పెళ్లయిన మరుసటి రోజే వరుడికి గుండెపోటు
మీర్ పేటలో తీవ్ర విషాదం;
తాళి కట్టిన రెండో రోజే వరుడు గుండెపోటుతో చనిపోయాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయిన 24 గంటల్లో ఆ ఇంట్లో చావు డప్పుమోగింది. పెళ్లయిన తర్వాత జరిగే అప్పగింతల వేడుకలో వరుడు తీన్ మార్ డాన్స్ చేశాడు. రాత్రి బరాత్ లో ఫ్రెండ్స్ తో డాన్సు కూడా చేశాడు. పెళ్లయిన సంతోషం ఆ వరుడికి దక్కలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వరుడుకి గుండెపోటు రావడం పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన రాచకొండ కమీషనరేట్ హైదరాబాద్ మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బడంగ్ పేట లక్ష్మి దుర్గ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్(25) కు రెండ్రోజుల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన తర్వాత జరిగే బరాత్ లో అనిల్ కుమార్ హుషారుగా డాన్స్ లు కూడా చేశాడు. పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి చేరుకున్న అనిల్ కుమార్ కు సడెన్ గా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు.
మన దేశంలో ఇటీవలె యువకులు ఎక్కువ సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారు. 40 ఏళ్లలోపు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ICMR) ఇటీవల వెల్లడించిన నివేదికలో కూడా యువకులు ఎక్కువ సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఈ మరణాలు మరింత పెరిగాయి. సరైన ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలి అలవర్చుకుంటే గుండెపోటు మరణాలను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గుండెరక్తనాళాల్లో క్రమంగా క్రొవ్వు పేరుకుపోయి గుండెపోటుకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. బ్లడ్ ప్రషర్ ను కంట్రోల్ పెట్టుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి వంటి రుగ్మతలు దరి చేరకుండా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘‘ప్రతీ ఆరు నెలలకు పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.పౌష్టిక ఆహారం, సరైన నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ ప్రధానం’’ అని వైద్యులు సూచిస్తున్నారు.