సబ్సిడీ భారం వదిలించుకోవడానికేనా?
యూరియా కొరత వెనుక అసలు కథ!
వానలు బాగా పడుతున్నాయి. పూర్తి స్థాయిలో రైతులు సాగుకు సిద్దం కావడంతో "ఈ ఏడాది యూరియా కొరత ఎక్కువైందని సంగారెడ్డి కి చెందిన రైతు చిన్న శ్రీశైలం చెప్పారు. యూరియా కోసం ఉదయాన్నే వెళ్తే ఒక్క బస్తా ఇచ్చి పంపించారని" చెప్పారు. యూరియా కొరతతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పంపిణీ కేంద్రాలు, దుకాణాల ముందు రేయింబవళ్లు బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. లైన్‌లో చెప్పులు ఉంచిన దృశ్యాలు.. రాస్తారోకోలు.. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం సరిహద్దు వరకు చాలా జిల్లాలలో కనిపిస్తున్నాయి. తెలంగాణలో యూరియా కొరతకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది.
ఎరువుల కొరతకు కేంద్రం నుంచి తగినంత సరఫరా లేకపోవడమే కారణమని రేవంత్ సర్కార్ చెబుతోంది. కేంద్రం నుంచి అవసరమైన సరఫరా జరుగుతోందని బీజేపీ అంటోంది. ఎవరి వాదన వారిదే.
వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్‌లో "ఒక కోటి 32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఈ వానాకాలం సీజన్లో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఏప్రిల్ నాటికి 1.92 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. పైగా కేంద్రం నుంచి వచ్చే నెలవారీ యూరియా కోటాలోనూ కోత పడిందని" తెలంగాణ ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది.
ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి "కేంద్రం నుంచి 8.30 లక్షల టన్నులకుగాను 5.12 లక్షల టన్నుల యూరియానే వచ్చినట్లుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపుల్లో కోత కారణంగా మొత్తంగా 2.76 లక్షల టన్నుల కొరత ఏర్పడిందని" మంత్రి వివరించారు.
యూరియా సరఫరాలో కేంద్రం నుంచి ఎక్కడా లోపం జరగలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ది ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం "2025 యాసంగి సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల టన్నులు సరఫరా చేసిందని ఆయన వివరించారు. ఆ సీజన్‌లో 10.43 లక్షల టన్నులు రైతులకు విక్రయించగా, 2.04 లక్షల టన్నులు ఈ వానాకాలం ఓపెనింగ్ స్టాక్‌గా ఉండాలని చెప్పారు. ఓపెనింగ్ స్టాక్ లెక్కల్లో తేడాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని" రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. మరుసటి వ్యవసాయ సీజన్‌కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అయితే, 2022 నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేయడంలేదని తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ ది ఫెడరల్ తెలంగాణాకి చెప్పారు.
''పంటల వారీగా వ్యవసాయ ప్రణాళిక వేయాలని ఎన్నోసార్లు అడిగాం. దాన్నిబట్టి ఎరువులను డిమాండుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. అది జరగడం లేదు'' అని సాగర్ చెప్పారు. "యూరియా వాడకాన్ని తగ్గించి సబ్సిడీ భారం వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి గత ఏడాది 71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కోసం ఆర్డర్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది కేవలం 60 మెట్రిక్ టన్నుల యూరియా కోసమే కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. అంటే 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తగ్గంది. కాబట్టి ఈ తగ్గుదలను రాష్ట్రాల వారిగా తగ్గించేశారు. తెలంగాణాకు రావాల్సిన దానికన్నా 3 లక్షల టన్నుల యూరియా తగ్గించారని" తెలంగాణా రైతు సంఘం చెబుతోంది.
ఈసారి ఎరువుల కొరత రావడానికి ప్రధాన కారణంగా "రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కువ రోజులు షట్ డౌన్‌కు గురికావడం కూడా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 145 పని దినాలు (వర్కింగ్ డేస్) ఉంటే 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోయిందని" తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతిక కారణాలు, అమ్మోనియం లీకేజీతో ఉత్పత్తి నిలిచిందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతూ వస్తోంది. ఈ ప్రభావం తెలంగాణపై పడుతోంది.