బీఆర్ఎస్ కు ‘గువ్వల’ రాజీనామా కారణం ఇదేనా ?

బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది;

Update: 2025-08-05 09:07 GMT
BRS former MLA Guvvala Balaraju

అచ్చంపేటకు రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేసిన గువ్వల బాలరాజు రాజీనామా బీఆర్ఎస్(BRS) పార్టీపైన గట్టిగానే పడేట్లుంది. గువ్వల టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుండి అధినేత కేసీఆర్(KCR) కు గట్టి మద్దతుదారుడిగా ఉండేవారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట (ఎస్సీ)నియోజకవర్గం నుండి గువ్వల 2014, 2018 ఎన్నికల్లో గెలిచారు. మూడోసారి 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా, బీఆర్ఎస్(BRS) ప్రతిపక్షంలోకి మారినా గువ్వలైతే(Guvvala Bala Raju) పార్టీకి గట్టి మద్దతుదారుడిగానే ఉండేవారు. అలాంటిది సడెన్ గా పార్టీకి ఎందుకు రాజీనామా చేశారనే చర్చ బాగా జరుగుతోంది. అదికూడా కాళేశ్వరం ప్రాజెక్టు(kaleswaram Project)పై జస్టిస్ పీసీ ఘో(Justice PC Ghosh)ష్ రిపోర్టుపై చర్చించేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్(Revanth Cabinet) సమావేశమైన సోమవారమే గువ్వల రాజీనామా అంశం బయటపడింది.

ఈనెల 2వ తేదీన కేసీఆర్ కు రాసిన లేఖలో గువ్వల తన రాజీనామా విషయాన్ని స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఏ పార్టీలో చేరేది స్పష్టంచేయనప్పటికీ బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గువ్వల రాజీనామా బీఆర్ఎస్ మీద గట్టి ప్రభావమే చూపుతుందని అనిపిస్తోంది. లేకపోతే బాలరాజు రాజీనామా విషయంగురించి పార్టీలో ఇంతగా చర్చ జరగదు. మాజీమంత్రి, కారుపార్టీ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు ముందే బీజేపీలో చేరాలని మాట్లాడుకున్న గువ్వల ఇపుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారని వెల్లడించారు.

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గువ్వల మీడియాతో మాట్లాడుతు జాతీయ రాజకీయాలు, రాజకీయాల్లో జాతీయకోణం అంటు చాలానే మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడూ గువ్వల ఇలాగ జాతీయ రాజకీయాలు, రాజకీయాల్లో తెలంగాణ కోణమంటు మాట్లాడిందిలేదు. ఇప్పుడు ఇంత సడెన్ గా గువ్వల ఎందుకు రాజీనామా చేసినట్లు ? ఇపుడిదే అంశంపై బీఆర్ఎస్ లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే తొందరలోనే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు మీద కేసులు నమోదై అరెస్టులు తప్పవనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదేగనుక జరిగితే పార్టీని నడిపించే దిక్కుకూడా ఉండదు. అప్పుడు పార్టీ చుక్కాని లేని నావలాగ అయిపోతుంది. దాంతో పార్టీకి భవిష్యత్తు ఉండదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పడటం ఖాయమని నేతలు అనుమానిస్తున్నారు.

అప్పుడైనా పార్టీని వదిలిబయటకు రాకతప్పదని భావించిన గువ్వల ముందుజాగ్రత్తగానే పార్టీకి రాజీనామా చేసినట్లు నేతల మధ్య టాక్ నడుస్తోంది. తొందరలోనే బీఆర్ఎస్ నుండి మరికొందరు నేతలు కూడా రాజీనామాలు చేయబోతున్నారన్న ప్రచారాన్ని నిరంజన్ రెడ్డి కొట్టిపాడేశారు. గువ్వల తప్ప పార్టీనుండి ఇంకెవరూ బయటకు వెళ్ళటంలేదని రెడ్డి స్పష్టంచేశారు. అయితే గువ్వల బీజేపీలో చేరుతారా లేకపోతే కాంగ్రెస్ లోనా అన్న విషయం స్పష్టమైన తర్వాత అప్పుడు మరిన్ని వలసలు ఉంటాయనే ప్రచారం ఊపందుకుంటోంది.

ప్రవీణ్ కూడా కారణమేనా ?

సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గువ్వల పార్టీని వదలటానికి కారణమేనా ? అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే బీఎస్పీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ లో చేరారు. ప్రవీణ్ కారుపార్టీలో చేరిన దగ్గరనుండి అమితమైన ప్రాధాన్యత దక్కుతోంది. గత ఎన్నికల్లో సిర్పూర్(ఎస్సీ)నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రవీణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రవీణ్ బీఆర్ఎస్ లో చేరిన దగ్గర నుండి గువ్వలకు ప్రాధాన్యత తగ్గుతోందని పార్టీవర్గాల సమాచారం. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవటం కూడా గువ్వల బీఆర్ఎస్ కు రాజీనామాకు కారణమని తెలుస్తోంది. ఏదేమైనా గువ్వల రాజీనామా బీఆర్ఎస్ మీద గట్టి ప్రభావమే చూపుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News