తెలంగాణ పల్లెల్లో 3 కోట్ల కోతుల సంచారం,ఈ బెడద నివారించేదెన్నడు?
తెలంగాణలోని పలు పల్లెల్లో కోతుల బెడద తీవ్రమైంది. పల్లెల్లో కోతుల సంచారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది.రైతు రాసిన లేఖను హైకోర్టు విచారణకు స్వీకరించింది.;
By : Saleem Shaik
Update: 2025-03-04 12:04 GMT
తెలంగాణ రాష్ట్రంలోని (Telangana Villages) అడవుల జిల్లాల్లో కోతుల బెడద విపరీతంగా పెరిగింది.(Excess Population of Monkeys) పోడు సాగు వల్ల అడవుల విస్తీర్ణం తగ్గడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు పంట పొలాలు, గ్రామాల్లోకి వచ్చేశాయి. అడవుల జిల్లాల్లో ఏ గ్రామంలో చూసినా వానర మూకలు(Monkeys Roaming) కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఇంటి గోడలు, ఇళ్లలో, చెట్లపై అటు ఇటూ దూకుతూ కోతి చేష్టలతో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయి. కోతులను తరిమేందుకు యత్నించిన వారిపై దాడులు చేస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో వానర మూకల సంచారంపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
కోతుల బెడదపై హైకోర్టుకు రైతు లేఖ
కోతుల బెడద వల్ల తాము ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు తీరని నష్టం జరుగుతుందని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ఎం మల్లన్న తెలంగాణ హైకోర్టుకు లేఖ రాశారు. రైతు రాసిన లేఖను హైకోర్టు (Telangana HighCourt) సుమోటోగా విచారణకు స్వీకరించింది. కోతుల బెడదపై కేసును తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తి జస్టిస్ రేణుక యారాలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఈ కేసులో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.కోతుల బెడదపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ కోతుల బెడదపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పిల్ తో పాటు ఈ లేఖను జతచేయాలని, దీనిపై తాము విచారిస్తామని హైకోర్టు జడ్డీలు చెప్పారు.
తెలంగాణ పల్లెల్లో 3 కోట్ల వానరాల స్వైరవిహారం
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో మూడు కోట్ల వానరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. కోతులు పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు పంటలు వేయాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ఎం మల్లన్న హైకోర్టుకు రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కోతుల బెడదల ఎక్కువగా ఉందని అటవీశాఖ అధికారుల సర్వేలోనే తేలింది.
వానరాల స్వైర విహారం
గ్రామాల్లో వానర మూకలు యథేచ్ఛగా స్వైరవిహారం చేస్తూ పిల్లలు, మహిళలపై దాడులు చేస్తున్నాయిన ఆయన పేర్కొన్నారు. కోతులు గుంపులు, గుంపులుగా పొలాల్లోకి వచ్చి వేరుశనగ, మొక్కజొన్న, కంది, మినుములు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయల పంటలను నాశనం చేస్తున్నాయని మల్లన్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రభుత్వం కోతుల బెడదను నివారించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.
గతంలోనూ హైకోర్టు ఆదేశాలు
2023వ సంవత్సరంలోనూ గ్రామాల్లో కోతుల బెడదను నివారించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో వానరాల బెడదపై ఎం శ్రీనివాసరావు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ కోతుల బెడదను నివారించాని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
తెలంగాణ పల్లెల్లో కోతుల బెడదను నివారించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర చర్యలు తీసుకోలేదు. కోతుల సంచారాన్ని తగ్గించేందుకు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పినా, ఎక్కడా పల్లె ప్రకృతి వనాల జాడ మాత్రం లేదు. అంటే హైకోర్టు ఆదేశాలనే రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది.
కోతుల రక్షణ,పునరావాస కేంద్రం
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు నిర్మల్ జిల్లాలోని చించోలి గ్రామంలోని అర్బన్ పార్కులో అటవీశాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కోతుల రక్షణ,పునరావాస కేంద్రాన్ని 2020 డిసెంబరు 20వతేదీన అప్పటి అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
కోతులను పట్టుకు వచ్చి...
కోతులను వివిధ గ్రామాల నుంచి పంచాయతీల అధికారులు బోనుల్లో బంధించి నిర్మల్ జిల్లా చించోలిలోని మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటరుకు (Monkey Rescue & Rehabilitation Centre)తరలిస్తారు. వాటిని ప్రీ-ఆపరేటివ్ కేర్ యూనిట్ బోనుల్లో ఉంచి, పశువైద్యాధికారులు తయారుచేసిన డైట్ చార్ట్ ప్రకారం ఆహారం ఇస్తారు. తరువాత మరుసటి రోజు ఆపరేషన్ థియేటర్‌కు తరలించి స్టెరిలైజేషన్ చేస్తామని కోతుల పునరావాస కేంద్రం పశువైద్యులు డాక్టర్ శ్రీకర్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
కోతుల సంతతి వృద్ధి చెందకుండా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కోతులకు గుర్తుగా నుదిటిపై గుర్తింపు గుర్తు (టాటూ) వేసి వాటిని పోస్ట్-ఆపరేటివ్ కేర్ యూనిట్‌కు తరలించి మూడు రోజులు పరిశీలనలో ఉంచుతారు. కోతులకు పండ్లు, బ్రెడ్, వేరుశనగలు, పప్పుధాన్యాలు వంటి పోషకమైన ఆహారం అందిస్తామని డాక్టర్ శ్రీకర్ రాజు తెలిపారు. స్టెరిలైజేషన్ తర్వాత వాటిని రిజర్వ్ ఫారెస్ట్స్‌లో వదిలివేస్తామని ఆయన వివరించారు
కోతుల బెడద నివారణకు నిధులేవి?
కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ద్వారా కోతుల బెడదను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆచరణలో ఆశించిన మేర నిధులు విడుదల చేయడం లేదు. నిర్మల్ కోతుల పునరావాస కేంద్రానికి 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు రూ.244లక్షల రూపాయలను కేటాయించినా, ప్రభుత్వం ఆశించిన మేర నిధులు విడుదల చేయలేదు. కోతుల బెడద నివారణకు ప్రభుత్వం ఆరేళ్లలో కేవలం రూ.80.22 లక్షలే వెచ్చించింది.
నిర్మల్ లోని కోతుల పునరావాస కేంద్రానికి నాలుగు వ్యాన్లు, కోతుల ఆపరేషన్లకు కావాల్సిన మందులు, ఆపరేషన్ థియేటర్ కోసం పరికరాల కోసం రూ.22 లక్షలు కావాలని ప్రతిపాదించినా అటవీశాఖ నిధులు విడుదల చేయలేదు. దీంతో కోతుల నివారణ సజావుగా సాగటం లేదు. దీంతో తెలంగాణ పల్లెల్లో వానరాల సంచారం పెచ్చు పెరిగిపోయింది.