నవ్వుల రారాజు రాజేంద్రప్రసాద్ కుటుంబానికి సినీలోకం ఓదార్పు!

ప్రముఖ హాస్య నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణించారు. దీంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. సినీలోకం యావత్తు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోంది.

Update: 2024-10-05 11:08 GMT
RAJENDRA PRASAD WITH HIS DAUGHTER

నట కిరీటి, నవ్వుల రారాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడాయన్ని ఓదార్చడం ఎవరి తరం. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి అకాల మరణం ఆయన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కూతురిలో అమ్మను చూసుకునే రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు గాయత్రి మరణంతో తల్లడిల్లుతున్నారు. సినీ లోకం యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రాజంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తోంది. ఆయన ఈ కడుపుకోత నుంచి ఎలా బయటపడతారో అనేది అర్థం కాకుండా ఉంది.


నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రిలో ఈవేళ తెల్లవారుజామున మరణించారు. ఆమె వయసు 38 ఏళ్లు. ఆమెకు తీవ్రంగా గుండెనొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కి ఒక కుమారుడు, కుమార్తె. వారిలో ఇప్పుడు కుమార్తె గాయత్రి కన్నుమూశారు.

రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబం గురించి ఎన్నడూ వేదికలపై చెప్పుకోని వ్యక్తి ఆయన. ఆమధ్య ఓ షోలో రాజేంద్ర ప్రసాద్ తన తల్లి గురించి చెబుతూ కన్నీరు మున్నీరయ్యారు. తల్లి లేని లోటును కుమార్తె తీర్చుతోందని చెప్పిన రాజేంద్ర ప్రసాద్ కి ఇప్పుడా తల్లి కూడా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కుమార్తె కూడా ఇటీవల బాలనటిగా సినీమాలో ప్రవేశించారు.

రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి పలువురు సానుభూతి తెలిపారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సంతాపసందేశంలో పేర్కొన్నారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మరణించిన వార్త తెలుసుకున్న సినీలోకం హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఆయన నివాసానికి తరలివచ్చి ఓదార్చింది. ప్రముఖ నటులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మొదలు జగదీశ్ బాబు వరకు అనేక మంది రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు అంటే అక్టోబర్ 6 ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి. మరికొద్ది రోజుల్లో 39వ పుట్టిన రోజు జరుపుకోనున్న తరుణంలో ఆమె కన్నుమూయడం విషాదం.


Tags:    

Similar News