కేసీఆర్ వైఖరిపైన కవిత,హరీష్ ఇద్దరూ అసంతృప్తిగానే ఉన్నారా ?

కేసీఆర్ పై కవితలోని అసంతృప్తి లేఖ రాయటంతో బయటపడింది. హరీష్ అసంతృప్తి దేశపతి మాటల్లో బయటపడిందంతే;

Update: 2025-05-23 08:17 GMT
KCR and Kavitha, Harish

తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి గారాలపట్టి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ బయటపడినప్పటినుండి అనేకమందిలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. కేసీఆర్ వైఖరిపై కవితతో పాటు హరీష్ లో కూడా కొన్ని అంశాల్లో తీవ్ర అసంతృప్తిగానే ఉన్న విషయం అర్ధమవుతోంది. ఇంతకీ పై ఇద్దరిలో కేసీఆర్(KCR) వైఖరిపై అసంతృప్తి పెరగటంలో కామన్ పాయింట్లు ఏమున్నాయి ? ఏమున్నాయంటే ఈమధ్యనే జరిగిన పార్టీ రజతోత్సవ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగంలోని చాలా అంశాలు ఇద్దరికీ నచ్చలేదు. కేసీఆర్ ను ఉద్దేశించి కవిత ఈనెల 2వ తేదీన రాసిన లేఖ ఇపుడు లీకురూపంలో బయటపడి సంచలనంగా మారింది.

కవిత లేఖలో ప్రధానంగా ఉన్న పాయింట్లు ఏమిటంటే తననుబాగా ఇబ్బందిపెట్టిన బీజేపీ గురించి కేసీఆర్ బహిరంగసభలో 2 నిముషాలు మాత్రమే మాట్లాడటంపై కవిత(Kavitha) బాగా అసంతృప్తిగా ఉన్నారు. అలాగే బీసీలకు 42(BC Reservation) శాతం రిజర్వేషన్ అంశంపై కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు. దేశవ్యాప్తంగా వివాదాస్పదమై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న వక్ఫ్ బిల్లు సవరణ చట్టంపైన కూడా కేసీఆర్ మాట్లాడలేదు. ఈమధ్యనే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీచేయలేదన్న అంశంపై వివరణ ఇవ్వలేదు. 2001 నుండి కేసీఆర్ కు మద్దతుగా, వెన్నుదన్నుగా నిలిచిన నేతల్లో ఒక్కరిని కూడా వేదికమీదకు పిలిపించి మాట్లాడించకపోవటాన్ని కవిత తప్పుపట్టారు.

బీజేపీ విషయంలో కేసీఆర్ వైఖరి కారణంగా కమలంపార్టీతో బీఆర్ఎస్ కు లోపాయికారి అవగాహన ఉందన్న రేవంత్ రెడ్డి(Revanth) తదితరుల ఆరోపణలను నిజమని పార్టీ నేతలు, క్యాడర్, జనాలు నమ్ముతున్నట్లు తన లేఖలో కవిత ప్రస్తావించారు. ఇలాంటి అనేక అంశాల్లో కేసీఆర్ వైఖరిని తప్పుపడుతు, అసహనం వ్యక్తంచేస్తు తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. లేఖలో కవిత ప్రస్తావించిన అంశాలను కేసీఆర్ పట్టించుకుంటారా ? పట్టించుకుంటే కవితకు సమాధానం ఇస్తారా అన్నది కాలమే సమాధానంచెప్పాలి. కవిత లేఖ నేపధ్యంలో పార్టీలో హరీష్ రావు(Harish Rao) విషయమై చర్చ పెరిగిపోతోంది. పార్టీ నేతల చర్చలు సారంశం ఏమిటంటే కవిత, హరీష్ ఇద్దరూ కేసీఆర్ వైఖరిపైన, బహిరంగసభలో ప్రసంగంపైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు బయటపడింది.

హరీష్ లో కూడా కేసీఆర్ పట్ల అసంతృప్తిగా ఉన్నారనేందుకు ఆ పార్టీ నేత, ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఒక టీవీ చర్చలో దేశపతి ఏమన్నారంటే బహిరంగసభకు ముందు హరీష్ తనకు ఫోన్ చేసినట్లు దేశపతి చెప్పారు. బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడబోయే స్పీచ్ పాయింట్లు అడిగినట్లు చెప్పారు. తాను చెప్పగానే ఆ పాయింట్లు అన్నీ పాతవే కదా కొత్త డెవలప్మెంట్లు చాలా ఉన్నాయి కదా వాటిపై మాట్లాడచ్చుకదాని అడిగినట్లు తెలిపారు. తనతో హరీష్ చెప్పిన పాయింట్లనే నేరుగా కేసీఆర్ ను కలిసి మాట్లాడమని చెప్పినట్లు దేశపతి చెప్పారు. అయితే ఎందుకనో హరీష్ వచ్చి కేసీఆర్ ను కలవలేదన్నారు.

ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. అదేమిటంటే బహిరంగసభకు రెండునెలల ముందు సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లను హరీష్ ను దగ్గరుండి చూసుకోమని సీనియర్ నేతల సమీక్షలో హరీష్ ను కేసీఆర్ ఆదేశించారు. అయితే కొద్దిరోజుల తర్వాత ఏమైందో తెలీదుకాని హరీష్ 15 రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇదేవిషయమై దేశపతి మాట్లాడుతు ఏదో విషయంలో హరీష్ పై కేసీఆర్ ఆగ్రహంవ్యక్తంచేసినట్లు చెప్పారు. కుటుంబసభ్యులపై కుటుంబపెద్ద ఏదో విషయంలో కోప్పడటం సహజమే కదాని దేశపతి విషయాన్ని చాల తేలికగా తీసుకునే ప్రయత్నంచేశారు. 15 రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన తర్వాత హరీష్ యాక్టివ్ అయినట్లు దేశపతి చెప్పారు. అయితే ఇక్కడ దేశపతి చెప్పని విషయం ఏమిటంటే హరీష్ మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయినా సిల్వర్ జూబ్లి సమావేశ ఏర్పాట్లు మొత్తాన్ని కేటీఆరే(KTR) దగ్గరుండి చూసుకున్నారు.

హరీష్ విషయంలో దేశపతి చెప్పిన విషయాలు, తాజాగా కవిత లేఖలో ప్రస్తావించిన అంశాల్లో కొన్ని కామన్ పాయింట్లు ఉన్న విషయం అర్ధమవుతోంది. కబట్టే కేసీఆర్ వైఖరిపైన కవిత, హరీష్ ఇద్దరిలోను అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిపోతోంది. కేసీఆర్ పై కవితలోని అసంతృప్తి లేఖ రాయటంతో బయటపడింది. హరీష్ అసంతృప్తి దేశపతి మాటల్లో బయటపడిందంతే. కవిత, హరీష్ ఇద్దరూ లోలోపల మాట్లాడుకునే బయటకు ఇద్దరు విడివిడిగా వ్యవహరిస్తున్నారా ? లేకపోతే ఇద్దరూ కేసీఆర్ వైఖరిలో అసంతృప్తిగా ఉండటం యాధృచ్చికమా అన్నది తెలియాలి. ఏదేమన్నా లేఖ రూపంలో కవిత రేపిన దుమారం ఎంత ప్రభావంచూపిస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News