మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్
చత్తీస్ గడ్ లో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు
మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ మహరాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఎన్ కౌంటర్ జరిగిన 48 గంటల తర్వాత బుధవారం 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు . ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 50మంది పురుషులు, 21మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 30 మందిపై రూ.64లక్షల రివార్డు కూడా ఉంది. కేంద్రం ప్రకటించిన ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం జల్లెడ పట్టడంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయిందని ఐజీ తెలిపారు.
వీరంతా గతంలో అనేక హింసాత్మక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. హింసాయుత విధానాలు స్వస్థి పలికే విధంగా చేయడమే తమ ఉద్దేశమని ఎస్పి చెప్పారు. ఇటీవలి కాలంలో ఇంత భారీ స్థాయిలో లొంగిపోయిన దాఖలాలు లేవు. ఒకేసారి 71 మంది లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని తెలుస్తోంది.