పులులు మాయం, కాగజ్ నగర్ అడవిలో ఆందోళన

కాగజ్ నగర్ లో రెండు పులుల మృతి కేసులో విచారణ ముందుకు కదలట్లేదు. మరోవైపు కనిపించకుండా పోయిన పులుల జాడ గురించి కూడా కచ్చితమైన సమాచారం అందుబాటులో లేకుండా పోయింది.

Update: 2024-01-12 06:43 GMT

కాగజ్ నగర్ లో పులుల మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికే రెండు పులులు మృతి చెందగా మరో నాలుగు పులుల జాడ తెలియట్లేదు. వాటి కోసం 120 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు అడవంతా అణువణువు జల్లెడ పడుతున్నాయి.

కనిపించకుండా పోయినా తల్లి మిగిలిన మూడు పిల్లల జాడ ఎట్టిపరిస్థితుల్లో అయిన కనిపెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో వాకర్స్ తో సహ ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంలో అడవిలో సెర్చింగ్ ఆపరేషన్ రెండో రోజు కొనసాగింది. కనీసం వాటి కళేబరాలు అయినా దొరకాలనే పట్టుదలతో అడవంతా గాలిస్తున్నారు.

మహారాష్ట్రలోని తడోబా ఫారెస్ట్ నుంచి ఓ ఆడపులి, మగపులి వచ్చి కాగజ్ నగర్ లోని అడవుల్లో ఆవాసం ఏర్పరచుకున్నాయి. వాటికి రెండు ఆడపులులు, రెండు మగపులులు జన్మించాయి. వాటిలోనే రెండు పులులు ప్రస్తుతం మరణించాయి. మరణించిన పులుల్లో ఒకటి తండ్రి పులిగా, రెండోది మగ పులిగా అధికారులు ప్రకటించారు. మొదట కూన పులి ఆధిపత్య పోరులో మరణించిదని అధికారులు భావించారు.

అయితే రెండో పులి మెడకు ఉచ్చు ఉండడం, పక్కనే ఉన్న ఆవు కళేబరంపై విషపు ఆనవాళ్ల ఉండడంతో రెండింటిని వేటగాళ్లు చంపిఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాటి శాంపిల్లను హైదరాబాద్ లోని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. వాటి నివేదిక వచ్చాక గానీ పూర్తి విషయాలు తెలియవు. అయితే అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ఫుటేజ్ లో అన్ని పులులు ఆవు కళేబరాన్ని తిన్నట్లు ప్రచారం జరగుతోంది. అయితే దీనిపై అధికారులు నోరు మెదపడంలేదు. పులులు కూడా రెండు రోజులుగా కనిపించకపోవడంతో అవి కూడా చనిపోయి ఉంటాయనే అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి.

అడుగు జాడల ఆనవాళ్లు ?

మంచిర్యాల జిల్లాలోని ఓ అటవీ ప్రదేశంలో పులులు అడగుజాడలు కనిపించినట్లు సెర్చింగ్ టీమ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే అవి కనిపించకుండా పోయిన పులులేనా, లేక కొత్త పులులేనా అని తెలుసుకోవడానికి కెమెరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వాటి ఫుటేజ్ చూసే వరకు ఏం చెప్పలేమని అధికారుల మాట. ఇప్పటి వరకూ అవి ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉంటాయనే అనుమానాలు ఉండేవి. అయితే తాజా పులిముద్రలతో అవి ఇంకా ఇక్కడే ఉన్నాయని తెలుస్తోంది. అవి ఆహారం కోసం కూడా ఓ దూడపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రదేశం కూడా చనిపోయిన పులుల ప్రదేశం నుంచి కాస్త దగ్గర ఉందని అధికారులు అంటున్నారు.

ఎనిమిది మంది అనుమానితుల అరెస్ట్

ఆవు కళేబరంపై విషం చల్లి, పులులు మృతి కారణమైన ఘటనలో అటవీ అధికారులు ఇప్పటికి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. అత్యంత గోప్యంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు బాలురు కూడా ఉన్నట్లు సమాచారం. 

Tags:    

Similar News