తెలంగాణ నూతన క్రీడా విధానం వస్తాంది...
తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కొత్త పాలసీని ప్రకటించడానికి క్రీడా దిగ్గజాలతో కలిసి స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ నిర్వహించనున్నారు.;
By : Saleem Shaik
Update: 2025-08-02 00:37 GMT
తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయా? అంటే అవునంటోంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి సమగ్రమైన క్రీడా విధానం తీసుకురావాలన్న సంకల్పంతో స్పోర్ట్స్ కాంక్లేవ్ కు శనివారం శ్రీకారం చుట్టారు. 2025 తెలంగాణ క్రీడా విధాన ప్రణాళికను తెలంగాణ స్పోర్ట్సు అథారిటీ రూపొందించింది.
క్రీడల అభివృద్ధికి ప్రణాళిక
తెలంగాణ నూతన క్రీడా విధానంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పూర్వ జిల్లాలో ఒక క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినీస్టేడియాలు నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. సామాజిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ సంస్థల ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు నెలకొల్పనున్నారు. యువతకు క్రీడల పట్ల ఆసక్తి కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్
మొదటి తెలంగాణ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్‌లో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. క్రీడా విధానంలో భాగంగా వివిధ క్రీడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. దీంతోపాటు యువతకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి వారి కెరీర్ వృద్ధికి తోడ్పాటు అందించనున్నారు. అథ్లెటిక్స్ కు ప్రోత్సాహకాలు కల్పించనున్నారు.పటిష్టమైన క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి, కెరియర్, ఉపాధి మార్గాల రూపకల్పన, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన,సమగ్ర క్రీడా వాతావరణ కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలంగాణ స్పోర్ట్సు అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని శివసేనారెడ్డి పేర్కొన్నారు.
క్రీడల అభివృద్ధికి ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ఎఫ్ఐఎఫ్ఏ (FIFA)ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. షూటింగ్, బ్యాడ్మింటన్, స్పోర్ట్స్ సైన్స్‌లో మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు అమలు చేయనున్నారు. కొరియా జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ నుంచి ఒలింపియన్లు,ప్రపంచ ఛాంపియన్‌ల సృష్టిని లక్ష్యంగా చేసుకొని స్పోర్ట్సు పాలసీని రూపొందించారు.
క్రీడా దిగ్గజాలతో సదస్సు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ ఐ సి సి, నోవాటేల్ లో స్పోర్ట్స్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. తెలంగాణ క్రీడా విధానం 2025ను యావత్ క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేయనున్నారు. క్రీడా విధానం అమలులో అందరి భాగస్వామ్యం పెంచేందుకు స్పోర్ట్స్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ప్రముఖ క్రీడాకారులు గగన్ నారంగ్, పుల్లెల గోపిచంద్,అభినవ్ బింద్రా వంటి క్రీడా దిగ్గజాలతో రాష్ట్రంలో క్రీడా భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లనున్నారు. ప్రఖ్యాత క్రీడా విశ్లేషకులు చారు శర్మ, భారత క్రికెట్ మాజీ ఒలంపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్,అంజూ జార్జ్ వివిధ క్రీడా ఫెడరేషన్ల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు,ప్రముఖ క్రీడా జర్నలిస్టులు విశ్వనాథన్ సభ నాయక్ తోపాటు మరి కొంతమంది సీనియర్ క్రీడా జర్నలిస్టులు స్పోర్ట్స్ కాంక్లేవ్ భాగస్వాములు అవుతున్నారు.తెలంగాణ నూతన క్రీడా విధానం 2025 ప్రకటించడంతోపాటు క్రీడా విధానం మెరుగ్గా అమలు పర్చి, దీనిని జాతీయస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టడానికి ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఏర్పాటు చేశామని శివసేన రెడ్డి చెప్పారు.