అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల టోకరా

నలుగురుసభ్యుల ముఠాను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు

Update: 2025-10-01 15:27 GMT

అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ.5.92 లక్షలు, 684.5 గ్రాముల బంగారు నాణేలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు సీజ్ చేశారు.వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌ సింగ్‌.. విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లండించారు. ‘‘ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా పేరుతో 2023లో ఒక సంస్థను ప్రారంభించాడు’’ అని తెలిపారు. 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కమిషనర్ తెలిపారు.

అతను అధిక లాభాల ఆశ చూపిస్తూ చిట్టీల వ్యాపారాన్ని విస్తరించాడని సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో చేరే వారు రూ.6వేలు చెల్లించాలని ఓ కండిషన్ పెట్టాడని వరంగల్ పోలీసులు తెలిపారు. సభ్యులు చెల్లించిన డబ్బులో రూ.4 వేలు తన వద్దనే డిపాజిట్‌ చేసుకుంటాడని, మిగతా రూ.2 వేలతో ఆ మేరకు విలువ చేసే వస్తువులను సభ్యులకు అందజేసేవాడని అన్నారు. ఈ సంస్థపై సభ్యులకు నమ్మకం కలిగించేందుకు వస్తువులను అందజేసేవాడని పోలీసువర్గాలు తెలిపాయి. హోల్ సేల్ లో ఈ వస్తువులను తేవడంతో వీటి విలువ రూ.500కు మించి ఉండదు అని పోలీసులు తెలిపారు. ఈ సంస్థలో సభ్యత్వం తీసుకుంటే ప్రతీనెల రూ.1000 చొప్పున 20 నెలల పాటు డబ్బును తిరిగి ఇస్తానని బుకాయించేవాడు అని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News