తమిళనాడు: ఉత్తరాది ఆధిపత్యాన్ని అంగీకరించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ను ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పిన తెలంగాణ సీఎం;
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లోక్ సభ స్థానాల డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ నరేంద్రమోదీ ప్రభుత్వం డీలిమిటేషన్ తీసుకువస్తే ఒకే దేశంలో ఉత్తరాది వారు, దక్షిణాది వారిని రెండో తరగతి పౌరులుగా చూస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తరాది అధికారాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఈ అంశంపై కలిసికట్టుగా పోరాడేందుకు దక్షిణాది ఐక్యమత్యంగా ఉందన్నారు. ఆయన నేడు చెన్నై లో డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హజరైన సీఎం తన అభిప్రాయాలను వెల్లడించారు.
‘‘నేడు దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుతున్నాయి. మాతో పంజాబ్ సైతం చేతులు కలిసింది. మా డిమాండ్ ఒకటే.. జనాభా ఆధారంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘1971 తరువాత దక్షిణాది రాష్ట్రాలు డెమోగ్రాఫిక్ పెనాల్టీ కారణంగా కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు దీనిని సరిగా నిర్వహించడంలో విఫలం అయ్యాయి.
అదే సమయంలో దక్షిణాది వేగంగా ఆర్థికాభివృద్ది, జీడీపీ, తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పనలో ఉత్తరాది కంటే ముందు వరుసలో దూసుకెళ్లాయి. జాతిని నిర్మించడంలో, దేశాన్ని నడిపించడంలో ఎప్పూడూ మేము ముందున్నాం’’ అని తెలంగాణ సీఎం గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇలా సమర్థవంతమైన విధానాలను అమలు చేసినందుకు మమ్మల్ని శిక్షించాలనుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ దక్షిణాది గొంతును నొక్కేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పారదర్శకత లేని ఈ డీలిమిటేషన్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలి
1976, 2001 లో అప్పటి ప్రధానులు ఇందిరాగాంధీ, వాజ్ పేయ్ అనుసరించినట్లుగానే రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
దీనివల్ల దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గదని, దీనికోసం రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని ప్రతిపాదించారు. లోక్ సభ నియోజకవర్గాల సరిహద్దులను ప్రస్తుతం జనాభా ఆధారంగా మార్చాలని కోరారు.
ప్రో రేట్ ఆఫ్ ఫార్ములా కూడా అంగీకరించేందుకు దక్షిణాది సిద్దంగా లేదని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఆధారంగా ప్రభుత్వాలు ఉంటాయని, కానీ ఈ సూత్రం ఆధారంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, యూపీ, బీహార్ ఎక్కువగా లబ్ధి పొందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ఒక్క ఓటు ఆధారంగా ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు ఉన్నాయని సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు సమానంగా లోక్ సభ సీట్లను పెంచాలని కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను సైతం ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. పెద్ద లోక్ సభ నియోజక వర్గాల ఉండే సమస్య తనకు తెలుసన్నారు. ‘‘నేను మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నాను.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నియోజకవర్గం. ఇక్కడ 42 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అయితే పార్లమెంట్ అనేది కేవలం దేశం కోసం విధానాలను రూపొందిస్తుంది. సాధారణ పౌరుల సమస్యలు దాదాపుగా రాష్ట్ర స్థాయిలోనే పరిష్కారం అవుతాయి.’’ సీఎం అభిప్రాయపడ్డారు.
రీపే... రివార్డు ఇవ్వాలి
జాతిని, దేశాన్ని గత 50 సంవత్సరాలుగా నిర్మిస్తున్న దక్షిణాదికి రీపే, రివార్డులను కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పడు 130 ఎంపీలు సీట్లు ఉన్నాయని, దేశ అధికారం క్రమంలో ఇక్కడ 24 శాతం వాటా ఉందన్నారు. దీన్ని కుదిరితే 33 శాతానికి పెంచాలని కోరారు.
ఈ అంశానికి సంబంధించి తాము త్వరలో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని మిత్రులు అంతా సహరించాలన్నారు. సమావేశానికి ఆహ్వనించిన తమిళనాడు సీఎంకు కృతజ్ఞతలో తెలిపారు.
ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సహ పలువురు ప్రముఖులు హజరయ్యారు.