ఆదిలాబాద్ గోండు గిరిజన మాస్టారికి ఢిల్లీ ఆహ్వానం
మొన్న మన్ కీ బాత్, ఇపుడు రాష్ట్రపతి ప్రశంస;
By : Saleem Shaik
Update: 2025-08-04 23:32 GMT
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండు గిరిజన మాస్టారు తొడసం కైలాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. మహాభారత్ కథను గోండి భాషలో అనువదించిన గోండు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ మాస్టారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది.ఆగస్టు 15వతేదీన జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ రావాలని రాష్ట్రపతి భవన్ నుంచి కైలాస్ మాస్టారికి పిలుపువచ్చింది.పోస్టల్ డిపార్ట్ మెంట్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ సందీప్ ,మహేష్ లు సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి పంపిన ఆహ్వానాన్ని కైలాస్ కు అందజేశారు.
గిరిజనగూడెం నుంచి గోండు మాస్టారి ప్రస్థానం
ఆదిలాబాద్ జిల్లా గిరిజనగూడేనికి చెందిన తొడసం కైలాస్ నిరుపేద కుటుంబంలో జన్మించారు. కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. ఒక వైపు పిల్లలకు పాఠాలు చెబుతూనే మరో వైపు తన గోండు సంస్కృతిని మర్చిపోకుండా మహాభారతాన్ని గోండి భాషలో రాశారు.యూట్యూబ్ మాధ్యమం ద్వారా గోండి భాషను ప్రచారం చేస్తున్నారు. తాను పనిచేస్తున్న పాఠశాలలో ప్రొజెక్టరు కొని దాని ద్వారా విద్యాబోధన చేశారు.రక్తదానం మహాదానమని గుర్తించిన కైలాస్ పది సార్లు రక్తదానం చేశారు.
కృత్రిమ మేధతో యాంకర్
అంతరించి పోతున్న గోండి భాషలో పండోక్న మహాభారత్ కథకు అక్షరరూపం ఇచ్చిన ఈ టీచరు తొడసం కైలాస్ పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నారు.గోండు భాషలో పుస్తకాలు రాయడమే కాకుండా ఏఐను ఉపయోగంలో తీసుకువచ్చిన మాస్టారు గోండి భాషలో మొట్టమొదటి సారిగా ఒక కృత్రిమ మేధ యాంకర్ ‘సుంగల్ తుర్పో’ ‘నెలేంజ్’ ను సృష్టించి వార్తలు చేసి యూట్యూబ్ మాధ్యమంలో పోస్టు చేశారు.
వివిధ భాషల్లో పాటలు
కైలాస్ టీచర్ కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్న గోండి పదాలను ఉపయోగించి, వాటిని వాడుకలోకి తీసుకువచ్చి ప్రజలకు అందించారు.గోండి, కొలామి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కలుపుకొని ఇప్పటివరకు 330 కి పైగా పాటలు రాసి వాటిని ఏఐతో పాడించి రికార్డ్ సృష్టించారు.తాను స్వరపరిచిన పాటలను యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేశారు. ఆ పాటలు విన్న ఆదివాసీ యువతీ, యువకుల నుంచి విశేష స్పందన లభించింది.కైలాస్ రాసి,పాడిన పాటలు యువకులు, పెద్దలను ఆలోచింప చేసేవిగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు.
గోండి భాషలో పండోక్న మహాభారత్ కథ
తొడసం కైలాస్ గతంలో తన మాతృ భాష అయిన గోండి భాషలో ‘పండోక్న మహాభారత్ కథ’ పేరుతో మహాభారతాన్ని గోండి భాషలో అనువదించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేవలం నాలుగు నెలల్లోనే మహాభారతాన్ని గోండి భాషలో అది కూడా తన మొబైల్ ఫోన్ లోనే టైప్ చేశారు. ఈ పుస్తకంలో గతంలో వాడి, ప్రస్తుతం వాడుకలో లేని అంతరించే ప్రమాదంలో ఉన్న గోండి పదాలని వెలికి తీసి తన పుస్తకంలో రాశారు.ఈ పుస్తకాన్ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించి కైలాస్ మాస్టారిని అభినందించారు.
