కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్నభోజన కార్మికులు

అక్షయపాత్రకు ఇవ్వొదంటూ సిఐటీయు ఆందోళన;

Update: 2025-08-11 12:05 GMT

మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కారు. మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించడంతో ఆమె నివాసమున్న హనుమకొండ రాంనగరలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal scheme) అక్షయపాత్రకు ఇవ్వొద్దని సోమవారం సిపిఎం అనుబంధ సంస్థ సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. నెల నెలా వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించడం చాలా బాధాకరం అని సిఐటీయు కార్యకర్తలు అన్నారు.

ఎన్నికలలో ఓట్లకోసం మధ్యాహ్న భోజన కార్మికులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వాళ్లు ఆరోపించారు. మహిళ మంత్రి సాటి మహిళల సమస్యలను అర్థం చేసుకొంటుందనే కారణంతో మంత్రికి విన్నవించుకుందామని ఇంటికి వెళ్తే.. పోలీసులను చేత అరెస్టు చేయించడం శోచనీయమన్నారు. నెల నెలా జీతాలు రానప్పటికి విద్యార్థుల కోసం అప్పులు తెచ్చి వండిపెట్టామని, ఇప్పుడు మాకు జీవనాధారమే లేకుండా పోయిందని మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడ్డారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్, సీఐటీయూ జిందాబాద్‌’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మధ్యాహ్న భోజన పథకం

మధ్యాహ్న భోజన పథకం అనేది మనదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించే ఒక పథకం. దీనిని మొదట తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలులోకి తెచ్చాయి. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏమంటే పిల్లలను ప్రతీరోజు పాఠశాలకు రప్పించడం, విద్యార్థులకు పోషకాహార లోపాలను నివారించడం.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుండి 8 తరగతుల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలులో ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో బిల్లులు సమయానికి రాకపోవడం వల్ల భోజనం నాణ్యత తగ్గినట్టు కొన్ని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఇటీవలె నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాలకు పైగా మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకి భోజనం వండి పెడుతున్నప్పటికీ కార్మికులను కాదని అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని నిర్ణయించడం కార్మికులను రోడ్డుమీద పడేయడమే అని కార్మిక సంఘాలు అంటున్నాయి.

Tags:    

Similar News