బెట్టింగ్ యాప్ కేసుల్లో గొర్రెల స్కాం నిందితులు
200 మ్యూల్ అకౌంట్లు స్వాధీనం;
బిఆర్ ప్రభుత్వ హయాంలో గొర్రెల కుంభకోణం జరిగిన కేసులో ఈడీ పురోగతి సాధించింది.తెలంగాణను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్ కేసుల్లో తీగ లాగితే డొంక కదులుతోంది. బెట్టింగ్ యాప్స్ కేసుల్లో గొర్రెల స్కాం నిందితులు ఉన్నట్టు బయటపడింది. ఈ నిందితుల అకౌంట్లను సీజ్ చేసి దర్యాప్తు చేస్తే విస్తుపోయే నిజాలు వెల్లడౌతున్నాయి. నిందితులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారు అని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ స్కాంతో సంబంధమున్న 200 మ్యూల్ బ్యాంకు అకౌంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. అకౌంట్లతో బాటు డెబిట్ కార్డు, చెక్ బుక్స్ ఈడీ స్వాధీనం చేసుకుంది. గొర్రెల స్కాంలో వచ్చిన డబ్బులను నిందితులు బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
మ్యూల్ ఖాతాలు అంటే..
మ్యూల్ ఖాతాలు (Mule accounts) అంటే నేరగాళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బును మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతాలు. ఈ ఖాతాలను సాధారణంగా అమాయక వ్యక్తుల పేర్లతో తెరుస్తారు, వారు నేరగాళ్ల మాయలో పడి ఈ ఉచ్చులో చిక్కుక్కుంటారు. నేరగాళ్లు సాధారణంగా మ్యూల్ ఖాతాలను ఉపయోగించి డబ్బును బదిలీ చేస్తారు. మ్యూల్ ఖాతాదారుడు నేర కార్యకలాపాలకు పాల్పడినట్లుగా పరిగణిస్తే చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు.
డబ్బుటుది పవరాఫ్ డబ్బు
గొర్రెల స్కాంపై పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పి . మోహన్ రావు ‘‘ఫెడరల్ తెలంగాణ’’తో మాట్లాడారు. ‘‘డబ్బు టు ది పవరాఫ్ డబ్బు అంటారు. డబ్బు డబ్బును సృష్టించగలదు అని గొర్రెల స్కాం నిందితులు బలంగా నమ్మారు’’ అని ఆయన అన్నారు. ‘‘బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ స్కాం జరిగినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. రూ.వెయ్యి కోట్లకు పైగా స్కాం జరిగినట్టు ఈడీ తేల్చి చెప్పింది. స్కాం జరగలేదని బిఆర్ఎస్ నేతలు, నింద పడ్డ అధికారులు నిరూపించుకోవల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు. గొర్రెల స్కాంలో వచ్చిన ప్రతీ పైసాను చట్ట విరుద్ద బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అభియోగం మోపింది. చట్టవిరుద్దమైన బెట్టింగ్ యాప్స్ కేసులో నిందితుల బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయినట్టు ఈడీ అధికారులు తేల్చారు.
ఈ బ్యాంకు ఖాతాలు బెట్టింగ్ యాప్‌తో ముడిపడి ఉన్నాయని, దీని ద్వారా నల్ల డబ్బును తెల్లగా మార్చుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. కొంతమంది ప్రభుత్వ అధికారులకు, ఇతరులకు "కిక్‌బ్యాక్‌లు" చెల్లించినట్లు సూచించే ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
తీగ లాగితే డొంక కదులుతోంది
డిసెంబర్ 2023లో తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఫలితంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గొర్రెల స్కాం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక శాఖాధికారులు దర్యాప్తు చేస్తుంటే ఈ స్కాంలో ఒక్కో విషయం వెల్లడౌతుంది.
గొర్రెల కాపరి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది.
ఈ ఏడాది జూలై 30న పశుసంవర్ధక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేషితో సంబంధం ఉన్న అధికారులతో సహా హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రదేశాలపై ED దాడులు చేసింది. తలసాని శ్రీనివాస్‌తో పేషిలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) కళ్యాణ్ కుమార్ , డిపార్ట్‌మెంట్ కార్యాలయంలోకి చొరబడి కొన్ని రికార్డులను తొలగించారని ఎసిబి తన ఎఫ్ ఐ ఆర్(ACB FIR) లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ నిధులను నకిలీ విక్రేతల బ్యాంకు ఖాతాలకు చట్టవిరుద్ధంగా మళ్లించినట్టు దర్యాప్తులో తేలింది.
కాగ్ రిపోర్ట్ లో మరిన్ని నిజాలు
భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) నుండి వచ్చిన ఆడిట్ నివేదిక గొర్రెల పంపిణీ పథకం అమలులో అనేక అవకతవకలను జరిగినట్టు బయటపడింది. వీటిలో లబ్ధిదారుల వారీగా వివరాలను నిర్వహించలేదని వెల్లడైంది. రవాణా ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులకు సంబంధించిన ఇన్‌వాయిస్‌ల సరిగ్గా లేవని తేలిపోయింది. ప్రయాణికుల వాహనాలు ఇన్‌వాయిస్‌లపై చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్టు తేలిపోయింది. గొర్రెల యూనిట్లకు కేటాయించిన ట్యాగ్‌లు నకిలీవని గుర్తించింది. చనిపోయినవ్యక్తుల పేరిట కూడా గొర్రెల యూనిట్లు ఉన్నట్టు బయటపడింది.
రూ.1000 కోట్ల స్కాం
గొర్రెల స్కాంలో 700 కోట్లు చేతులు మారినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే ఈడీ అధికారులు మాత్రం వెయ్యి కోట్లు చేతులు మారినట్టు చెబుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రూ.1000 కోట్ల గొర్రెల కుంభకోణం జరిగిందని ఈడీ ప్రకటన చేయడం పొలిటికల్ సర్కిళ్లలో సంచలనమైంది. CAG ఆడిట్‌లో కేవలం 7 జిల్లాల్లోనే 253.93 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది. 33 జిల్లాల్లోనూ రూ. 1000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ED అధికారికంగా ప్రకటన జారీ చేసింది.