కర్నాటకలో పెరుగుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు

కర్నాటకలో టీనేజ్ గర్భాలు నానాటీకి పెరుగుతన్నాయి. వీటిలో అత్యధికంగా కుటుంబాలు తెలిసి చేస్తున్న తప్పుల వల్లే అని నివేదికలు చెబుతున్నాయి. ఏంటా తప్పులు..

Update: 2024-01-13 13:53 GMT

తుమకూరు జిల్లా మధుగిరిలో కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల హస్టల్ లో చదువుకుంటున్న 14 ఏళ్ల 9 తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది. జనవరి 10న చిక్కుబళ్లాపూర్ లోని జిల్లా ఆస్పత్రిలో ప్రసవం జరిగిన తరువాత విచారణ జరిపిన ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ హస్టల్ వార్డన్ ను సస్పెండ్ చేశారు. అయితే మైనర్ బాలిక గర్భానికి కారణం అయిన వ్యక్తి ఎవరో ఇంక తెలియరాలేదు. ఇంతకుముందు కూడా ఏడాది చామరాజనగర్ జిల్లా యలందూర్ తాలుకాలో గిరిజన బాలిక గర్భం దాల్చింది. దీనిపై అధికారులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

ఆందోళనకరమైన ధోరణి

ఇంతకుముందు కూడా చిక్ మంగళూర్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హస్టల్ లో కూడా 12 వ తరగతి విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే స్వచ్చంద సంస్థలు, అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఇవన్నీ ఎప్పుడో ఒకసారి, అక్కడక్కడే జరిగే సంఘటనలు కావు. కర్నాటక గ్రామీణ ప్రాంతాల్లో యుక్త వయస్సులో గర్భం దాల్చడం విపరీతంగా పెరుగుతోంది. గర్భం దాలుస్తున్న బాలికల కుటుంబాలన్నీ ఆర్థికంగా వెనకబడినవే. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అధికారులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు చెబుతున్నారు.

బాల్యవివాహాలు

రాష్ట్రంలో నమోదు అవుతున్న టీనేజ్ గర్భాలకు కారణం బాల్యవివాహలని అధికారులు చెబుతున్నారు. ఇంకా కొన్ని తెలిసితెలియని తనంతో చేస్తున్న తప్పుల కారణంగా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. "బాలికలు గర్భం దాల్చిన సంగతి భయపడి ఎవరికి చెప్పరు. స్నేహితులు, ఉపాధ్యాయులు, హస్టల్ వార్డెన్ లు దృష్టికి తీసుకురారు" అని బాలల హక్కుల కార్యకర్త ఎస్ నరసింహ చెప్పారు. "ఒకవేళ అవాంఛిత గర్భం దాలిస్తే ఎవరిని సంప్రదించాలో కూడా వారికి తెలియదు" అని ఆయన ఫెడరల్ తో చెప్పారు.

తుమకూరు ప్రాంతానికి చెందిన వెనకబడిన వర్గానికి చెందిన రామన్ నాయక్(పేరుమార్చాం) తన కుమార్తెకు 16 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసినట్లు అంగీకరించారు. సహజంగానే ఈ వివాహాన్ని అధికారుల దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.

" నా కుమార్తెకు బిడ్డ పుట్టింది. అయితే ఇప్పుడు మేమంతా చాలా బాధపడుతున్నాం. కారణం ఆ బిడ్డకు జన్యుపరమైన రుగ్మతలు వచ్చాయి. ఓకే బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తుల మధ్య వివాహాం జరిగింది. అందుకే ఈ సమస్య" అని నాయక్ బాధగా అన్నారు. " నా కూతురు చదువుకుంటానని అని కోరింది. అయితే నేనే బలవంతం చేశాను. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చాను" అని చెప్పారు.

బాలల హక్కుల కార్యకర్త అల్విన్ మెండోంక మాట్లాడుతూ "బాల్యవివాహాలు ప్రధానంగా సంచార వర్గాల్లోనే జరుగుతాయని, వారికి అవగాహన కల్పించాలి" అని కోరారు.

కొన్ని సందర్భాల్లో బాలికలకు తాము గర్భవతి అని తెలియదు. " కొంతమంది మైనర్ బాలికలు తమకు తెలియకుండానే లైంగిక దోపిడికి గురవుతున్నారు" అని సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజ గౌడ అంటున్నారు.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ-1971 ప్రకారం పిండం అభివృద్ధి చెందిన 20 వారాల్లోపే గర్భాన్ని తొలగించవచ్చు. అయితే ఇటీవల గుజరాత్ హైకోర్టు 16 ఏళ్ల అత్యాచార బాధితురాలికి మాత్రం 27 వారాలు గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే 34 వారాల పిండాన్ని తొలగించడానకి కేరళ హైకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో బాధితురాలి వయస్సు 12 ఏళ్లు అయినప్పటికీ కోర్టు ఒప్పుకోలేదు. ఇటీవల కర్నాటక హైకోర్టు బాల్యవివాహలను నియంత్రించే ఫోక్సో చట్టం ప్రకారం అత్యాచారానికి, లైంగిక నేరాలకు గురైన ప్రతి ఆడ శిశువుకు గర్భపరీక్ష కచ్చితంగా నిర్వహించాలని తీర్పు చెప్పింది.

మైసూర్ కు చెందిన ఓడనాడి సేవా సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం నుంచి సేకరించిన వివరాలు ప్రకారం 2020 నుంచి 2023 వరకూ 45,557 టీనేజ్ గర్భాల కేసులు నమోదు అయినట్లు వివరాలు బయటపెట్టింది.

ప్రభుత్వం అడుగులు

2023 మొదటి ఆరు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,736 కేసులు నమోదు అయ్యాయి. సంవత్సరం చివరి నాటికి 5000 కు చేరి ఉండవచ్చు. అధికారుల లెక్కల ప్రకారం టీనేజ్ గర్భాల్లో 90 శాతం 18 ఏళ్లలోపు బాలికలే. అయితే పరిస్థితిని నివారించడానికి, విద్యార్థులు భద్రతను పర్యవేక్షించడానికి ప్రభుత్వ హస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సాంఘిక సంక్షేమ, హోంశాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అలాగే విద్యార్థినులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అలాగే హస్టల్ వార్డెన్ పాత్రను పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉందని అధికారులంటున్నారు.

Tags:    

Similar News