నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ, ఫుడ్ సేఫ్టీ పరీక్షల్లో తేలిన నిజం

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే వార్తలతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యిని విక్రయించారని తేలింది.

Update: 2024-09-27 12:49 GMT

హైదరాబాద్ నగరంలోని మార్కెట్ లో లభ్యమవుతున్న నెయ్యిలో స్వచ్ఛత ఎంతనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షిస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. మార్కెట్ లోని నెయ్యి బ్రాండ్లలో ప్రతీ అయిదు శాంపిళ్లలో ఒక శాంపిల్ కల్తీ చేసిందని వెల్లడైంది. కల్తీ చేసిన నెయ్యిని వాడటం సురక్షితం కాదని ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో తేలింది.

- ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు నగరంలోని డెయిరీ ఫాంలు, సూపర్ మార్కెట్లు, స్టోర్లలో నుంచి 70 నెయ్యి శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించి పరీక్షకు పంపించగా, అందులో 16 శాంపిళ్లు కల్తీవని నిర్ణారణ అయింది.
- నెయ్యిని రీ ప్రాక్టోమీటర్ రీడింగ్, కెమికల్, ఫ్యాట్ కంటెంట్ విశ్లేషణలో 16 నెయ్యి శాంపిళ్లు కల్తీవని తేలాయి. నెయ్యి స్వచ్ఛత, ఫ్యాట్ శాతాన్ని పరీక్షించగా ఇందులో వనస్పతి, హైడ్రోజనటెడ్ ఫ్యాట్, వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు కలిసిందని ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో తేలడం సంచలనం రేపింది.

ఘీ శాంపిళ్లలో కల్తీ
నెయ్యి శాంపిళ్లను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించి పరీక్షించగా దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. నెయ్యిలో పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్, హానికారిక పదార్థాలను కలిపి కల్తీ చేశారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

40 ఆహార పదార్థాల శాంపిళ్ల కల్తీ
హైదరాబాద్ నగరంలోని దుకాణాల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు 1000 శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించగా,ఇందులో 40 శాంపిళ్లు కల్తీవని తేలాయని హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారి లక్ష్మీకాంత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కల్తీ ఆహారపదార్థాలు విక్రయించిన వారికి నోటీసులు జారీ చేశామని లక్ష్మీకాంత్ తెలిపారు.

నెయ్యి స్వచ్ఛతను బట్టి ధర మార్పు
మార్కెట్ లో లభించే నెయ్యి స్వచ్ఛతను బట్టి కిలో ధర 300 రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంది. నెయ్యిలో 20శాతం కల్తీదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. తక్కువ ధర ఉన్న, లూజుగా విక్రయిస్తున్న నెయ్యి కల్తీదని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు.

కల్తీ నెయ్యితో అనారోగ్య సమస్యలు
నెయ్యిలో తక్కువ ధర ఉన్న ఆయిల్స్, కొవ్వును కలుపుతున్నారని హైదరాబాద్ నగరానికి చెందిన ఆశ్రిత ఆసుపత్రి డాక్టర్ ఎం రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కల్తీ నెయ్యి తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ పేర్కొన్నారు. ఫ్యాటీ యాసిడ్స్ ను నెయ్యిలో కలపడం వల్ల ఒబేసిటీ, హైకొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని డాక్టర్ రామమోహన్ రావు వివరించారు.

కల్తీ నెయ్యితో జీర్ణ సమస్యలు
కల్తీ నెయ్యి తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, పొట్టలో అసౌకర్యంతో పాటు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముందని డాక్టర్ రామమోహన్ రావు చెప్పారు.కల్తీ నెయ్యి తినడం వల్ల హృద్రోగ సమస్యలు, కేన్సర్లు, నరాల సంబంధ మైన సమస్యలు వస్తాయని డాక్టర్ చెప్పారు.

15వేల కిలోల కల్తీ నెయ్యి సీజ్
హైదరాబాద్ నగరంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 15వేల కిలోల కల్తీ నెయ్యిని గురువారం సీజ్ చేశారు. 7,280 కిలోల వెన్న, 105 కిలోల నెయ్యి, 525 కిలోల పాలపౌడరు,89 కిలోల మైదాపిండిని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు.


Tags:    

Similar News