నివాళి: సమ్మక్క 'సక్కని' కథకుడు రామచంద్రయ్య

కోయ జాతి కథనాలు కోయభాషలో, తెలుగులో పాడే ఏకైక వ్యక్తి ఆయన. చక్కని వాచకం. కోయ డోలు వాయిస్తూ కథను చెప్పడంలో మంచి నేర్పరి.

Update: 2024-06-23 15:03 GMT


ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జాతర మేడారం జాతర అనీ, ఆ జాతరలో ప్రధాన దేవర సమ్మక్క తల్లి అనీ మనకు తెలుసు. కాని, ఆ తల్లి చరిత్ర, విశిష్టత మనలో కొద్ది మందికే తెలుసు. ఈ నేపథ్యంలో సమ్మక్క చరిత్రను సాధికారికంగా సాంప్రదాయబద్దంగా పాడి వినిపించే గిరిజన డోలి కోయ కళాకారుడు సకినె రామచంద్రయ్య. ఈయన ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం ఈయనను 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అనతి కాలంలోనే మన దురదృష్టం కొద్ది రామచంద్రయ్య నిన్న(23.6.2024 రోజున) అనారోగ్యంతో పరమపదించారు.

సకినె రామచంద్రయ్య గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో ఉన్న కూనవరం గ్రామస్తులు. ఈయన డోలి అనే వాయిద్యాన్ని వాయిస్తూ కోయ గిరిజనుల వేల్పుల కొలుపులు, శుభ అశుభ కార్యక్రమాలలో వారి చరిత్రల గానం చేసే అర్తి కులం 'డోలి కోయ' అనే ఉప కులానికి చెందినవారు. ఈ కళాకారుల కులస్తులు చాలా అరుదుగా ఉండగా ఉన్నవారిలో చాలా మంది తమ వృత్తి కళను మర్చిపోయారు. అలాంటివారిలో పలు కోయ దేవతల అరుదైన చరిత్రలను అద్భుతంగా గాన ప్రదర్శన చేయగల ప్రతిభామూర్తి రామచంద్రయ్య గారు. చదువు లేకపోయినా సాంప్రదాయకంగావస్తున్న చారిత్రక, దైవిక గాధలను ఔపోసన పట్టి అలవోకగా ప్రదర్శించే అరుదైన కళా మూర్తి. డోలి కోయలు తమ డోలి వాయిద్యాలను వాయిస్తేనే కోయ దేవర్లు తరలి వస్తాయి. ఆయా కోయ దేవతల చరిత్రలు త్రిభుజాకారంలో ఉండే ఎర్ర వస్త్రం (డాలు గుడ్డ )పై వివిధ ఆకారాలలో ఉండే బొమ్మల రూపంలో ఉంటాయి. తెలంగాణ కోయలలో సుమారు ఐదు గోత్రాలు (గట్టులు) ఉంటే, ఒక్కో గోత్రానికి సంబంధించి కొందరు దేవతలు (ఇలవేల్పులు) ఉంటారు. ఒక్కో ఇంటి పేరు గల కోయలకు ఒక్కో దేవర ఉంటారు. ఆయా ఇంటి పేర్లు గలవారు అంతా కలిసి రెండు, మూడు సంవత్సరాలకొకసారి జాతర జరుపుకుంటారు. వారి సంబంధిత డాలుగుడ్డ పైన ఉన్న బొమ్మలను చూపుతూ డోలి కోయలు తత్సంబంధిత చరిత్రను, ఫలానా కోయ వంశ చరిత్ర మూలాలను గానం చేస్తూ వివరిస్తారు.



తెలంగాణలో సుమారు నూటయాభై కోయ ఇంటి పేర్లు ఉండగా వారందరికి నూటయాభై దేవర్ల పడిగెలు (డాలు గుడ్డలు) ఉన్నాయి. అన్ని దేవర్లలో ప్రధానమైనవారు సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, బాపనమ్మ, ముసలమ్మ, సడలమ్మ మొదలైన స్త్రీ దేవతలు కాగా, పగిడిద్దరాజు, గడికామరాజు, ఎడమరాజు, గాదిరాజు, గోవిందరాజు మొదలైన పురుష దేవుళ్ళు ఉన్నారు. వీరిలో ఎడ(మ) రాజును కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు క్రీ.శ. 12 వ శతాబ్దంలో ఓడించినట్లు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి ఆవరణలో ఉన్న శిలా శాసనం ప్రస్తావించింది.పై దేవతల కథల్లో చాలావాటిని సాధికారికంగా ఒక్క సకినె రామచంద్రయ్య గారే గానం చేయగలరు. అలాంటి అరుదైన కళాకారుడిని గుర్తించి భద్రాచలంలో ఉన్న సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐ.టి.డి.ఎ.) ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి దివ్య గారి ప్రోత్సాహంతో ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు ఒక పరిశోధన బృందంతో వెళ్ళి మణుగూరు పక్కన ఉన్న తోగ్గూడెంలో సమ్మక్క సారలమ్మ చరిత్ర గల పడిగెను సాంప్రదాయబద్దంగా బయటకు తీయించి 2014 నవంబర్ 2 నాడు సకినె రామచంద్రయ్య గారితో ఆ ప్రసిద్ధ గాథను పాడించి, డాక్యుమెంటేషన్ చేసి, 2018 జనవరిలో పుస్తక రూపంలో ప్రచురించారు. సమ్మక్క సారలమ్మ చరిత్రను కోయల సాంప్రదాయ పద్ధతిలో తెలుసుకోవడానికి అరుదైన ఆధారం ఆ పుస్తకమే. ఆ పుస్తక సంపాదకుడు రామచంద్రయ్య గారి ప్రావీణ్యత గురించి ఇలా రాశారు.

"మొత్తం కోయ జాతి కథనాలు తెలుగులో పాడే ఏకైక వ్యక్తి. ఆయన కోయ భాషలో కూడా పాడగలడు. ఛత్తీస్ ఘడ్ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ భాషలో కూడా పాడగలడు. చక్కని వాచకం. కోయ డోలు వాయిస్తూ కథను చెప్పడంలో మంచి నేర్పరి. ముఖ్యంగా కోయలకి ఉండే అదో రకపు మనస్తత్వం నుండి బయటపడి స్పష్టంగా, నేరుగా మాట్లాడుతాడు. అది చాలా చాలా ముఖ్యమైన అంశం. నిజంగానే సమ్మక్క సారాలమ్మ కోయ కథలను లోకానికి తెలియజేయడానికి రామచంద్రయ్యని మన్నెం విషజ్వరాల నుండి కాపాడిందేమో అని అక్కడి మిత్రుడు సున్నం నారాయణ అన్నాడు".

కాని అదే విష జ్వరం, టి.బి., లంగ్ క్యాన్సర్ లతో దశాబ్ద కాలంగా బాధపడి సమ్మక్క సారలమ్మల సాంప్రదాయ సాధికారిక చరిత్రలను మాత్రం మనకి అందజేసి తను మాత్రం మనకు అందని లోకాలకు ప్రయాణమయ్యాడు. ఆయన లేని లోటు కోయ ప్రపంచానికే కాక కోట్లాది మంది సమ్మక్క భక్తులకు కూడా తీరనిది. అయితే కోట్ల మంది భక్తులకు కొంగు బంగారమై వెలుగొందుతున్న సమ్మక్క జాతర ఉన్నంతవరకు సకినె రామచంద్రయ్య కళ అజరామరమై ఉంటుంది.


Tags:    

Similar News