లేఖ సరే, కవిత భవిష్యత్తు ఇదేనా ?

ఏ అధినేత అయినా తనను నేతలు నిలదీయటాన్ని, ప్రశ్నించటాన్ని ఏమాత్రం ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే;

Update: 2025-05-23 10:01 GMT
Kalvakuntla Kavitha

తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ పార్టీలో సంచలనంగా మారితే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. లేఖ రాయటం, అది లీకయితే పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని చాలామంది అంచనాలు వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్(KCR) ను ఎదురుప్రశ్నించేత దమ్మున్న నేతలు పార్టీలో ఎవరూ లేరు. కేసీఆర్ వైఖరితో సరిపడక పార్టీలో నుండి బయటకు వచ్చేసిన నేతలు ఆరోపణలు, విమర్శలు చేయటం వేరేసంగతి. పార్టీలోనే ఉంటు కేసీఆర్ వైఖరిని నిలదీసిన, ప్రశ్నించిన నేతలు మాత్రం ఎవరూ లేరనే చెప్పాలి. అలాంటి పనిచేసిన మొదటి నేత కవిత(Kavitha) మాత్రమే. అందుకనే పార్టీలో కవిత భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న నేతల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రాంతీయపార్టీలు అధినేతల సొంత ఆస్తుల్లాంటివే అనటంలో ఎలాంటి సందేహాలు అవసరంలేదు. దేశంలోని ఏ ప్రాంతీయపార్టీని తీసుకున్నా, అంశం ఏదన్నా కానీండి అధినేత నిర్ణయమే ఫైనల్. అధినేత తర్వాత వారసులదే తదుపరి పగ్గాలు అనటంలో ఎన్నోఉదాహరణలున్నాయి. ఇపుడు విషయంఏమిటంటే బీఆర్ఎస్(BRS) ఆధిపత్యం విషయంలో అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో కవితకు పంచాయితీ మొదలైందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై బీజేపీ నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి(Alleti Maheswar Reddy), మెదక్ బీజేపీ ఎంపీ రఘునందనరావు(MP Raghunandran Rao) మాట్లాడుతు కేటీఆర్ తో పంచాయితి పెరిగిపోయిన తర్వాతే కేసీఆర్ ను ఉద్దేశించి కవిత లేఖ రాసినట్లు చెప్పారు.

పదవుల విషయంలోనే కాకుండా వసూళ్ళ పంపిణీలో కూడా అన్నా, చెల్లెళ్ళ మధ్య పంచాయితి పెరిగిపోయింది కాబట్టే అసంతృప్తితో కవిత తండ్రికి లేఖ రాసిందని ఎద్దేవాచేశారు. సరే, ఏలేటి, రఘునందనరావు ఆరోపణలు, విమర్శలు ఎలాగున్నా పార్టీలో కవిత భవిష్యత్తు ఏమిటి ? అన్నదే ఇపుడు ప్రశ్నార్ధకమైంది. ఎందుకంటే ఏ అధినేత అయినా తనను నేతలు నిలదీయటాన్ని, ప్రశ్నించటాన్ని ఏమాత్రం ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కేసీఆర్ కూడా మినహాయింపు కాదు. పార్టీలో కేసీఆర్ దాదాపు నియంతగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలోకి వచ్చినా సీనియర్ నేతలతో కలవటం అన్నది చాలా అరుదు. దేశంలోని ఏ పార్టీ అధినేతలు కూడా తమ పార్టీలోని సీనియర్ నేతలను కలవకుండా ఉండరు.

ఈ విషయంలో కేసీఆర్ రూటుమాత్రం సపరేటనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళల్లో మంత్రులను కలిసింది తక్కువే. అసలు వారాలతరబడి సచివాలయంకు వచ్చింది కూడా లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో సచివాలయంలో కాకుండా ఫామ్ హౌసులో ఉన్నదే చాలా ఎక్కువ. మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కేసీఆర్ అవకాశాలు ఇవ్వలేదని పార్టీలోనే పెద్ద చర్చ జరిగేది. తాను కలవాలని అనుకున్నపుడు మాత్రమే మంత్రులైనా, ఉన్నతాధికారులకు అయినా ఫామ్ హౌసులోకి ప్రవేశం. ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలైనా, పార్టీకి సంబంధించిన నిర్ణయాలైనా కేసీఆర్ ఎవరితో చర్చిస్తారా ? అసలు ఎవరితో అయినా చర్చిస్తారో లేదో కూడా తెలిసేదికాదు.

