రమాలపై చర్చను స్పీకర్ ఎం అప్పావు అడ్డుకోవడంతో ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
సచివాలయం వెలుపల విలేకర్లతో మాట్లాడిన ఈపీఎస్, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మౌనం వహించడం, స్పీకర్ చర్చను అడ్డుకోవడం చూస్తుంటే కుంభకోణం లో వారి పాత్ర స్పష్టమవుతుందని అన్నారు.
‘‘టాస్మాక్ ప్రధాన కార్యాలయం, మద్యం కర్మాగారాలు సహ సంబంధిత సంస్థలపై ఈడీ దాడులు చేసి రూ. 1000 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టినట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అయినప్పటికీ ముఖ్యమంత్రి తో సహ ఎవరూ మాట్లాడలేదు. నేను అసెంబ్లీలో ఈ విషయం లేవనెత్తడానికి ప్రయత్నించాను. కానీ అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. ఇది కుంభకోణంలో డీఎంకే పాత్రను స్పష్టం చేస్తోంది.
టాస్మాక్ దుకాణాలు ఒక్కో బాటిల్ కు అదనంగా రూ. 10 వసూలు చేస్తున్నాయి. రోజుకు 1.5 కోట్ల బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. అంటే రోజుకు 15 కోట్లు, నెలకు 450 కోట్ల అవినీతి సంవత్సరానికి 5,400 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు.
టాస్మాక్ సిబ్బంది దీనిని మేము వసూలు చేయలేదని చెబుతున్నారు. కానీ కొంతమంది ఉన్నతాధికారులు, ఇతరుల జేబుల్లోకి ఇవి చేరాయి’’ అని ఈపీఎస్ పదునైన విమర్శలు చేశారు.
మంత్రి సెంథిల్ బాలాజీ ఏమన్నారంటే..
మాజీ సీఎం ఈపీఎస్ ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీ స్పందించారు. బాటిల్ లపై అదనంగా రూ. 10 వసూలు చేసే ఆచారం డీఎంకే పాలనకంటే ముందే ఉందన్నారు.
తమ హయాంలో ఇలాంటి ఉల్లంఘనలపై 15,415 కేసులు నమోదు చేశారని, ఫలితంగా రూ. 6.79 కోట్ల జరిమానాలు విధించామని వివరించారు. ఈడీ ఆరోపణలపై ఆయన స్పందించనప్పటికీ పరోక్షంగా టాస్మాక్ ను సమర్థించారు. మద్యం ఉత్పత్తి నుంచి రిటైల్ వరకూ ట్రాక్ చేసే వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు.
టాస్మాక్ పారదర్శకత..
టాస్మాక్ ఈడీ దాడులపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమపై వేధింపులు, సమాఖ్య సూత్రాల ఉల్లంఘన జరిగిందని ఆరోపించింది. మార్చి 20, 2025న హైకోర్టు దర్యాప్తును నిలిపివేసింది. రేపు దీనిపై సుప్రీంకోర్టు లో విచారణ జరగబోతోంది.
ఓ వైపు మద్యం అమ్ముతూనే మద్యపాన వ్యతిరేక ప్రయత్నాలకు మద్దతుగా టాస్మాక్ అవగాహాన ప్రచారాలకు రూ. 5 కోట్లు, నిషేధ నేరాలకు పునరావాసం కల్పించడానికి రూ. 5 కోట్లు అందిస్తుంది. ఫిబ్రవరి 2025 లో ప్రారంభించబడిన 25 డీ అడిక్షన్ కేంద్రాలు డ్రగ్ ఫ్రీ తమిళనాడు మిషన్ తో కలిసి మాదక ద్రవ్య దుర్వినియోగానికి చికిత్స అందిస్తున్నాయి.