తుపానులో ఆ కన్ను ఏమిటీ? అది అంత ప్రమాదమా!
అల్పపీడనం ఎన్ని దశల తర్వాత తుపానుగా మారుతుందో తెలుసా!
By : The Federal
Update: 2025-10-28 12:20 GMT
సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన నాటి నుంచి అది తుపాను, తీవ్ర తుపానుగా మారుతుంది. తీరం దాటే వరకు ఎన్నో దశలుగా మార్చుకుంటుంది. కొన్ని అల్పపీడనం దశలో, మరికొన్ని వాయుగుండాలకే పరిమితమవుతాయి. కొన్ని బలపడి తుపాను, తీవ్ర తుపాన్లుగా తీరం దాటి నేలపైకి వస్తాయి.
తుపాను గమనంలో కీలకం కేంద్ర స్థానమే. తుపాను తీవ్రతకు అనుగుణంగా దీని విస్తృతి పెరుగుతుంది. శక్తిమంతమైన తుపాను కేంద్రంలో ఉండే ప్రాంతాన్ని కన్ను అంటారు. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి నెమ్మదిగా వీస్తుంది. అసలు ఉండకపోవచ్చు. వర్షం ఉండదు. కానీ ఆ కన్ను దాటితే మాత్రం విలయమే.
అల్పపీడనం నుంచి తుపాను వరకు..
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 26.5°C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, సముద్ర జలాల ఆవిరి గాలిలోకి ఎగసి అల్పపీడనం (Low Pressure Area) ఏర్పడుతుంది.
దీనికి వాతావరణ శాఖ (IMD) ప్రకారం దశలు ఇలా:
అల్పపీడనం Low Pressure Area (LPA) – గాలివేగం 0–30 km/h
వాయుగుండం Depression – గాలివేగం 31–49 km/h
తీవ్ర వాయుగుండం- Deep Depression – 50–61 km/h
తుపాను-Cyclonic Storm – 62–88 km/h
తీవ్ర తుపాను- Severe Cyclonic Storm – 89–117 km/h
అత్యంత తీవ్ర తుపాను Very Severe Cyclonic Storm – 118–165 km/h
అత్యధిక తీవ్రత కలిగిన తుపాను- Extremely Severe Cyclonic Storm – 166–220 km/h
భీకర తుపాను- Super Cyclone – 221 km/h లేదా అంతకంటే ఎక్కువ
తుపానులోని “కన్ను” గురించి...
“Eye of the storm” అనేది తుపానులో అత్యంత ప్రశాంతమైన కేంద్ర భాగం. ఇక్కడ గాలి నిలకడగా ఉంటుంది, వర్షం ఉండదు. కానీ దాని చుట్టూ ఉండే ప్రాంతం (“Eye Wall”)లోనే అత్యధిక వేగం గాలులు, ఉరుములు, వర్షాలు, మెరుపులు చోటుచేసుకుంటాయి.
కన్ను దాటితే విలయమే. కన్ను చుట్టూ ఉండే వలయాకారాన్ని కంటి గోడలు అంటారు. ఈ ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలు అన్నీ కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలతో సుడిగుండాలతో అల్పపీడనం ఏర్పడుతుంది. తర్వాత వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తుపానుగా బలపడిన తర్వాత కేంద్ర స్థానం స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్ర తుపాను అయితే మరింత పెద్దగా కనిపిస్తుంది. కేంద్ర స్థానం విస్తృతి 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. తర్వాత కంటి గోడల విస్తృతి అంటే తుపాను కేంద్ర స్థానం నుంచి 225 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
తుపాను తీరం తాకి.. మళ్లీ సముద్రంలోకి వెళ్తుందా?
తుపాను తీరం తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్లడం అరుదే. సాధారణంగా తుపాన్లు తీరాన్ని తాకితే బలహీనపడతాయి. కానీ 2022 మే నెలలో ఏర్పడిన అసని తుపాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద తీరాన్ని దాటి, వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తూ మళ్లీ కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లింది.
తుపాను ఫలానా చోట తీరం దాటిందని వాతావరణశాఖ ప్రకటిస్తుంది. కానీ అక్కడ ఎలాంటి గాలి, వాన ఉండదు. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. తీరం దాటిందా? అని అక్కడున్నవారే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది తుపాను కేంద్ర స్థానం. అక్కడ ఎలాంటి అలజడి ఉండదు. కేంద్ర స్థానం తర్వాత నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అలజడి అధికంగా ఉంటుంది.
తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు, గాలులు వీస్తాయి. తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు. తర్వాత కొద్దిసేపటికి మళ్లీ విలయం మొదలవుతుంది. తీరం దాటినప్పుడు ఏ ప్రభావం లేదని అలసత్వం వహిస్తే తర్వాత భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది.
1979 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో తీరం తాకిన తుపాను కంటి విస్తృతి 425 కి.మీ. అంటే కేంద్ర స్థానం నుంచి 425 కి.మీ. విస్తృతిలో ప్రభావం చూపింది. భారత తీరంలో ఇదో రికార్డు. హుద్‌హుద్ విస్తృతి 44-66 కిలోమీటర్లుగా ఉంది.
ప్రస్తుతం హరికేన్ మెలిసా కరీబియన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైంది. అయితే, ఆ హరికేన్ ను అధ్యయనం చేసేందుకు అమెరికా వైమానిక దళానికి చెందిన వెదర్ విమానం సోమవారం చక్కర్లు కొట్టింది. హరికేన్ మెలిసా ఐ భాగంలో రౌండ్లు వేస్తూ వీడియోలు తీశారు అందులో కంటి భాగం మధ్యలో ప్రశాంతంగా కనిపిస్తోంది.