ఎందుకంటే లక్షపుస్తకాలు చదివి అపారమైన జ్ఞానాన్నిపొందిన తనకు సలహాలు ఇచ్చేది ఎవరనే ఆలోచన కేసీఆర్ లో ఉన్నదేమో. అందుకనే ఏవిషయంలో అయినా తన నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా ఉంటోంది. తననిర్ణయాన్ని ఎదురుప్రశ్నించిన వాళ్ళు లేరు, నిర్ణయాన్ని తప్పుపట్టిన నేతలూ లేరు పార్టీలో ఇప్పటివరకు. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించినా, తప్పుపట్టినా పార్టీలో సదరు నేతలకు అదే ఆఖరు రోజన్న విషయం అందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ నిర్ణయాలను ప్రశ్నించిన, తప్పుపట్టిన జగ్గారెడ్డి లాంటి నేతలు చాలామంది పార్టీలో నుండి బయటకు వచ్చేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వాళ్ళంటే బయటవ్యక్తులు కాబట్టి ప్రశ్నించినా, ఎదురుతిరిగినా కేసీఆర్ బయటకు గెంటేశారంటే అర్ధముంది. కాని ఇపుడు తన వైఖరిని ప్రశ్నించి, తప్పుపట్టిన గారాలపట్టి కవిత విషయాన్ని కేసీఆర్ ఏ విధంగా డీల్ చేయబోతున్నారు ? అన్నదే ఆసక్తిగా మారింది.

కేసీఆర్ ముందున్న మార్గాలేమిటి ?

తండ్రికి లేఖరాసి సంచలనానికి కారణమైన కవిత అమెరికా నుండి శనివారం తెల్లవారి హైదరాబాద్(Hyderabad) చేరుకుంటున్నారు. కవిత రాగానే కేసీఆర్ ఆమెను సంజాయిషి అడుగుతు షో కాజ్ నోటీసు జారీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. షోకాజ్ నోటీసు జారీఅయితే దానికి కవిత ఏమి సమాధానం ఇస్తారో చూడాలి. తాను లేవనెత్తిన ప్రశ్నలు ఇపుడు పార్టీలో సంచలనంగా మారిన నేపధ్యంలో సదరు లేఖను తాను రాయలేదని చెప్పేందుకు లేదు. ఎందుకంటే గురువారం రాత్రి లేఖబయటకు వచ్చినదగ్గరనుండి ఇప్పటివరకు లేఖ విషయంలో కవిత స్పందించలేదు. లేఖ విషయంలో ఎలాంటి స్పందనలేదు కాబట్టి మౌనం అంగీకారమనే అనుకోవాలి. కాబట్టి కవిత వచ్చిన తర్వాత పార్టీ క్రమశిక్షణా కమిటినుండి సంజాయిషికోరే అవకాశాలున్నాయి. లేఖబయటపడిన తర్వాత జరగబోయే పరిణామాలను కవిత ఊహించలేనంత అమాయకురాలు కారని గుర్తుంచుకోవాలి.

షోకాజ్ నోటీసుకు కవిత స్పందించే విధానాన్ని బట్టి ఆమెమీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఆధారపడుంది. తానుగనుక లేఖలోని అంశాలకు కట్టుబడి ఉంటానని అంటే పార్టీనుండి సస్పెండ్ చేయటమో లేకపోతే పార్టీకి రాజీనామా చేయమని అడగటమో ఏదో ఒకటి జరగచ్చని పార్టీనేతలు అభిప్రాయపడుతున్నారు. పైరెండింటిలో ఏది జరిగినా కొద్దిరోజులు పార్టీపై నెగిటివ్ ప్రచారం జరగటమైతే ఖాయం. జరిగే నెటిటివ్ ప్రచారాన్ని తట్టుకోవటం కేటీఆర్ కు పెద్ద తలనొప్పనే చెప్పాలి. అమెరికా నుండి తిరిగొచ్చిన కవితను కేసీఆర్ పిలిపించి మాట్లాడుతారా ? లేకపోతే కవితే తండ్రిని కలిసి మాట్లాడుతారా అన్నది ఆసక్తిగా మారింది. చూడాలి కవిత అమెరికా నుండి తిరిగొచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ?

Tags:    

Similar News