గౌరాపూర్ ఉపాధ్యాయుడికి రాష్ట్రపతి పిలుపు
ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘీక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ మాస్టరుకు అరుదైన అవకాశం దక్కింది. ఈ నెల 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు , ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసే రాష్ట్రపతి విందులో పాల్గొనేందుకు ఆయనకు రాష్ట్రపతి ఆహ్వానం పంపించారు. సోమవారం రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన లేఖను కైలాస్ స్వగ్రామమైన వాఘాపూర్ కు డివిజనల్ పోస్ట్ ఆఫీసర్ వచ్చి కైలాస్ కు అందించారు.
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రశంసలు
దేశ ప్రధాని ప్రధాని మోదీ తన 119 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో తొడసం కైలాస్ సేవలని కొనియాడుతూ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో భారతీయులు ఏం తక్కువ కాదని ఆ సందర్భంగా కైలాస్ సేవలని ప్రశంసించారు. దాంతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కైలాస్ మాస్టారిని అభినందించారు. దాంతో కైలాస్ అందరి దృష్టిలో పడ్డారు. అప్పటివరకు కైలాస్ తన పనేదో తాను చేసుకుంటూ వచ్చారు.కైలాస్ ప్రధాని దృష్టిలోకి రావడంతో కైలాస్ ను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది గోండు గిరిజన యువకులు రచనల వైపు అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రపతి భవన్ కు వెళ్లినా...
కైలాస్ మాస్టారు 2023 వ సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ గుమ్మం వరకు వెళ్లి రాష్ట్రపతిని కలవకుండా నిరాశతో వెనుతిరిగి వచ్చినా, ఆ తర్వాత మళ్లీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 2023వ సంవత్సరంలో ఎన్నికైన తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును అభినందించడానికి వెళ్లిన ఇరవై మంది ఆదివాసీల బృందంలో తొడసం కైలాస్ కూడా ఉన్నారు.కైలాస్ రాష్ట్రపతి భవన్ లోని విజిటర్స్ గ్యాలరీ వరకు వెళ్లాక రాష్ట్రపతిని కలవడానికి కేవలం పది మందికి మాత్రమే అవకాశం రావడంతో కైలాస్ ఢిల్లీ వరకు వెళ్లి రాష్ట్రపతిని కలవకుండానే వెనుతిరిగారు. ఆ తరువాత 2024 వసంవత్సరం నవంబర్ నెలలో హైదరాబాద్ లోని శిల్పా కళా వేదికపై జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగాన్ని కైలాస్ విన్నారు.
నాడు ప్రధాని మోదీ...నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గుర్తింపు
నాడు ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు అందుకున్న కైలాస్ మాస్టారికి ఆగస్టు 15వతేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రాష్ట్రపతి భవన్ కు రమ్మని ఆహ్వానించారు.ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో ఆగస్ట్ 15వతేదీన జరిగే దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని కైలాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కైలాస్ మాస్టారి భవిష్యత్ లక్ష్యాలు
గోండి భాషను భారత రాజ్యాంగలోని ఎనిమిదవ షెడ్యూల్ లో చేర్చాలని కైలాస్ మాస్టారు కోరారు. గోండి భాషను విశ్వ వ్యాప్తం చేయడానికి పాఠశాల స్థాయిలో గోండి భాష బోధన ప్రారంభించాలని ఆయన సూచించారు.భూమి లేని నిరుపేద గిరిజన కుటుంబాలకు ఐదు ఎకరాల భూమి మంజూరు చేయాలని ఆయన కోరారు.గోండి భాష చదవడంలోని ఇబ్బందులను గుర్తించి తొడసం కైలాస్ గోండి స్పష్టంగా చదివే అప్లికేషన్ ను కనుగొని దాంతో గోండి భాషను డెవలప్ చేశారు.
అవార్డులెన్నో...
గిరిజన మాస్టారైన కైలాస్ కు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాన్ని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అందజేశారు.కైలాస్ కు ఈ అరుదైన అవకాశం దక్కడంతో వాఘాపూర్ గ్రామస్తులందరూ తరలి వచ్చి కైలాస్ ను శాలువాతో సత్కరించారు.