జర్మనీ క్రికెట్ జట్టులో హైదరాబాద్ స్టార్

హైదరాబాద్ అమ్మాయి జర్మనీ దేశంలో సాధించిన విజయాలు...;

Update: 2025-08-07 02:59 GMT
జర్మనీ మహిళా క్రికెట్ జట్టులో బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ అమ్మాయి అమేయ కనుకుంట్ల

హైదరాబాద్‌ నగరానికి చెందిన అమేయ కనుకుంట్ల అనే అమ్మాయి పాఠశాలలో చదువుకుంటూ ఆరేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ చేత పట్టింది. ఈ చిన్నారి ఆరేళ్ల వయసు నుంచే హైదరాబాద్ గల్లీలోనే కాదు క్రికెట్ స్టేడియంలోనూ తన తండ్రి, స్నేహితులతో కలిసి రోజూ క్రికెట్ ఆడుతుండేది. బాల్యంలో పట్టుకున్న క్రికెట్ బ్యాట్ కాస్తా అమేయకు అభిరుచిగా మారింది. ప్రతీరోజూ క్రికెట్ ఆడటం బాల్య దశ నుంచే దినచర్యలో భాగంగా మారింది.


కోవిడ్ సమయంలో క్రికెట్ అకాడమీలో చేరి...
ప్రపంచాన్ని హడలెత్తించిన కోవిడ్ మహమ్మారి సమయంలో అమేయ హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో చేరింది. అలా వచ్చిన కోవిడ్ వల్ల పాఠశాలలు లేక పోవడంతో వీలైనప్పుడల్లా క్రికెట్ లో శిక్షణ పొందింది. అంతే ఆ సమయంలో పొందిన శిక్షణ జర్మనీ మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్ తోపాటు ఆల్ రౌండర్‌గా స్థానం దక్కేలా చేసింది. హైదరాబాద్ గల్లీలో క్రికెట్ ఆడటం నేర్చుకున్న అమేయ పట్టుదల, ఆత్మవిశ్వాసం, కృషి, కఠోర సాధనతో ఏకంగా జర్మనీ మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికై ప్రపంచ క్రికెట్ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి తన ప్రతిభ చూపిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.



  నాన్న ఉద్యోగం కోసం జర్మనీకి వలస

‘‘నా పేరు అమేయ కనుకుంట్ల. మా నాన్న ఉద్యోగం కోసం జర్మనీ దేశానికి వెళ్లాల్సి రావడంతో నేను కూడా జర్మనీ వెళ్లి అక్కడి స్పోర్ట్సు క్లబ్ లో చేరాను. జర్మనీలో క్రికెట్ క్రీడను కొనసాగిస్తూ అండఱ్ 15 జట్టు ఓపెన్ ట్రయల్స్ చూశాను. ఆ జట్టులో ఆడేందుకు ప్రయత్నించి ఎంపికయ్యాను. జర్మనీ జట్టుకు ఎంపికైన క్షణం నా జీవితాన్ని మలుపు తిప్పింది. జర్మనీలోనే నా క్రికెట్ శిక్షణ కొనసాగించాను.చివరికి జర్మనీ మహిళా క్రికెట్ సీనియర్ జాతీయ జట్టులోకి వచ్చాను. హైదరాబాద్ గల్లీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకొని క్రికెట్ సంస్కృతి నిర్మించిన జర్మనీ జట్టుకు నేను ప్రాతినిథ్యం వహించడం నాకు గర్వంగా ఉంది’’ అని అమేయ చెప్పారు.

సవాళ్లను అధిగమించి సక్సెస్
జర్మనీ దేశంలో క్రికెట్ ఆడటం సవాళ్లతో కూడుకున్న పని. జర్మనీలో పరిమితమైన మైదానాలు, అరకొర క్రికెట్ కోచ్ లు, వణికిస్తున్న చలి వల్ల ఇండోర్ స్టేడియంలో తాను శిక్షణ పొందానని జర్మనీ స్టార్ క్రికెటరుగా ఎదిగిన హైదరాబాద్ అమ్మాయి అమేయ చెప్పారు. జర్మనీ దేశంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కువగా వేసవికాలంలో జరగుతాయని, దీంతో తాను కళాశాల చదువు, క్రికెట్ శిక్షణ సమతౌల్యం చేసుకునేందుకు ఉపయోగపడిందంటారు. ఎన్నో సవాళ్లను అధిగమించి క్రికెట్ లో సక్సెస్ సాధించానని ఆమె తెలిపారు. పలు దేశాల జట్లపై ఆడి బౌలింగ్, బ్యాటింగులో ప్రతిభ కనబర్చి జర్మనీలో స్టార్ క్రికెటరుగా ఎదిగారు.


 హైదరాబాద్ గల్లీ క్రికెట్ నుంచి జర్మనీ దాకా...

ప్రస్తుతం జర్మనీ మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్ తోపాటు ఆల్ రౌండర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేయ కనుకుంట్ల ప్రస్థుతం ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ క్రికెట్ జట్లతో ఆడారు. ఇలా ప్రతీ దేశంతో తాను ఆడిన మ్యాచ్ నేర్చుకోవడానికి, క్రికెట్ లో ముందుకు సాగడానికి నాకెంతో ఉపయోగపడిందంటారు అమేయ.హైదరాబాద్ నగరంలో బాల్యంలో తాను క్రికెట్ ఆడుతున్నపుడు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, కానీ కాలక్రమేణా దీనిపై ఆసక్తి పెరిగిందంటారు అమేయ. తనతో కలిసి అమ్మాయిలు క్రికెట్ ఆడటం చూసి తానెంతో గర్వపడుతున్నానన్నారు. గల్లీ క్రికెట్ నుంచి జర్మనీకి వచ్చి అంతర్జాతీయ వేదికకు చేరుకోవడానికి తన తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్ ల మద్ధతు కారణం అంటారామె.



 ఒత్తిడిని అధిగమించాను...

జర్మనీ మహిళా క్రికెట్ జట్టులో మ్యాచ్ కీలక సమయంలో బౌలింగ్ చేయడానికి వచ్చినపుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కానీ, ఆటపై దృష్టి సారించి దాన్ని అధిగమించానంటారు జర్మనీ క్రికెట్ స్టార్ అమేయ. రెండవ బంతి బౌలింగ్ లో పురోగతి సాధించి ఆటను మార్చానంటారు. ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదని, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రికెట్ ఆడితే ఎక్కడైనా అవకాశాలు లభిస్తాయంటారు అమేయ.


Tags:    

Similar News