హైదరాబాద్ నగర వాసులకు వరద హెచ్చరిక జారీ, ఎందుకంటే...
మెట్రో వాటర్ బోర్డు జారీ చేసిన హెచ్చరికలో ఏముందంటే...;
By : Saleem Shaik
Update: 2025-08-07 04:51 GMT
నగరంలోని జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతుండటంతో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అప్రమత్తమైంది. మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు గురువారం ప్రకటించారు. జలాశయాల నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ ఆనకట్టల వరద గేట్లు తెరిచే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ జిల్లా అధికార యంత్రాంగం మూసీ నదికి ఇరువైపులా ఉన్న పలు ప్రాంతాలకు వరద హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు జనరల్ మేనేజరు ఎస్ సంతోష్ కుమార్ లేఖ నంబరు జీఎం (ఈ) ట్రాన్స్ మిషన్ ఫ్లడ్ గేట్స్ 2025-26 571 నంబరుతో హెచ్చరిక జారీ చేశారు.
జలాశయాల గేట్లు తెరిస్తే...
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HWWS&SB) తాజాగా నగర ప్రజలకు హెచ్చరికను జారీ చేసింది.జలాశయాల గేట్లు తెరిస్తే వరదనీరు మూసీతీర ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వాటర్ బోర్డు హెచ్చరించింది. ఈ హెచ్చరిక కారణంగా మూసీ నదీ తర ప్రాంతాల్లో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు కోరారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు తమ ఇళ్ల నుంచి దూరంగా వెళ్లి వారి కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయాలలో ఉండాలని అధికారులు సూచించారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు, హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్, జియాగూడ వంద అడుగుల రోడ్డు, అత్తాపూర్, నాగోల్, మూసారంబాగ్‌లోని మూసీనదీ తీర సమీపంలోని నివాస కాలనీలు ముంపునకు గురవుతాయి.
ఈ మూసీ తీర ప్రాంతాల్లో అలర్ట్ జారీ
హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశం ఉంది.ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ఈ జలాశయంలోకి కూడా భారీగా వరదనీరు చేరుతుంది. పూల్ బాగ్, బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, నార్సింగి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు.
ముసారాంబాగ్ వంతెనపై రాకపోకల నిలిపివేత
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అదనపు నీటిని దిగువకు వదలడంతో మూసీలో నీటిమట్టం మరింత పెరిగింది. ముసారాంబాగ్ వంతెనపై నుంచి నిన్నటి నుంచి రాకపోకలను నిషేధించారు.
సహాయ పునరావాస కేంద్రాలు
మూసీ తీరంలోని కాలనీల్లో వరదనీరు చేరే అవకాశం ఉండటంతో సమీపంలోని ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో ముంపు బాధిత కుటుంబాలకు అధికారులు తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేశారు.జలాశయాల నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత పోలీసులు, జీహెచ్ ఎంసీ, హైడ్రా అధికారుల సహాయంతో పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షించనున్నారు.రెండు జలాశయాల నుంచి నీటిని విడుదల చేసినప్పుడు మూసీ నది ఒడ్డున నిర్మించిన ఇళ్లు మునిగిపోతాయి. రేవంత్ ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి ప్రణాళికను రూపొందించినా అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.
నగరాన్ని అతలాకుతలం చేసిన 1908 వరదలు
1908వ సంవత్సరంలో మూసీ నది వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో అప్పటి నిజాం నవాబు వరదలను నివారించడంతోపాటు నగరానికి మంచినీటిని అందించేందుకు వీలుగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. వరదలను నిరోధించడానికి ఈ రెండు ఆనకట్టలను నిర్మించారు.వేలాది మంది ప్రజలు నది ఒడ్డున స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో భారీ వర్షాల సమయంలో రెండు నీటి వనరుల నుంచి నీరు విడుదల చేసినపుడల్లా మూసీ తీర ప్రాంత కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.