‘మోదీని గద్దె దించైనా రిజర్వేషన్లు సాధిస్తాం’

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించిన తెలంగాణ సీఎం రేవంత్.;

Update: 2025-08-06 08:59 GMT

బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ కాంగ్రెస్.. ఢిల్లీలో చేపట్టిన మహాధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు అందించేవరకు తాము విశ్రమించమన్నారు. ఎంతదూరం వెళ్లయినా బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామని, బీసీలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఢీ కొట్టడానికి కూడా వెనకాడమని రేవంత్ వెల్లడించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలన్నారు. “బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి” అని డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం శోచనీయాంశమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తరఫున బీసీలకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

‘‘రాహుల్ గాంధీ ఆశయం మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చాం. ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. కేంద్రం మాత్రం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఇదే అంశంపై ఆర్డినెన్స్ కూడా చేశాం. దానిని గవర్నర్.. కేంద్రహోంశాఖకు సిఫార్సు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కేంద్రం కావాలనే జాప్యం చేస్తోంది. అందుకనే ఢిల్లీకి కదిలి వచ్చి ధర్నా చేపట్టాం. తెలంగాణ పంపిన బిల్లును అమోదించాలని రాష్ట్రపతిని కోరాలని భావించాం. అందుకోసం ఈ బిల్లుపై వినతిపత్రం అందించడం కోసం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరాం. కానీ అదీ మాకు దక్కలేదు. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారనేది మా అనుమానం. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించే వరకు మా పోరాటం ఆగదు’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News