11,298 ఎకరాల పంట నష్టం.. ప్రభుత్వానికి అందిన నివేదిక
6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు కూడా నష్టం జరిగిందని తుమ్మల చెప్పారు.;
తెలంగాణలో గత మూడు రోజులుగా అకాల వర్షాలు కురిసి ప్రజలను సందిగ్దంలో పడేశాయి. రైతులను కష్టాల్లోకి నెట్టేశాయి. మార్చి 21 నుంచి మార్చి 23 వరకు కురిసిన వడగళ్ల వానలతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కాగా ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈఅంశంపై నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని లెక్కకట్టే పనిలో పడ్డారు. కాగా ఈ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించారు. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక అందుకున్న మంత్రి తుమ్మల.. వీలైనంత త్వరగా తుది నివేదిక అందించాలని ఆధికారులను ఆదేశించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ వడగళ్ల వర్షాల వల్ల 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. వీటిలో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు నష్టపోయాయని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు కూడా నష్టం జరిగిందని తుమ్మల చెప్పారు. కాగా పూర్తి నివేదిక అందిన తర్వాత పంట నష్టాలకు పరిహారం చెల్లింపు చర్యలు చేపడతామని మంత్రి తుమ్మల వెల్లడించారు.