HYDRAA | కోర్టు తీర్పు కొండంత బలం: హైదరాబాద్ ఇక నుంచి 'హైడ్రాబాద్'
హైదరాబాద్‌లో 2025 వసంవత్సరంలో హైడ్రా దూకుడు ప్రదర్శించనుంది.వారం వారం ప్రజావాణి కార్యక్రమాలు, ప్రత్యేక పోలీసుస్టేషన్ ఏర్పాటుతో హైడ్రా హైఓల్టేజ్ చూపించనుంది.;
By : Saleem Shaik
Update: 2025-01-08 08:02 GMT
హైదరాబాద్ నగరంలో( Hyderabad) చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, గూగుల్, శాటిలైట్ చిత్రాలను సేకరించి వాటిపై చర్యలకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)(HYDRAA)సమాయత్తం అయింది. చెరువుల పరిరక్షణ పరమావధిగా ఏర్పడిన హైడ్రా ఈ కొత్త సంవత్సరంలో మరింత దూకుడు (high voltage) చూపించనుంది.
- హైడ్రా ప్రత్యేక పోలీసుస్టేషన్ ఏర్పాటుతోపాటు వారం వారం ప్రజావాణి కార్యక్రమానికి హైడ్రా తాజాగా శ్రీకారం చుట్టింది. మరో వైపు కోర్టుల్లో పలు ఆక్రమణలపై హైడ్రా కేసులు సైతం వేసి న్యాయపోరాటం చేస్తుంది. సికింద్రాబాద్ లోని బుద్ధభవన్ బీ బ్లాక్ కేంద్రంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు,పార్కులు,లేఅవుట్ ఖాళీ స్థలాలు, ఆట స్థలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఈ పోలీసుస్టేషన్ పనిచేయనుంది.
బతుకమ్మ కుంట కేసులో హైడ్రా విజయం
బతుకమ్మ కుంట భూమిపై బీఆర్‌ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి వేసిన కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టి వేసింది.అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట(Bathukamma Kunta) విస్తీర్ణం బఫర్ జోన్‌తో కలిపి 1962వ సంవత్సరంలో 16.13 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 5.15 ఎకరాలకు తగ్గింది.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కుంట భూమిపై సాక్ష్యాలను అందించడంతో హైకోర్టు హైడ్రాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.బతుకమ్మ కుంట ఎక్కువగా ఆక్రమణకు గురైందని మాజీ ఎంపీ వీ హనుమంతరావు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో నవంబర్ 13వతేదీన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా ప్రణాళికను వెల్లడించారు.హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయగా, ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేవని పేర్కొంటూ సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.
బతుకమ్మకుంట సుందరీకరణకు చర్యలు
హైడ్రా కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నీటి వనరులను పునరుద్ధరించి దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సుందరీకరించబోతోంది.సరస్సు పునరుద్ధరణ పనులు, చుట్టుపక్కల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కమిషనర్ సన్మానం
హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్‌రెడ్డి, సీహెచ్. జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారుడు శ్రీనివాస్, హైడ్రా లీగల్ విభాగం లైజినింగ్ అధికారి డి. మోహన్, హైడ్రా డిప్యూటీ కలెక్టర్ ఎల్. సుధ, తహసీల్దార్ ఎం.హేమ మాలిని, తహసీల్దార్ పి. విజయ్ కుమార్, అంబర్‌పేట తహసీల్దార్ బి. వీరాబాయి, సర్వేయర్ కిరణ్‌లతో పాటు పలువురు అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించి శాలువలతో సన్మానించారు.
బతుకమ్మకుంటపై హైడ్రాకు అనుకూలంగా తీర్పు, ఎడ్ల సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు, త్వరలో చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు.
— HYDRAA (@Comm_HYDRAA) January 8, 2025
-హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్‌రెడ్డి, సీహెచ్. జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారుడు శ్రీనివాస్, హైడ్రా లీగల్… pic.twitter.com/MDqTZpQByu
హైడ్రా ప్రజావాణిలో వెల్లువెత్తిన ఫిర్యాదులు
- మియాపూర్ ప్రాంతంలోని బక్షికుంట, రేగుల కుంటలను సుందరీకరిస్తే ఆ చెరువుల్లోకి మురుగునీటిని వదులుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ప్రజావాణి (HYDRAA PRAJAVANI) కార్యక్రమంలో భాగంగా చందానగర్‌కు చెందిన ప్రజా సంఘాల నాయకులు కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు.
- తనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటిస్థలంతో పాటు పార్కు స్థలాన్ని కూడా స్థానిక మహిళ ఆక్రమించిందని, దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ సైనికుడు పి సీతారామరాజు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. తాను 1971 వ సంవత్సరంలో ఇండో పాక్ యుద్దంలో పాల్గొన్నానని, తన భూమి కబ్జా అయిందని హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా విశ్రాంత సైనికుడు పి.సీతారామరాజు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
- జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిని నోటరీ చేసి విక్రయిస్తున్నారని, ఆరువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇందులో కబ్జాల పాలవ్వగా కేవలం 2,500 ఎకరాల భూమి మాత్రమే మిగిలిందని ముఖేష్ కుమార్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తాజాగా 15 ఎకరాల భూమిలో అక్రమంగా లేఅవుట్ వేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ముఖేష్ కుమార్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
- తూముకుంట మున్సిపాలిటీ లో దేవరయాంజాల్,మందాయపల్లి. పోతాయిపల్లి గ్రామాల చెరువు కాల్వలు, మందాయపల్లి కి చెందిన గుండ్లకుంట లేక్ ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ కబ్జా చేసి లేఅవుట్ రోడ్లు,ప్లాట్లు చేశారని వి హరికృష్ణ గౌడ్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లబ్ హౌస్ నిర్మించిన రియల్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని హరికృష్ణ గౌడ్ కోరారు.
- నందగిరిహిల్స్ కాలనీకి చెందిన పార్కు స్థలం అంటూ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేస్తుండటంతో బస్తీవాసులు ఆందోళన చేశారు. జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌ను ఆనుకుని ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులకు, నందగరి హిల్స్ సొసైటీకి మధ్యన ఉన్న ఖాళీ స్థలం విషయంలో వివాదం సాగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానికంగా పర్యటించి నందగిరిహిల్స్ సొసైటీ వాసులకు మద్దతుగా పార్కు స్థలం అంటూ ఫెన్సింగ్ నిర్మించేందుకు కూల్చివేతలు చేపట్టారు.